ఎన్నికల కమిషన్ గణాంకాలపై అనుమానాలు
అధికారుల పొరపాటా? కుట్రేమైనా జరిగిందా?
ఆందోళనలో అభ్యర్థులు
ప్రజాపక్షం/హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన అంకెలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత శాతం పోలింగ్ జరిగిందనే లెక్కలు చెప్పేందుకు ఎన్నికల కమిషన్ 24 గంటలకు పైగా సమయం తీసుకోవడం, ఇచ్చిన అంకెల్లో కూడా భారీగా తేడాలు ఉండడం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే అనుమానాలు కొందరు అభ్యర్థుల్లో తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ రెండు సార్లు వివరాలను ప్రకటించింది. అందులో మొత్తం 16 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల అంకె ల్లో వెయ్యి నుంచి 30వేల ఓట్ల వరకు తేడా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య హోరాహరీగా ప్రతిష్టాత్మకంగా కొనసాగిన ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారనుంది. అలాంటి సమయంలో 16 నియోజక వర్గాల్లో పోలైన ఓట్ల అంకెల్లో తేడాలు రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు ఏదైనా లెక్కలు తేడా చేశారా..? ఉద్దేశ్యపూర్వకంగా ఓట్లను గోల్మాల్ చేశారా..? రిటర్నింగ్ అధికారి పొరపాటున అంకెలు ఇచ్చారనుకుంటే అన్ని నియోజకవర్గాల్లో ఇదే జరుగుతుం దా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఈనెల 7వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగిసిన ఐదు గంటల వరకు ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ అదే రోజు రాత్రి మీడియాకు వెల్లడించారు. అయితే ఈ లెక్కలు మారడానికి అవకాశం ఉం దని, పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేం ద్రంలో అడుగుపెట్టిన వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని, కాబట్టి వారి కోసం ఐదు గం టలు దాటినా కూడా పోలింగ్ కొనసాగుతుందని ఆయనే స్పష్టం చేశా రు.అలా పెరిగిన ఓట్ల వివరాలను స్వయంగా రజత్కుమారే మరుసటి రోజు(డిసెంబర్8వతేదీ) రాత్రి మీడియాకు వెల్లడించారు.రెండు సార్లు వి డుదల చేసిన పోలైన ఓట్లు, ఓట్ల శాతం వివరా ల్లో కొన్నిదిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి.
13 స్థానాల్లో పోలైన ఓట్లు తగ్గాయి
కొన్ని నియోజక వర్గాల్లో ముందు ప్రకటించిన పోలింగ్ శాతం కంటే , తరువాత ప్రకటించిన ఓట్ల శాతం తక్కువగా ఉండడం గమనార్హం. అలా 13 నియోజకవర్గాలు ఉండడం విశేషం. నిజానికి ఐదు గంటల లోపు పోలింగ్ బూత్‌లోకి వెళ్ళిన వారందరికీ ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తారు. ఆ లెక్కన ఓట్ల శాతం పెరుగుతుందే తప్ప తగ్గదనేది సుస్పష్టం. అయితే అందుకు విరుద్దంగా జగిత్యాల,మానకొండూరు, పరిగి, వికారాబాద్, మేడ్చల్, నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, మక్తల్, నాగర్‌కర్నూల్, నర్సంపేట నియోజక వర్గాల్లో మొదటిరోజు ప్రకటించిన ఓట్ల కంటే, ఎన్నికల కమిషన్ రెండో రోజు ప్రకటించిన ఓట్లు తక్కువగా ఉన్నాయి.
పోలింగ్ సమయం పెరిగినా మారని ఓట్ల సంఖ్య
ఖమ్మం, సనత్‌నగర్, భూపాలపల్లిలో పోలింగ్ ఐదు గంటల తరువాత కొనసాగినప్పటికీ ఎన్నికల కమిషన్ ఐదు గంటల వరకు పోలైన ఓట్ల వివరాలనే యథాతథంగా తుది జాబితాలో కొనసాగించారు. ఖమ్మం నియోజకవర్గంలో సాయంత్రం ఐదు గంటల వరకు 73.98 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గంలో శుక్రవారం కొన్ని చోట్ల రాత్రి 8.30 గంటల వరకు పోలింగ్ సాగిందని రిటర్నింట్ అధికారి (ఖమ్మం మున్సిపల్ కమిషనర్) జె.శ్రీనివాస్‌రావు ‘ప్రజాపక్షం’కు తెలిపారు. దాని ప్రకారం అదనంగా వంద, రెండొందల పోలైన ఓట్ల శాతం 74 దాటాలి. కాని అలా చేయకుండా ఇసి పాత వివరాలనే ఇవ్వడం వెనుక మతలబును పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక భూపాలపల్లి, సనత్‌నగర్ నియోజక వర్గాల్లో కూడా ఇదే పరిస్థితి.ఆ నియోజకవర్గాల్లో సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్ జరిగిందని భూపాలపల్లి రిటర్నింగ్ అధికారి వెంకటచారి,సనత్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ గంగాధర్‌లు ‘ప్రజాపక్షం’కు ధృవీకరించారు. రెండు చోట్ల అదనంగా గంటన్నర పాటు పోలింగ్ జరిగినప్పటికీ ఇసి వెల్లడించిన రెండు వివరాల్లో కూడా ఒకే అంకెలు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారులు పోలింగ్ రోజున సాయంత్రం ఐదు గంటల వరకు పోలైన శాతంపై సిఇఒ కార్యాలయానికి పంపిన నివేధికలు, పోలింగ్ ముగిశాక పోలింగ్ శాతంపై పంపిన నివేదికలు తేడారావడంపై అభ్యర్థుల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్ కాంగ్రెస్ నియోజక వర్గం అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఇవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టుకు సైతం వెళ్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో ఓట్ల శాతం గోల్మాల్ అయిన 16 నియోజక వర్గాల అభ్యర్థులు సైతం ఉన్నట్లు సమాచారం.