ముందుగా మూడు కోట్లమందికి
మిగిలినవారికి ఆ తర్వాత
న్యూఢిల్లీ: భారత్ కొవిడ్ 19 టీకా కార్యక్రమాన్ని జనవరి 16న మొదలుపెట్టనుంది. ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమంగా దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇందులో దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య, ముందువరస కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్ 19, ఇంకా టీకా సన్నద్ధతకు స్థితిని ప్రధానమంత్రి సమీక్షించారు. “సవివర సమీక్ష తర్వాత, రాబోయే లోహ్రి, మకర సంక్రాంతి, పొంగల్, మాఘ్ బిహు మొదలైన పండగలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్ 19 టీకా కార్యక్రమాన్ని 2021 జనవరి 16న మొదలుపెట్టనున్నట్లు” ఒక ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. ఆరోగ్య కార్యకర్తలు, ముందువరస కార్యకర్తల తర్వాత 50 ఏళ్లు పైబడినవారు, 50 ఏళ్లలోపు ఇతర వ్యాధులు ఉన్న 27 కోట్లమందికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. తర్వాత జనవరి 16 నాడు కొవిడ్ 19 పోరాటంలో భారత్ చరిత్రాత్మక అడుగు వేయనుందని మోడీ ట్వీట్ చేశారు. “ఆ రోజు (జనవరి 16) నుంచి దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం మొదలవుతుంది. మన సాహసికులైన డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, సఫాయీ కర్మచారులతో కలుపుకొని ముందువరస కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తారు” అని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలే భారత్ రెండు టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది. అవి సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన ఆక్స్‌ఫర్డ్ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి అయిన కొవాగ్జిన్. ఈ రెండు టీకాలు కూడా సురక్షితం, రోగ నిరోధకం అని ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది.
కోలుకున్నవారిలో అగ్రస్థానం భారత్‌దే
ప్రస్తుతం దేశంలో 2,24,190 క్రియాశీల కరోనా కేసులు ఉన్నాయి. ఒక కోటికి పైగా నమోదైన మొత్తం కేసులలో ఇది 2.16%. 1,50,000 మందికి పైగా మరణించారు. అయితే దేశంలో వైరస్ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పడుతోంది. సెప్టెంబర్‌లో అత్యధికంగా 98,000 కేసులు నమోదైన దశ నుంచి ప్రస్తుతం రోజుకు 20.000 లోపు కేసులే నమోదవుతున్న దశకు చేరుకుంది. అయినప్పటికీ అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధిక కొవిడ్ కేసులు నమోదైన రెండో దేశం భారత్. అగ్రరాజ్యం అమెరికాలో భారత్‌కు రెట్టింపు సంఖ్యలో అంటే 2 కోట్ల కేసులు నమోదయ్యాయి. 3,70,000 కొవిడ్ మరణాలతో అగ్రరాజ్యమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్(2 లక్షలు), భారత్(1.5 లక్షలు) నిలిచాయి. ఇక కోటికి పైగా కొవిడ్ బాధితులు కోలుకోవడంతో ఈ జాబితాలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండటం విశేషం.
కొ విన్ డిజిటల్ వేదిక
ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనే కొ విన్ టీకా డెలివరీనిర్వహణ వ్యవస్థ గురించి మోడీ వివరించారు. టీకా నిల్వలు, వాటి నిల్వ ఉష్ణోగ్రత, టీకా లబ్ధిదారుల రియల్ టైం సమాచారాన్ని అందించేందుకు కొ విన్ అనేది డిజిటల్ వేదిక. ఇంకా అన్ని స్థాయుల కార్యక్రమ నిర్వాహకులకు ఇది సహాయకారిగా ఉంటుంది. ముందుగా నమోదు చేసుకున్న లబ్ధిదారులకు సమయాన్ని తెలపడం, దానిని నిర్ధారించడం, టీకా షెడ్యూల్ అయిపోయాక ఒక డిజిటల్ ధ్రువపత్రాన్ని జారీచేయడం లాంటివి దీని ద్వారా ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఈ వేదికపై ఇప్పటికే 79 లక్షలకుపైగా లబ్ధిదారులు నమోదు చేసుకున్నారని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
సర్వసన్నద్ధం
టీకా కార్యక్రమం కోసం జాతీయ స్థాయి శిక్షణలో భాగంగా రాష్ట్రాల ఇమ్యునైజేషన్ అధికారులు, కోల్డ్ చైన్ అధికారులు, ఐఇసి అధికారులు, అభివృద్ధి భాగస్వాములు తదితరులకు మొత్తం 2,360 మందికి శిక్షణ అందించారు. దీనికితోడుగా రాష్ట్రాలు, జిల్లాలు, మండలాల్లో కలుపుకొని 61,000 కార్యక్రమ నిర్వాహకులు, 2,00,000 టీకాలు వేసేవాళ్లు, 3,70,000 మంది ఇతర టీకా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. శుక్రవారంతో జరిగిన కార్యక్రమంతో కలుపుకొని దేశంలో మొత్తం మూడు దశల టీకా డ్రై రన్‌లు నిర్వహించారు. శుక్రవారం నాడు 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 615 జిల్లాల్లో 4,895 కార్యస్థలాల్లో డ్రై రన్ నిర్వహించారు.
టీకా కార్యక్రమం మొత్తాన్ని కూడా ప్రజల భాగస్వామ్యం(జన్ భాగిదారీ), ఎన్నికల అనుభవాలు(బూత్ స్థాయి వ్యూహం), సార్వత్రిక టీకా కార్యక్రమ అనుభవాల ఆధారంగా కొనసాగిస్తామని ఆరోగ్య శాఖ సూచించింది. ఎక్కడా రాజీపడకుండా టీకా కార్యక్రమం క్రమబద్ధంగా, సాంకేతికత సహాయంతో సాఫీగా జరుపుతారు. ఇక ప్రవాస భారతీయుల సమావేశంలో భారత్ రెండు స్వదేశీ టీకాలతో సిద్ధంగా ఉందన్నారు ప్రధానమంత్రి మోడీ. ప్రపంచం టీకాల కోసం వేచి ఉండటమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని భారత్ ఎలా చేపడుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు.
16న టీకా
RELATED ARTICLES