వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలపై దృష్టిసారించిన రైతన్నలు
దళారుల ప్రమేయంతో నష్టపోతున్న రైతాంగం
అంచనాలకు మించి దిగుబడులు
ఖమ్మం : రబీలో ఈ ఏడాది వరి, మొక్కజొన్న, వేరుశనగతో పాటు ఇతర పంటలపై రైతులు ప్రధాన దృష్టిసారించారు. యాసంగిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 2.50 లక్షల ఎకరాల్లో ఆయా పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని అనేక నియోజక వర్గాల్లో ఉన్న గ్రామాల్లో నాగార్జున సాగర్ కెనాల్ ద్వారా, ఇతర ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ఏర్లు, బావులు, బోర్లు కింద ఆయా పంట ల సాగుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఖరీఫ్‌లో వరి పంటలు కోతలు పూర్తి కాగానే యాసంగి పంటగా మరోమారు కూడా వరిని సాగు చేసుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో వరిని సాగు చేస్తుండగా 40వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో వేరుశనగ పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖాధికారులు రైతాంగానికి తమ శాఖ ద్వారా విత్తనాలను, ఎరువులను అందించేందుకు అధికారులను సమాయత్తం చేశారు. తెగుళ్ల భారిన పడకుండా నాణ్యతతో కూడిన విత్తనాలను సాగు చేసి లాభాలు గడించాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ ఏడాది కూడా యాసంగిలో పండే పంటలకు ముందస్తుగా గిట్టుబాటు ధరతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి నగదు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతాంగానికి కొంత మేర లాభం చేకూరుతుంది. మరోపక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయిస్తే సకాలంలో నగదు రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేటు వ్యాపారస్తులు రైతాంగానికి ఏర్పడిన ఇబ్బందులను ఆసరా చేసుకుని నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరీ.
నగదు చెల్లింపులో అధికార యంత్రాంగం వైఫల్యం
ఈ ఏడాది ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన వరి అంచనాలకు మించి దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన వరి ధాన్యానికి సకాలంలో నగదు చెల్లించడంలో జిల్లా అధికార యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందింది. గతేడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిని విక్రయించిన రైతాంగానికి ఇప్పటి వరకు నగదు చెల్లించలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అవగతమవుతుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో అంచనాలకు మించి మూడు లక్షల ఎకరాలకు పైగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వరి పంటను సాగు చేస్తే దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండడంతో పాటు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో అధికార యంత్రాంగం రకరకాల కొర్రీలు పెట్టి వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నా కొనుగోలు విషయంలో క్షేత్రస్థాయిలో రైతన్నలకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు సైతం అందని పరిస్థితి నెలకొంది.కొనుగోలు చేసిన ధాన్యా న్ని తరలించేందుకు కూడా సకాలంలో లారీలు లేకపోవడంతో ధాన్యం బస్తాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతు తీవ్రం గా నష్టపోతున్నాడు. కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో రైతుల యొక్క ఖాతాల్లో నగదు విషయం లో కూడా జాప్యం వహిస్తున్నారు. నగదు కోసం రైతు లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2.50 లక్షల ఎకరాల్లో సాగుకు సిద్ధం
RELATED ARTICLES