HomeNewsAndhra pradeshహాట్‌స్పాట్‌  జిల్లాలు 170

హాట్‌స్పాట్‌  జిల్లాలు 170

207 నాన్‌ హాట్‌స్పాట్‌ జిల్లాలు
మిగిలినవి గ్రీన్‌జోన్‌లుగా విభజన
జాబితాను ప్రకటించిన కేంద్రం
తెలంగాణలో రెడ్‌జోన్‌ (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) జిల్లాలు
హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్‌,
మేడ్చల్‌-మల్కాజిగిరి, కరీంనగర్‌, నిర్మల్‌

న్యూఢిల్లీ :  దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్లుగా గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 207 జిల్లాలను నాన్‌ హాట్‌స్పాట్‌ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్‌జోన్‌లోనూ ఉన్నట్లు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ సంయుక్త మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1118 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, దీంతో దేశం మొత్తంమీద కేసుల సంఖ్య 11,933 కి చేరిందని తెలిపారు. తాజాగా 39 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు 392 మంది ప్రాణాలు కల్పోయారని, వైరస్‌ బారిన పడిన వారిలో  1343 మంది కోలుకున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌  హాట్‌స్పాట్‌ కేంద్రాలు, నాన్‌ హాట్‌స్పాట్‌ కేంద్రాలు, గ్రీన్‌ జోన్లను గుర్తించామని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. హాట్‌స్పాట్‌  ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నిత్యావసర సేవలు మినహా రాకపోకలను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు. తాజా కరోనా వైరస్‌ కేసుల కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తూ శాంపిల్స్‌ను సేకరిస్తాయని పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం కోవిడ్‌ ఆరోగ్య కేంద్రాలను  ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 20 తర్వాత హాట్‌స్పాట్‌ కాని ప్రాంతాల్లో,  గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు సామూహిక సంక్రమణ వ్యాప్తి స్థాయికి కరోనా వైరస్‌ చేరలేదని కొన్ని చోట్ల స్థానిక వ్యాప్తి మాత్రమే ఉందని లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచే వచ్చి ఉంటుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్‌  చెప్పారు.
హాట్‌స్పాట్‌ల జాబితా విడుదల
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్‌స్పాట్‌ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 170 జిల్లాలను హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా ప్రకటించింది. లాక్‌డౌన్‌ కాలం పొడిగించినందున అవకాశం ఉన్నంత మేరకు కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్‌ రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాశారు. హాట్‌ స్పాట్‌ జిల్లాలతో పాటు కంటైన్‌మెంట్‌ ప్రదేశాల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపారు. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, ఆరెంజ్‌ నుంచి గ్రీన్‌జోన్‌కు మారుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో 19 జిల్లాలు హాట్‌స్పాట్‌ జాబితాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాలను.. తెలంగాణలో 8 జిల్లాలను హాట్‌స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో రెడ్‌జోన్‌ (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) జిల్లాలు: హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్‌, మేడ్చల్‌- కరీంనగర్‌, నిర్మల్‌
తెలంగాణలో రెడ్‌జోన్‌ (హాట్‌స్పాట్‌ క్లస్టర్‌) జిల్లాలు: నల్లగొండ
తెలంగాణలో ఆరెంజ్‌జోన్‌ (నాన్‌-హాట్‌స్పాట్‌) జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్‌. మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమరంభీమ్‌ ఆసిఫాబాద్‌, ములుగు, పెద్దపల్లి, నాగర్‌ కర్నూలు, మహబూబాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట.
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌జోన్‌ (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) జిల్లాలు: కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపూర్‌
మహారాష్ట్రలోనే 178మరణాలు..
దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో దాదాపు సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 178కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 353 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2687కి చేరింది. ముంబయిలో కొవిడ్‌- తీవ్రత ఆందోళనకరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత పెరిగింది. పాజిటివ్‌ కేసులు సంఖ్య 1561కి చేరింది. వీరిలో 30మంది మృత్యువాతపడ్డారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్లనుంచి బయటకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాజస్థాన్‌లో కొవిడ్‌- తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 987కి చేరగా ముగ్గురు మృత్యువాతపడ్డారు.
మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో పెరుగుతున్న మరణాలు…
మహారాష్ట్ర అనంతరం కరోనా వైరస్‌తో మరణించే వారిసంఖ్య మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో అధికంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 735మందికి కరోనా నిర్ధారణ కాగా వీరిలో 53మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్‌లో 695పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 30మంది ఈ వైరస్‌కు బలయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో 9, తెలంగాణలో 18మరణాలు..
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం  తెలంగాణలో 681పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 18మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 118మంది కోలుకోగా ప్రస్తుతం 514 మంది చికిత్స పొందుతున్నారు. కేవలం మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 37 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్‌ సోకి 9మంది మరణించగా మొత్తం 486 మందికి సోకింది. వీరిలో కేవలం ఒక్క గుంటూరు జిల్లాలోనే 114 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో కూడా వైరస్‌ తీవత్ర పెరిగింది. ఇప్పటివరకు కర్నూలులో 93 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments