19న బంద్‌

ఆర్‌టిసికి సంఘీభావంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన అఖిలపక్షం
నేటి నుంచి జరిగే నిరసన కార్యక్రమాలకు మద్దతు
హైదరాబాద్‌ : ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ నెల 19న రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా ఈ నెల 13న వంటా వార్పు, 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు బైఠాయింపు, హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద బహిరంగ సభ,15న రాస్తారోకో, మానవహారం, 16న విద్యార్థి సంఘాల ర్యాలీ, 17న ఉద్యోగులు, కార్మికుల ఆందోళన, ధూంధాం, 18న బైక్‌ ర్యాలీల నిర్వహణ, బంద్‌ ప్రచారం, 19న రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని అఖిలపక్షం తీర్మానించింది. ఆర్‌టిసి జెఎసి సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్‌టిసి జెఎసి ఆధ్వర్యం లో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీ లు, ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ (టిజెఎస్‌), పశ్యపద్మ (సిపిఐ), తమ్మినేని వీరభద్రం (సిపిఐ(ఎం), వి.హనుమంతరావు, అద్దంకి దయాకర్‌ (కాంగ్రెస్‌), రఘునందన్‌రావు (బిజెపి), సోమరంగారావు (సిపిఐ ఎం ఎల్‌ (న్యూడెమోక్రసి)), ప్రసాద్‌ (ఎంసిపిఐ), జస్టిస్‌ చంద్రకుమార్‌ (టిపిపి), మందకృష్ణమాదిగ (ఎంఆర్‌పిఎస్‌), సంధ్య (పిఒడబ్ల్యు), విమలక్క (అరుణోదయ సమాఖ్య), జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ (బిసిసంక్షేమసంఘం) చెన్నయ్య (మాలమహానాడు), శంకర్‌గౌడ్‌ (జనసేన), ఆర్‌టిసి జెఎసి కన్వీనర్‌ ఇ.అశ్వద్ధామరెడ్డి, కో-కన్వీనర్లు కె.రాజిరెడ్డి, వి.ఎస్‌.రావు, సుధా తదితరులు పాల్గొన్నారు. ఆర్‌టిసి సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అఖిలపక్ష సమావేశం తీవ్రం గా ఖండించింది. తక్షణమే ఆర్‌టిసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని తెలిపింది. కార్మికులు ఆత్మస్థుర్యైన్ని కోల్పోవద్దని తెలంగాణ పౌర సమాజం పూర్తి అండగా ఉందని సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపారు. పశ్యపద్మ మాట్లాడుతూ ఆర్‌టిసి సంస్థ నష్టాలకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు. సిఎంకు ఎలాంటి సంబంధం లేకపోయినా అధికార దర్పంతో కార్మికులను తొలగిస్తామనడం దొర పోకడలకు నిదర్శనమన్నారు. తక్షణమే తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. నాలుగు కోట్ల మంది ప్రజలు ఆర్‌టిసి కార్మికుల కోసం రోడ్లపైకి వస్తున్నారని ఆమె హెచ్చరించారు. అన్ని వర్గాలను సిఎం కించపరుస్తున్నారన్నారు. ఇవాళ ఆర్‌టిసి కార్మికులను తొలగిస్తున్నారని, నిన్న ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించి దళితులతోపాటు అన్ని వర్గాలను కించపరిచారని గుర్తు చేశారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆర్‌టిసి కార్మికులపై ప్రభుత్వం అణచివేత చర్యలు కొనసాగిస్తోందన్నారు. కెసిఆర్‌ నియంత ధోరణితో చెలరేగిపోతున్నారని, గద్దె దిగే రోజు అతిదగ్గరలో ఉందని హెచ్చరించారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపించడంతో చాలా మంది చనిపోయారని,దీనికి కారణమైన సిఎం కెసిఆర్‌పై మృతుల బంధువులు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలన్నారు. అలాగే ఇఎస్‌ఐ ఆసుపత్రిలో వైద్యం నిరాకరించినందుకు, ఇండస్ట్రియల్‌ వివాద చట్టం ప్రకారం నోటీస్‌ లేకుండా ఆర్‌టిసి ఉద్యోగులను తొలగించినందుకు, రూ.830కోట్ల పిఎఫ్‌ కుంభకోణంలో బాధ్యున్ని చేస్తూ సిఎంపై ఎక్కడి కక్కడ ఉద్యోగులు కేసులు నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విమలక్క మాట్లాడుతూ ధర్మయుద్ధంలో ప్రభుత్వం తలవంచక తప్పదని, టిఆర్‌ఎస్‌కు చెందిన కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలన్నారు. జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ తన న్యాయ వృత్తిజీవితంలో ముఖ్యమంత్రి చెప్పిన సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే పదమే వినలేదని ఎద్దేవా చేశారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఆర్‌టిసి కార్మికుల నిరసన కార్యక్రమాల్లో బిసి వర్గాలు కూడా ఉంటాయన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?