నాలుగు రోజులపాటు సమావేశాలు
ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ఖాన్
ప్రజాపక్షం / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ శాసనసభ తొలిసారిగా ఈ నెల 17వ తేదీన సమావేశం కానుంది. మొత్తం నాలుగు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. తెలంగాణ ద్వితీయ శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యుల్లో సీనియర్ అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. 16న సా॥ 5 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహాన్ ప్రొటెం స్పీకర్‌గా ముం తాజ్ అహ్మద్ ఖాన్‌తో ప్రమాణస్వీకారం చేయిస్తారు. 17వ తేదీన శాసనసభ సమావేశాలు ఉదయం 11-30 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. సభలో నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండుగంటలు కొనసాగుతుంది. అదే రోజున స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ దాఖలు ప్రక్రియ జరుగుతుంది. 18న స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అనంతరం నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. ఆ తరువాత స్పీకర్ బిఎసి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 19న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఈ నెల 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం జరుగుతుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ కార్యదర్శి, ఉన్నతాధికారులతో సమావేశమై శాసనసభ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రజలు గొప్ప మెజారిటీతో తమను గెలిపించారని, ఆ స్ఫూర్తితో ఏకాదశి తిథినాడు శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించినట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. కాగా ఈ నెల 17న మధ్యాహ్నం జూబ్లీహాల్ ప్రాంగణంలోని శాసనమండలి లాన్స్‌లో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు విందు ఏర్పాటు చేశారు.