1998 డి.ఎస్.సి. బాధితులకు వాగ్దానభంగం!

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీకు తప్పక న్యాయం చేస్తానని తెలంగాణ సి.ఎం కె.సి.ఆర్ ఇచ్చిన స్పష్టమైన హామీ అమలు కోసం 1998 డి.ఎస్. సి బాధితులు అందరూ దింపుడు కళ్లం ఆశతో ఎదురు చూస్తున్నారు. జనవరి 3, 2016న తెలంగాణ భవన్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు గోడు చెప్పుకునేందుకు వెళ్లిన డి.ఎస్.సి-98 బాధితుల నుంచి స్వయంగా వినతిపత్రాలు తీసు కున్నారు. ఆయన క్యాంప్ కార్యాల యానికి (ప్రగతి భవన్) వెళ్లిన వెంటనే ముఖ్య మంత్రి ప్రత్యేక కార్యదర్శి (విద్య) రాజశేఖర్ రెడ్డితో ఫోన్ చేయించి పిలిపించుకున్నారు. రెండున్నర గంటలపాటు ప్రతినిధి బృందంతో చర్చలు జరి పారు. 5,000 మంది కాదు బాధితుల సంఖ్య అటూఇటుగా ఇంకో 500మంది ఉన్నా ఫర్వా లేదు. అధికారులు సహకరించకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అయినా మీ అందరికీ మానవతా దృక్పథంతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటాను అని వారికి అభయం ఇచ్చారు. విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరికి ఫోన్ చేసి డి.ఎస్.సి-1998 క్వాలిఫైడ్ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించాలని, వారికి ఉద్యోగాలు ఇచ్చేలా ఫైల్ సిద్ధంచేసి పంపించాలి అని విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. నోటిఫి కేషన్ ఇచ్చి వాస్తవికంగా ఎంతమంది క్వాలిఫైడ్ ఉంటారన్న లెక్కలు తేల్చండి అంటూ ముఖ్య మంత్రి సంబంధిత అధికారులకు హుకుం జారీ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి నోటివెంట వచ్చిన ఆ మాటలను విన్నటువంటి బాధితులు, వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. “వచ్చాడయ్యో సామీ..కొత్త రెక్కలను మొలిపించేటి హామీ” అంటూ పాటపాడుకున్నారు. సంతోష సంబరాలలో మునిగితేలారు.
ముఖ్యమంత్రి ఆదేశించినా బేఖాతర్
1998 సంవత్సరం లో నిర్వహించిన మెగా 1998 డి.ఎస్.సి సమయంలో ఆనాటి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ప్రస్తుతం కూడా అదే శాఖమంత్రిగా ఉన్నారు. అప్పుడు వరంగల్ , నల్ల గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో డి.ఎస్.సి-98 ఎస్.జి.టి రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో మెరిట్ అభ్యర్థులకు తీరని నష్టం జరిగింది. అంతే కాదు… సున్నా మార్కులు వచ్చిన వారికి టీచర్ ఉద్యోగాలు వచ్చి మెరిట్ అభ్యర్థులు రోడ్డున పడ్డారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని సి.ఎం. కె.సి.ఆర్ కడియం శ్రీహరిని ఆదేశించినా ఫలితం శూన్యం. ‘వారికి ఉద్యోగాలు ఇస్తే అన్నీ చిక్కు ముడులే’ అంటూ విద్యాశాఖ మంత్రి మీడియా ముందు మొసలికన్నీరు కార్చారు. 1998 డి.ఎస్.సి క్వాలిఫైడ్ సహా ఓల్డ్ డి.ఎస్.సి బాధితుల్లో అర్హులకు న్యాయం చేస్తామని వెల్లడిం చారు. ప్రభుత్వం 1998 డి.ఎస్. సి క్వాలిఫైడ్ సహా ఓల్డ్ డి.ఎస్.సి బాధితులకు ఉద్యోగాలు ఇవ్వా లని సూత్రప్రాయంగా నిర్ణ యించినట్లు ఒక ప్రభుత్వ ప్రక టన చేశారు. 2016 డిసెంబర్ వరకూ 1998 డి.ఎస్.సి బాధితు లకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో, మీడియా సమావేశా ల్లో పదే పదే చెప్పిన విద్యాశాఖ మంత్రి హఠాత్తుగా మాట మార్చారు. “ఎస్.సి-98 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వలేం” అంటూ ఆఫ్ ది రికార్డ్ చెప్పి లీకింగ్…బ్రేకింగ్ వార్త వదిలారు. ఆ తర్వాత కూడా కలిసిన డి.ఎస్.సి-1998 బాధి తులకు మభ్యపెట్టే మాటలు చెప్పారు. ముఖ్య మంత్రికి గోడు చెప్పుకుందా మంటే అప్పాయింట్ మెంట్ లభించక.. మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీల చుట్టూ తిరిగితే విద్యా శాఖ మంత్రి ని కలవండి అని వారు హితవు పలకడం నిత్య కృత్యంగా మారింది. చెప్పులరిగేలా సెక్రటేరియ ట్, మంత్రుల క్వార్టర్స్ చుట్టూ తిరిగినా ఉద్యోగాలు ఎండమావిలా మారాయి.
