HomeNewsBreaking News2002 నాటి గుజరాత్‌ అల్లర్ల ఒరిజినల్‌ రికార్డులివ్వండి

2002 నాటి గుజరాత్‌ అల్లర్ల ఒరిజినల్‌ రికార్డులివ్వండి

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
బిబిసి డాక్యుమెంటరీపై కేసు ఏప్రిల్‌కు వాయిదా

న్యూఢిల్లీ : దేశంలో బిబిసి డాక్యుమెంటరీని నిషేధించడానికి దారితీసిన 2002 నాటి గుజరాత్‌ అల్లర్ల ఒరిజినల్‌ రికార్డులను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేందద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిబిసి ప్రసారం చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు వేరు వేరు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ నోటీసులు జారీ చేసింది. ప్రముఖ జర్నలిస్టు ఎన్‌.రామ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి మహువా మొయిత్రా, కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లతోపాటు మరో ప్రముఖ న్యాయవాది ఎం.ఎలశర్మ కూడా దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ కేంద్రానికి ఈ ఆదేశాలు వెళ్ళాయి. కేసు విచారణ ప్రారంభానికి ముందుగా ఈ రికార్డులు సమర్పించాలని కోరింది. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్‌ నెలకు వాయిదా వేసింది. అయితే కేసు విచారణ ప్రారంభానికి ముందుగా ధర్మాసనం, ఎందుకు పిటిషనర్లు తమ తమ హైకోర్టులను ఆశ్రయించకుండా సుప్రీంకోర్టుకు వచ్చారని ప్రశ్నించింది. “మేం నోటీసులు ఇస్తున్నాం, మూడు వారాల్లో కౌంటర్‌
అఫిడవిట్‌ దాఖలు చేయాలి, ఈ లోపు ప్రభుత్వం, ఇతర విభాగాలు కూడా ఒరిజినల్‌ రికార్డులు సమర్పిస్తాయి, ఆ తరువాత తేదీ నిర్ణయించి కేసు విచారణ చేస్తాం” అని ధర్మాసనం స్పష్టం చేసింది. తొలుత ఈ కేసు విచారణకు అంగీకరిస్తూ, వచ్చేవారం విచారణ ప్రారంభిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారధ్యానగల ధర్మాసనం జనవరి 30నస్పష్టం చేసింది. ఎన్‌.రామ్‌ తరపున న్యాయవాది సీనియర్‌ న్యాయవాది సి.యు.సింగ్‌ హజరయ్యారు. న్యాయవాది ఎం.ఎల్‌. శర్మ తన వ్యక్తిగతహోదాలో ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. “ప్రజల్ని అరెస్టు చేస్తున్నారు, ఐ.టి నిబంధనల కింద ఎమర్జెన్సీ అధికారాలు ఉపయోగిస్తున్నారు” అని శర్మ తొలుత ధర్మాసనాన్ని కోరారు. ఎన్‌.రామ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లు ఈ డాక్యుమెంటరీపై చేసిన ట్వీట్‌లను అత్యవసర అధికారాలు ఉపయోగించి తొలగించడంతో వారు కోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం దురుద్దేశంతో, ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఈ డాక్యుమెంటరీని నిషేధించిందని న్యాయవాది శర్మ తన వ్యాజ్యంలో విమర్శించారు. బిబిసి డాక్యుమెంటరీ రెండు భాగాలను న్యాయస్థానానికి తెచ్చి ప్రదర్శించి పరిశీలించాలని, 2002 లో గుజరాత్‌లో జరిగిన అల్లరకు ఎవరు బాధ్యులో, ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఎవరి జోక్యం ఉందో వారిపై చర్యలు కూడా తీసుకోవాలని కోరారు. రాజ్యాంగంలోని 19(1) (2) కింద వార్తలు, వాస్తవిక నివేదికలను పరిశీలించే హక్కు ప్రజలకు ఉందని, 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపై ప్రసారమైన ఈ డాక్యుమెంటరీని కూడా చూసే అధికారం ప్రజలకు ఉందని అన్నారు. బిబిసి డాక్యుమెంటరీని ఈనెల 21న నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంతిత్వ్రశాఖ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను అక్రమం, దురుద్దేశ పూరితం, రాజ్యాంగ విరుద్ధంగా శర్మ పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments