HomeNewsBreaking News21వ శతాబ్ది ఆకాంక్షలకు అద్దం పడుతుంది

21వ శతాబ్ది ఆకాంక్షలకు అద్దం పడుతుంది

కొత్త పార్లమెంటు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వివి ధ పార్టీల నాయకులు, కేబినెట్‌ మంత్రులు, పలు దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. 2022లో పూర్తవుతుందని భావిస్తున్న పార్లమెంటు నిర్మాణానికి నేలను తవ్వే పనులు కూడా ప్రధాని ప్రారంభించారు. శృంగేరి మఠం పూజారులు ‘భూమిపూజ’ నిర్వహించా రు. తర్వాత సర్వమత ప్రార్థనలు జరిగాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ కూడా ఈ కార్యక్రమంలో ప్రార్థనలు చేశారు. పార్లమెంటు కొత్త భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం కానుంది. భారత ప్రజాస్వామ్య వారసత్వ నిదర్శనంగా రాజ్యాంగ మందిరంతోపాటు(కాన్సిట్యూషన్‌ హాల్‌), ఎంపీల లాంజ్‌, గ్రంథాలయం, వివిధ కమిటీలకు గదులు, భోజన వసతులు, తగినంత పార్కింగ్‌ వసతి ఇందులో భాగంగా ఉండనున్నాయి. కొత్త పార్లమెంటును 888 లోక్‌సభ, 384 రాజ్యసభ మొత్తం 1,224 మంది సభ్యలు కూర్చునేందుకు వీలుండేలా నిర్మిస్తున్నారు. ముందుముందు ఎంపీల సంఖ్య పెరిగే క్రమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత భవనంలో 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ సభ్యలు కూర్చునేందుకు మాత్రమే వీలుంది. పార్లమెంటు నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. అయితే పార్లమెంటు ప్రస్తుత భవనం సేవలు ఇకముందు కూడా కొనసాగుతాయి.
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయి
కొత్త పార్లమెంటుకు పునాదిరాయి వేయడం గురించి “భారత ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయి”గా అభివర్ణించారు ప్రధాని. పాత భవనం స్వాతంత్య్రం తర్వాత భారతదేశానికి దిశా నిర్దేశం చేస్తే, కొత్తది ఆత్మ నిర్భర్‌ భారత్‌కు సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన అన్నారు. కొత్త పార్లమెంటు నిర్మాణానికి ముందు చాలా కొత్త పనులు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ఇవి పని సంస్కృతిలో ఆధునిక విధానాలను చొప్పించడం ద్వారా ఎంపీల సామర్థ్యాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. “ఇది ఎంతో చరిత్రాత్మకమైన దినం. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు ఒక మైలురాయి” అన్న ప్రధాని “భారతదేశ ప్రజలమైన మనం ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని కలిసి నిర్మించుకుందాం. భారతదేశం తన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొనే నాటికి కొత్త భవనం ఒక స్ఫూర్తిగా నిలిచిపోతుంది” అని అన్నారు. ఈ సందర్భంగా 2014లో తాను తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టిన క్షణాల్ని గుర్తుచేసుకున్న ప్రధాని “పాత భవనంలో దేశ అవసరాలు తీర్చేదిశగా పనులు జరిగితే, కొత్తదానిలో 21వ శతాబ్ది ఆకాంక్షలు రూపుదిద్దుకుంటాయి” అని ప్రధాని తన ప్రసంగంలో వెల్లడించారు.
పార్లమెంటరీ చరిత్రలో కొత్త అధ్యాయం: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కొత్త పార్లమెంటు భవనం ఉజ్వలమైన భారతీయ ఆచారాలకు, విలక్షణమైన 21వ శతాబ్ది భారతీయ అస్థిత్వానికి అద్దం పడుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. శంకుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలియజేసేందుకు తనకెంతో సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. “2022లో మనదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమవుతున్న సందర్భంలో, దేశాల గౌరవం అందుకుంటున్న స్థితిలో, వందేళ్లుగా విరబూసిన భారతీయ ప్రజాస్వామ్య సంప్రదాయానికి సాక్షిగా నిలిచిన ప్రస్తుత పార్లమెంటు భవనానికి అతి సమీపంలోనే ఉండటం వల్ల సుసంపన్నమైన వారసత్వం, ఘనమైన చరిత్రతో పాతకొత్తల మేలు కలయికగా కొత్త భవనం ప్రతి భారతీయుణ్ని అనుసంధానం చేసే వేదికగా నిలుస్తుంది” అని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. అదే సమయంలో తన ఇళ్లలో, తరగతి గదుల్లో, ప్రయోగశాలల్లో, మన పొలాల్లో, కర్మాగారాల్లో, ఆటస్థలాల్లో, మన చట్టసభల్లో, న్యాయస్థానాల్లో, వార్తాపత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో రూపుదిద్దుకొని పైకి ఎగుస్తున్న, ఆకాంక్షలు కలిగిన, చైతన్యవంతమైన భారతదేశానికి కొత్త భవనం ప్రతీకగా ఉంటుందని ఆయన అన్నారు. సమకాలీన భారతదేశపు పునరుజ్జీవనం, ఉడ్డయనం, జన మనోగతం ప్రతిస్పందనకు చిహ్నంగా ఉంటుందనేందుకు కొత్త భవనం దివ్యమైన మైలురాయిగా ఉంటుందనడంలో సందేహం అవసరం లేదని వెంకయ్య నాయుడు ప్రధానమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. “కొత్త ప్రజాస్వామ్య దేవాలయం” విజయవంతమైన నిర్మాణం దేశ ఉజ్వలమైన పార్లమెంటు చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ఆయన అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments