నలుగురు లేదా ఆరుగురు ఉంటారని ఊహాగానాలు
స్పీకర్ పదవిపై వీడని ఉత్కంఠ
ప్రజాపక్షం/ హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నెల 18న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సిఎం కెసిఆర్‌తో పాటు హోంమంత్రిగా మహమ్మద్ మహమూద్ అలీ మాత్రమే మంత్రివర్గంలో ఉన్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా మరో నలుగురు లేదా ఆరుగురితో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ముఖ్యంగా స్పీకర్ ఎవరన్నదే సీనియర్ ఎంఎల్‌ఎలలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే స్పీకర్ పదవిపై తాజా మాజీ మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్ అయిష్టత వ్యక్తం చేశారు. తాము స్పీకర్ పదవిలో ఉండలేమని ఆ ఇద్దరు నేతలు స్వయంగా సిఎం కెసిఆర్‌ను కలిసి విన్నవించుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత సభ్యులలో ఎంఐఎం నుంచి ముంతాజ్ అహ్మద్‌ఖాన్,టిఆర్‌ఎస్‌లో రెడ్యానాయక్ ఏడుసార్లు ఎంఎల్‌ఎగా గెలుపొందారు. దీంతో ఇందులో ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను ప్రొటేం స్పీకర్‌గా ప్రకటించగా, రెడ్యానాయక్‌కు స్పీకర్‌గా అవకాశం కల్పిస్తారా..? లేదా ఆయనను మంత్రి వర్గంలోనికి తీసుకుంటారా అనే ప్రచారం జరుగుతోంది. అలాగే తాజా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిని మంత్రి వర్గంలోనికి తీసుకోవాలా..? లేదా స్పీకర్‌గా అవకాశం కల్పిస్తారా అనేది పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే తాజా మాజీమంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేరు కూడా స్పీకర్ పదవి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గంలో తాజా మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు,ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు కొత్తగా ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వినయభాస్కర్, రేఖా నాయక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. తాజా మాజీ మంత్రులలో శాసనమండలి నుంచి కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి ఉన్నారు. వీరిని తిరిగి మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా అనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా గత కొంత కాలంగా కడియం శ్రీహరి తెలంగాణ భవన్‌కు తరచూ వస్తు కెటిఆర్‌ను కలుస్తున్నారు. అలాగే మరి కొందరు ఆశావహులు కూడా తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌ను కలుస్తున్నారు.