ఆశలపల్లకీ నుంచి..మృత్యుపల్లకీపైకి
ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మాట ఇస్తే వెనక్కు తగ్గరు. మెడ అయినా నరుక్కుంటారు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఇచ్చిన హామీని తప్పక అమలు చేస్తారు అనేది బయట జరుగుతున్న విస్తృత ప్రచారం. డి.ఎస్.సి-1998 బాధితుల సమస్యను స్పెషల్ కేసుగా పరిగణనలోకి తీసుకుని పరిష్కరిస్తా. వారంతా చెప్పులరిగేలా ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. వయోపరిమితితో సంబంధం లేకుండా వారికి మానవతా దృక్పథం తో టీచర్ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటాను అని ముఖ్యమంత్రి పదే పదే మీడియా ముందు చెప్పిన మాటలు ప్రజల్లోకి కూడా చొచ్చుకుపోయాయి. వరంగల్ ఎం.పి పసునూరి దయాకర్ అపూర్వ విజయం మీడియా సమావేశంలో కూడా ముఖ్య మంత్రి కె.సి.ఆర్ మంత్రుల సమక్షంలో “1998 డి.ఎస్.సి క్వాలిఫైడ్ బాధలు తీరుస్తాం. వారికి ఉద్యోగాలు కల్పిస్తాం” అని ప్రకటించడం అభ్యర్థు లను ఆశలపల్లకీలో ఊరేగించింది. కానీ అదే ఆశ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40మంది 98 డి.ఎస్.సి బాధితుల ప్రాణాలు తీసింది. ఉద్యోగా లు రావడంలేదు అన్న బాధగుండెల నిండా చేరి గుండెపోటుకు గురై మరణించడం దీనాతిదీనంగా మారింది.
ఒక తప్పును సరిదిద్దుకోలేక…
వంద తప్పులు
డి.ఎస్.సి-1998 మెగా డి.ఎస్.సి లో దాదాపు 40 వేల టీచర్ పోస్టుల భర్తీకి విద్యా శాఖ నోటి ఫికేషన్ ఇచ్చింది. రాత పరీక్ష 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు మొత్తంగా 100 మార్కులకు ఎస్.జి.టి ఉద్యోగాలకు పరీక్ష నిర్వ హించారు. ఓ.సి అభ్యర్థులకు 50, బి.సిలకు 45, ఎస్.సి&ఎస్.టి&వికలాంగ అభ్యర్థులకు 40 కనీస అర్హత మార్కులు (కటాఫ్) నిర్ణయిస్తూ జీ.ఓ నెంబర్ 221 నోటిఫికేషన్ పై పోస్టుల భర్తీకి చర్య లు చేపట్టింది. రాత పరీక్ష ఫలితాలు ప్రకటించే సమయానికి నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతున్నందున ఈ 4 జిల్లాలలో రాత పరీక్ష ఫలితాలను ప్రకటించలేదు. ఈ పరిణామం డి.ఎస్.సి-1998 అభ్యర్థుల పాలిట శాపమై కూర్చుంది. రాష్ట్రంలోని 19 జిల్లాలలో ప్రకటిం చిన డి.ఎస్.సి రాత పరీక్ష ఫలితాలలో ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది.
దీంతో…అప్పటి చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం మరో ప్రత్యేక జీ.ఓ విడుదల చేసి కటాఫ్ మార్కులను తగ్గించింది. ఓసి 45, బిసి 40, ఎస్.సి&ఎస్.టి, వికలాంగ అభ్యర్థు లకు 35 మార్కులను కనీస అర్హత మార్కులు (కటాఫ్)గా నిర్ణయించారు. ఇలా చేయని పక్షంలో సుమారు 15,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోతాయని భావించి ప్రభుత్వం జీ.ఓ నెంబర్ 618 విడుదల చేసింది. అయితే ఉపఎన్నికలు లేనటువంటి 19 జిల్లాలలో కనీస అర్హత (కటాఫ్)మార్కులను తగ్గిస్తూ ఇంటర్వ్యూ కోసం 1:2 చొప్పున రెండవ జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ఎన్నికలు పూర్తి అయిన తర్వాత నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రెండు జాబితాలను (కటాఫ్ మార్కులను తగ్గించకముందు 221 జీ.