14 రోజుల నుంచి 28 రోజులకు!

రాష్ట్రంలో హోం క్వారంటైన్‌ గడువు పెంపు
14 రోజులు దాటినా బయటపడని కరోనా లక్షణాలు
 ప్రైమరీ కాంటాక్టులకే కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
లక్షణాలు లేని సెకండరీ కాంటాక్టులకు టెస్టులు చేయకుండా 28 రోజులు క్వారంటైన్‌లో ఉండేలా  సూచన

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కరో నా లక్షణాలున్న వారికి హోం క్వారంటైన్‌ గడువును 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచింది. రాష్ట్రంలో కొంత మందికి లక్షణాలు 28 రోజుల వరకూ బయటపడటంలేదని తెలుస్తోంది. దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రభు త్వం పేర్కొన్నది. దీంతో హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ఇకపై 14 రోజులు కాకుండా 28 రోజులు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా టెస్టు ల విషయంలోనూ ప్రభుత్వం కొత్త  మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. కేవలం ప్రైమరీ కాంటాక్టులకే కరోనా పరీక్షలు చేయాలని పేర్కొన్నది. సెకండరీ కాంటాక్టులను టెస్టులు చేయొద్దని అధికారులకు స్పష్టం చేసింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌ గడువు 14 రోజులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ 14 రోజుల సమ యం నుంచి తాజాగా 28 రోజులకు పెంచారు. కొన్ని కేసుల్లో 28 రోజుల వరకు వైరస్‌ లక్షణాలు బయటపడటం లేదని గ్రహించిన అధికారులు హోం క్వారంటైన్‌ గడువును పెంచాలని ప్రతి పాదించడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరైతే పాజిటివ్‌ వ్యక్తులతో సంబంధాలు ఉన్న ప్రైమరీ కాంటాక్టులను మాత్రమే  ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి వారి శాంపిళ్లను తీసుకొని వైద్య పరీక్షలు చేయనున్నారు. లక్షణాలు లేని సెంకడరీ కాంటాక్టులను మాత్రం వైద్యపరీక్షలు అవసరంలేదని ప్రభుత్వం సూచించి, ఇలాంటి వారిని హోమ్‌ క్వారంటైన్‌లోనే 28 రోజుల వరకు ఉంచి పర్యవేక్షించాలని అన్ని జిల్లా అధికారులకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రైమరీ కాంటాక్టులకు పాజిటివ్‌ వస్తేనే సెంకడరీ కాంటాక్టులకు టెస్టులు
తెలంగాణలో పెరుగుతున్న కేసుల్లో కొన్ని ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం వైద్య వర్గాల్లో కలవర పెడుతున్న అంశం. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో సంబంధం ఉండి లక్షణాలున్న ప్రైమరీ కాంటాక్టులను, సెకండరీ కాంటాక్టులను ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. వీరికి ఒక వేళ పాజిటివ్‌ వస్తే ఆసుపత్రిల్లో ఉంచి చికిత్సను 14 రోజుల వరకు అందిస్తున్నారు. ఈ చికిత్స కాలంలో వైరస్‌ శరీరంలో ఉందా లేదా అని కరోనా టెస్టులు నిర్వహిస్తుంటారు. చికిత్స కాలం అయిన తరువాత మరొక సారి టెస్టు చేసి నెగెటివ్‌ అని తేలితే డిశ్చార్జి చేసి సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌లోనే మరో 14 రోజుల వరకు ఉండాలని సూచిస్తారు. ఈ 14 రోజులు కూడా వైద్య సిబ్బంది వీరి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తుంటుంది. ఇలా రెండు, మూడు దఫాలుగా కరోనా బాధితుడు కోలుకునే దాకా రోగిగి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. అలాగే లక్షణాలు లేని సెంకడరీ కాంటాక్టులను 14 రోజుల వరకు హోమ్‌క్వారంటైన్‌లోనే ఉంచుతున్న సందర్భాలున్నాయి. 14 రోజులు పూర్తి అయిన తరువాత ఆ వ్యక్తిలో లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో అప్పటికే ఆ వ్యక్తి ద్వారా మరి కొంత మందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లక్షణాలు లేని సెంకండరీ కాంటాక్టులను మాత్రం 28 రోజుల వరకు హోమ్‌ క్వారంటైన్‌కి తరలించి, ప్రైమరీ కాంటాక్టులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రైమరీ కాంటాక్ట్‌కు వైద్య  పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలితేనే సెకండరీ కాంటాక్టు వ్యక్తికి టెస్టులు చేసేలా చర్యలు చేపడుతున్నారు. అది కూడా ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉంటేనే. ఒక వేళ సెకండరీ కాంటాక్టుకు ఎలాంటి లక్షణాలు లేకుంటే 28 రోజుల వరకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో హోమ్‌ క్వారంటైన్‌లోనే ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల వల్ల అవసరమైన వారికే వైద్యపరీక్షలు చేయడం జరుగుతోంది. దీంతో కిట్ల కొరత సమస్య తలెత్తకుండా ఉండే అవకాశం కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?