బీజింగ్ : చైనాలో ఉన్నత చదువులను ఆశించే 1,300 మంది భారత విద్యార్థులకు ‘చైనా వీసాలు’ మంజూరయ్యాయి. చైనా విదేశాంగశాఖ ఆసియా వ్యవహారాల విభాగం డైరెక్టర్ జనరల్ లియు జిన్‌సాంగ్ ఈ విషయం వెల్లడించారు. భారత దౌత్యవేత్త ప్రదీప్ కుమార్ రావత్‌తో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం తెలియజేశారు. కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోవడం, విద్యాలయాల కార్యకలాపాలు స్తంభించిన పరిణామాల అనంతరం పరిస్థితులు చక్కబడ్డాక చైనా ఈ విధంగా వీసాలు మంజూరు చేయడం భారత విద్యార్థులకు శుభవార్తే నని జిన్‌సాంగ్ అన్నారు. భారతదేశంలో గడచిన ఆగస్టు 24 నుండి చైనా దౌత్యకార్యాలయం స్టూడెంట్ వీసాలకు దరఖాస్తులు ఇవ్వడం ప్రారంభించింది. విద్యార్థులు, వ్యాపారులు, కుటుంబాలు, పర్యాటక వీసాలతోపాటు 10 రకాల వీసాల మంజూరుకు చైనా దౌత్యకార్యాలయం రెండు నెలలుగా దరఖాస్తులు ఇవ్వడం ప్రారంభించింది. చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్న సుమారు 23,000 మందిపైగా భారతీయ విద్యార్థులు కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా 2019 నుండి భారత్‌లోనే ఉండిపోయారు. భారత విద్యార్థుల చైనా చదువులు త్వరలో తిరిగి మొదలవుతాయన్నారు. అదేవిధంగా తూర్పు చైనా ఝెజియాంగ్ రాష్ట్రంలోని ఇవు ప్రాంతానికి 300 మంది భారతీయ వ్యాపారుల ఛార్టర్ట్ విమానాలను అనుమతించిన విషయం కూడా వారి సమావేశంలో చర్చకు వచ్చింది.ఆగస్టు 9న 107 మంది భారతీయ వ్యాపారులతో కూడిన ఛార్టర్ విమానం తూర్పు చైనా హాంగ్‌హ్యూలో దిగింది. సెప్టెంబరు 23న మరో 130
మంది వ్యాపారవేత్తలు చైనా వెళ్ళారు. రెండు దేశాలమధ్య కరోనా అనంతరం ప్రజలమధ్య జరుగుతున్న ఆదాన ప్రదానాలను ఈ సందర్భంగా ప్రదీప్‌కుమార్, జిన్‌సాంగ్‌లు సమీక్షించారు. చైనా అందిస్తున్న సహాయంపట్ల ప్రదీప్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ద్వైపాక్షిక అంశాలను కూడా వారు ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా చైనా కమ్యూనిస్టుపార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జిన్‌సాంగ్‌కు ప్రదీప్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సోషల్ మీడియా రాతలపై
చైనా మండిపాటు
చైనాలో అధికార నాయకత్వానికి వ్యతిరేకంగా రాసిన రాతలపై చైనా మండిపడింది. తక్షణం స్పందించి రంగంలోకి దిగి అలాంటి రాతలన్నింటినీ తొలగించింది. రాజధాని బీజింగ్‌లోని రద్దీగా ఉండే కూడలి ప్రాంతాల్లో కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ బ్యానర్లు వెలిశాయని సోషల్ మీడియాలో రాసిన రాతలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధింత విభాగం రంగంలోకి దిగి వాటన్నింటినీ నిర్మూలించింది. జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వెలిసిన పోస్టర్లకు సంబంధించిన ఇమేజ్‌లు, పోస్టింగులను తొలగించింది. చైనాలో రాజకీయ వ్యతిరేకత చాలా తక్కువ. ఆ ప్రాంతంలో దుకాణదారులు కూడా ఇక్కడ అలాంటి బ్యానర్లు ఏవీ లేవని స్పష్టం చేశారు.
1,300 మంది భారత విద్యార్థులకు చైనా వీసాలు
RELATED ARTICLES