ఓ & తగ్గిం చిన తర్వాత 618 జి.ఓ) కలిపి ఒకేసారి ఇంటర్వ్యూ కోసం ఎంపిక అయిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం అవినీతి, అక్ర మార్కులకు వరంగా మారింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ (నేటి తెలంగాణ రాష్ట్రం) జిల్లాలు తప్ప మిగతా 19 జిల్లాల్లో డి.ఎస్. సి-1998 ఫస్ట్ లిస్టులో ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు అందరికీ టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఈ 4 జిల్లాలలో కటాఫ్ మార్కులు తగ్గించక ముందు అంటే 221 జీ.ఓ ప్రకారం మెరిట్ సాధించిన అభ్యర్థులు ఉద్యోగాలు రాకుం డా నష్టపోయారు. 2007లో ఈ 4 జిల్లాల్లో నష్ట పోయి మిగిలి పోయిన అభ్యర్థుల వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎ్ (D.S.E) ప్రత్యేక ఫార్మేట్ ద్వారా వివరాలు సేకరించింది. డి.ఎస్.సి-1998లో మిగిలిపోయిన 15,000 ఉపాధ్యాయ పోస్టులకు గాను 6,000 మంది మాత్ర మే ఉన్నారు అని D.S.E అధికారులు నిగ్గు తేల్చారు.
కోర్టు ఉత్తర్వుల అమలుకు విద్యాశాఖ ‘నో‘ కటాఫ్ మార్కులను (618 జీ.ఓ విడుదల) తగ్గించడం సరైన పద్ధతి కాదని, రాత పరీక్షలో ఎక్కువ మార్కులు (221 జీ.ఓ ప్రకారం) వచ్చిన మెరిట్ అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాలని 1999 లో ట్రిబ్యునల్ ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ 2000 సంవత్సరంలో విద్యా శాఖ హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు హైకోర్టు అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే, ఆ తీర్పును అమలు చేయని విద్యాశాఖ సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు ఉత్తర్వులు మేరకు నడుచుకోవాలని చెప్పిం ది. మరి కొన్నాళ్లకు విద్యాశాఖ తాము అభ్యర్థులు అందరికీ పోస్టింగులు ఇచ్చామని, అభ్యర్థులు లేనందువల్లే కటాఫ్ మార్కులు (618జీ.ఓ) తగ్గిం చాల్సి వచ్చింది అని సుప్రీంకోర్టుకు విన్నవించింది. అయితే ఉద్యోగాలు ఇవ్వకుండానే అందరికీ ఇచ్చామని విద్యా శాఖ సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వడాన్ని అభ్యర్థులు తప్పు పడుతూ 2005 లో ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. అప్పటినుంచి లిటిగేషన్ కొనసాగుతూనే ఉంది.
సి.ఎం కె.సి.ఆర్ సామీ…ఇంకెప్పుడు నెరవేరేను మీ హామీ!
2014 డిసెంబర్ నుంచి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ స్వయంగా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటానుఅని పలుసార్లు మీడియాకు వెల్లడించడంతో తప్ప కుండా ఉద్యోగాలు ఇస్తారు అనే నమ్మకాన్ని పెంచుకున్న క్వాలిఫైడ్ నిరాశే మిగిలింది. 1998 డి.ఎస్.సిలో బాధితులుగా ఉన్నవారు సుమారు 2,000 మంది ఉంటారు. విద్యా శాఖ అధికారులు 4,310 మంది ఉంటారని ప్రభుత్వా నికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు అని 1998 డి.ఎస్.సి సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్ తెలిపారు. డి.ఎస్.సి-98 క్వాలిఫైడ్ గత సీమాంధ్ర పాలకుల హయాంలో అడుగడు గునా అన్యాయానికి గురై తీవ్రంగా నష్టపోయారు అని, తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మినవారు భంగపడ్డారు. వీరికి న్యాయం జరిగేదెన్నడు?

 

 

 

 

 

 

-రావుల రాజేశం

 

DO YOU LIKE THIS ARTICLE?