ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి
మార్చి, ఏప్రిల్‌లో టెన్త్ ఎగ్జామ్స్
ఏడాదిలో రెండు సార్లు విద్యార్థులకు వైద్య పరీక్షలు
“విద్యా క్యాలండర్ ‘2021-22’ విడుదల
ప్రజాపక్షం/హైదరాబాద్ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు 213 రోజులు తరగతులను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 23న పాఠశాలలకు చివరి పని దినంగా నిర్ధారించారు. ఫిబ్రవరి 28 నాటికి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సిలబస్‌ను పూర్తి చేయాలని, మార్చి లేదా ఏప్రిల్ నెలలో పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు “పాఠశాల విద్యా సంవత్సర క్యాలండర్- 2021- పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. ఇప్పటి వరకు జరిగిన 47 రోజుల ఆన్లైన్ తరగతులను పరిగణనలోకి తీసుకుని, మరో 166 రోజులు ప్రత్యక్ష తరగతులతో కలిపి మొత్తం 213 రోజుల పనిదినాలతో పాఠశాల విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దసరాకు 12 రోజులు, సంక్రాంతికి 6 రోజుల సెలవును ప్రకటించింది. పదో తరగతికి ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రీ ఫైనల్ పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల, వచ్చే నెలలో ఇన్స్పురై సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు నిర్వహించనున్నారు. కాగా హై స్కూల్‌ను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 నిమిషాల వరకు, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 8:45 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు తరగతులను నిర్వహిస్తారు. ఒకటి నుంచి 10వ తరగతులకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్ పూర్తి చేసి.. మార్చి 1 నుంచి పునశ్ఛరణ తరగతులను నిర్వహిస్తారు. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు డిసెంబరు 1 నుంచి 8 వరకు ఎస్ఎ1 పరీక్షలు జరుగుతాయి. ఒకటి నుంచి తొమ్మిది తరగతులకు అక్టోబరు 5న ఎఫ్ఎ1, ఫిబ్రవరి 28న ఎఫ్ఎ 2, ఏప్రిల్ 7 నుంచి 18 వరకు ఎస్ఎ 2 పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతికి అక్టోబరు 5 నాటికి ఎఫ్ఎ 1, డిసెంబరు 31రకు ఎఫ్ఎ 2 పరీక్షలు పూర్తి చేసి, ఫిబ్రవరి నెలాఖరు వరకు నిర్వహిస్తారు. వచ్చే నెలలో దివంగత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఎన్‌సిఇఆర్‌టి మార్గదర్శకాల ప్రకారం అన్ని పాఠశాలల్లో జాతీయ ఆవిష్కరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ వెల్లడించింది. పాఠశాలల్లో ప్రతీ నెల మొదటి శనివారం బాలసభ, 3వ శనివారం క్విజ్ పోటీలు, 4వ శనివారం స్వచ్ఛ పాఠశాల, హరితహారం, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఈ నెల 9న తెలంగాణ భాషా దినోత్సవం, డిసెంబరు 22న జాతీయ గణిత దినం, డిసెంబరు లేదా జనవరిలో పాఠశాల వార్షికోత్సవం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించాలని విద్యాశాఖ ప్రకటించింది. నవంబరు, జనవరి, ఫిబ్రవరిల్లో స్కూల్ కాంప్లెక్సు సమావేశాలు జరపాలని స్పష్టం చేసింది.
పాఠశాల సెలవులు
ప్రస్తుత విద్యా సంవత్సర సెలవుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా కొనసాగించనున్నట్టు ప్రకటించింది. పాఠశాలలకు అక్టోబరు 6 నుంచి 17 వరకు పన్నెండు రోజులు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 22 నుంచి 28 వరకు, అలాగే ఏడు రోజులు క్రిస్మస్ సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకు 6 రోజులు సంక్రాంతి సెలవులు, ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. ఇన్స్పురై సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 21 నుంచి అక్టోబరు 5 వరకు జిల్లా స్థాయి, అక్టోబరు చివరి వారంలో రాష్ట్ర స్థాయి, డిసెంబరు లేదా జనవరిలో జాతీయ స్థాయి ఇన్స్పురై పోటీలు ఉంటాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు ఏడాదిలో రెండు సార్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల సహాకారంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది.