HomeNewsTelangana140 కోట్ల ప్రజల ఆశలకు ప్రతీక

140 కోట్ల ప్రజల ఆశలకు ప్రతీక

నలుగురు గగనయాన్‌ వ్యోమగాములను పరిచయం చేసిన ప్రధాని మోడీ
తిరువనంతపురం :
భారతదేశం ప్రతష్టాత్మకంగా తలపెట్టిన మొట్టమొదటి మానవసహిత గగన్‌యాన్‌ సాహస కార్యక్రమంలో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ప్రకటించారు. ఈ యాత్రలో పాల్గొనే గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్‌ బాలకృష్ణ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్‌ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లాలను ప్రధానమంత్రి ప్రపంచానికి మొదటిసారి పరిచయం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌, విదేశీ వ్యవహారరాలశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌, ఇసో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1984లో మొదటిసారి రష్యా సహకారంతో భారత వైమానిక దళ పైలట్‌ రాకేశ్‌ శర్మ నాలుగురోజులపాటు అంతరిక్ష యాత్ర చేశారు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత భారతదేశం తన స్వశక్తితో సకల హంగులూ సమకూర్చుకుని స్వయంగా మానవసహిత గగనయాన్‌ చేసేందుకు సిద్ధమైంది. “ఈసారి కౌంట్‌డౌన్‌ మనదే, రాకెట్‌ మనదే” అని ప్రధానమంత్రి అన్నారు. గగనయాన్‌కు సంబంధించిన యాత్రలో ఎక్కువభాగాలన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవేనని, భారతదేశ విజయానికి ఈ నలుగురు వ్యోమగాముల పేర్లూ ముడిపడి ఉన్నాయన్నారు. ఎంతో సుశిక్షితులుగా వీరు తయారయ్యారని, యోగా కూడా అభ్యాసం చేశారని, సవాళ్ళను తట్టుకుని నిలబడి, కృతనిశ్చయంతోఈ అమృతకాల తరంలో భారత్‌కు 21వ శతాబ్దంలో ప్రపంచస్థాయీ పాత నిర్వహించేందుకు వారు ప్రతిష్ట తెస్తారన్నారు.అదేవిధంగా భారత అంతరిక్ష కార్యకలాపాలలో మహిళలు ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి ప్రశంసించారు. భారతదేశం గడచిన పదేళ్ళలో సాధించిన అంతరిక్ష విజయాలను ప్రధానమంత్రి వివరించారు. ఈ పదేళ్లలో దేశం 400 శాటిలైట్లను ప్రయోగించిందన్నారు. ఎంతోమంది యువకులు ఈ రంగంలోకి స్టార్టప్‌లతో వస్తున్నారని ప్రశంసించారు. ఈ నలుగురు వ్యోమగాములూ కొద్దికాలం రష్యాలో శిక్షణ పొంది వచ్చారు. ప్రస్తుతం ఇస్తో ఆధ్వర్యంలోనే శిక్షణ పొందుతున్నారు. మూడు రోజులపాటు మన భారత వ్యోమగాములు అంతరిక్షంలో పర్యటించి పరలు పరీక్షలు జరిపి తిరిగి భూమికి చేరుకుంటారు. ఇందుకు అవసరమైన దేశీయ వ్యోమనౌకను కూడా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సిద్ధం చేస్తున్నది. భారతదేశం మొదటిసారి దేశీయ ప్రయోగంతో స్వదేశీ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ వ్యోమగాములు నలుగురూ భారతదేశ 140 కోట్లమంది ప్రజల ఆశలు, ఆశయాలను అంతరిక్షంలోకి తీసుకువెళతారని తిరువనంతపురం సమీపంలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం (విఎస్‌ఎస్‌ఎల్‌) ఆడిటోరియంలో ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు. గగన్‌యాన్‌ విశిష్టతను కూడా ఆయన తెలియజేశారు. వ్యోమగాముల పేర్లు ప్రకటించడం ద్వారా స్వదేశీ జ్ఞానంతో తలపెట్టిన గగన్‌యాన్‌లో మరో మైలురాయికి శ్రీకారం చుట్టినట్లయింది. ఇటీవలనే వ్యోమగాములు ప్రయాణించే నౌక ఇంజిన్‌కు తుది విడత కఠిన పరీక్షలు విజయవంతంగా పూర్తిచేశారు. వ్యోమగాములు తిరిగి భూమి మీదకు చేరుకునే సమయంలో భూ వాతావరణంలో ప్రవేశించాక నౌక వెనుకభాగంగా తెరుచుకునే బెలూన్లు తెరుచుకుంటున్నాయో లేదో కూడా పలుసార్లు విజయవంతగా పరీక్షలు నిర్వహించారు. భారతదేశంలోని 140 కోట్లమంది ప్రజల ఆశలకు, ఆశయాలకు ఈ నలుగురు వ్యోమగాములు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల ఆశయాలను మోసుకువెళతారని ప్రధానమంత్రి అన్నారు. అంతరిక్షంలో దేశం స్వయం సమృద్ధికి గగన్‌యాన్‌ ఒక చిహ్నమని ఆయన అన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే అంగారక గ్రహం (కుజగ్రహం) మీదకు తొలి ప్రయత్నంలో విజయవంతంగా వెళ్ళాయని, సుమారు 100 శాటిలైట్లకు పైగాప్రయోగించారని, చంద్రుడి దక్షిణధృవం మీదకు చాలా విజయవంతంగా భారత్‌ నౌక చేరిందని, ఆదిత్య ఎల్‌ 1 కూడా భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఒక స్థిరకక్షవద్ద ఉండి సూర్యుడిపై ప్రయోగాలు చేస్తున్నదన్నారు. భారతదేశ అంతరిక్ష ఆర్థిక రంగం రాబోయే పదేళ్ళ కాలంలో 44 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని, ఇప్పుడున్నదానికంటే ఐదురెట్టు పెరుగుతుందని అన్నారు. అంతరిక్ష రంగంలోభారతదేశం ప్రపంచ కేంద్రంగా మారనున్నదన్నారు. మనదేశం 2035 నాటికి మరోసారి చంద్రుడిమీదకు ఉపగ్రహాలను తీసుకువెళుతుందని, అక్కడే ఒక అంతరిక్ష కేంద్ర నిర్మాణం కూడా చేస్తుందని అన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి రూ.1,800 కోట్లు విలువైన ఇస్రో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. విఎస్‌ఎస్‌సిలో పర్యటించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments