బ్యూనస్ ఎయిర్స్(అర్జెంటీనా): భారత్‌లో తొలిసారిగా జి-20 సదస్సును 2022లో నిర్విహించనున్నారు. ఇది భారత్ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్భంగా జరగనుండడం విశేషం. అర్జెంటీనా రాజధానిలో శనివారం జరిగిన 13వ జి-20 సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రకటన చేశారు. 14వ జి-20 సదస్సును జపాన్, 15వ జి-20 సదస్సును సౌదీ అరేబియా నిర్వహించనున్నాయి. కానీ 2022లో జరిగే సదస్సుకు మాత్రం భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ‘2022లో భారత్ తన 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని చేసుకోనున్నది. ఈ ప్రత్యేక సంవత్సరంలో జి-20 సదస్సును భారత్ నిర్వహించనున్నది. ప్రపంచంలో వేగంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న భారత్‌కు రండి. భారత్ సుసంపన్న చరిత్ర, విభిన్నతలు, భారత్ ఇచ్చే ఆతిథ్యం గొప్పదనాన్ని వచ్చి చూడండి’ అని ప్రధాని మోడీ ఈ ప్రకటనానంతరం ట్వీట్ చేశారు. జి-20 గ్రూపులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యుకె, యుఎస్ దేశాలున్నాయి. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో జి-20 దేశాలదే 90 శాతం వంతు. ప్రపంచ వాణిజ్యంలో మూడింట రెండో వంతు. ఇక ప్రపంచ భూభాగంలో దాదాపు సగం వీటిదే. ఈ గ్రూపు 10 ఏళ్లు పూర్తిచేసుకున్న విషయాన్ని, సాధించిన విజయాలను ప్రధాని మోడీ ఈ సందర్భంగా వివరించారు.
2022లో జి-20 సదస్సుకు భారత్ తొలి ఆతిథ్యం: ప్రధాని మోడీ
RELATED ARTICLES