ఓటర్ల సంఖ్య ప్రకారమే బిసిల రిజర్వేషన్లు
మొత్తం 50 శాతానికి మించకుండా రిజర్వేషన్ల ఖరారు
మార్గదర్శకాల అనంతరం ఫైనల్
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 12,734 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17 పంచాయతీల పాలకవర్గాల గడువు మరో ఏడాది ఉన్నందున వాటికి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈ మేరకు వివిధ పంచాయతీలలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అటు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇటు పంచాయతీరాజ్ శాఖ నిమగ్నమైంది. ఇప్పటికే పంచాయతీలలో వార్డులు, పోలింగ్ స్టేషన్లను ఖరారు చేసుకోవడమే కాకుండా అవసరమైన సిబ్బంది, బ్యాలట్ బాక్సులు, బ్యాలట్ పేపర్లను సిద్ధం చేశారు. ఇదం తా ఈ ఏడాది మే నెలలోనే పూర్తిచేశారు. అయితే ఇండెలిబుల్ ఇంక్ బాటిళ్లను అయిదు లక్షలు తెప్పించి ఉంచినప్పటికీ ఇది ఎక్స్పైరీ అయిందా లేదా, కాకుంటే ఎప్పటివరకు వాడుకోవడానికి పని కి వస్తాయి అనేదానిని తనిఖీ చేసేందుకు ల్యాబ్‌కు షాంపిల్స్ పంపించారు. పాత లెక్కల ప్రకారం ఎస్సి, ఎస్టి, బిసిల రిజర్వేషన్లు పంచాయతీల వారీగా ఖరారైనప్పటికి అప్పుడు మొత్తం రిజర్వేషన్లు 60.19శాతం అయ్యాయి. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వాటిని 50శాతాని కుదిస్తూ రిజర్వేషన్లనే కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ మేరకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను మొదలుపెట్టారు. అయితే వీటిలో వందశాతం గిరిజనులు ఉన్న 1,308 పంచాయతీలు, షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న 1,326 పంచాయతీలను ఎస్టిలకు అప్పట్లో కేటాయించారు. ఇప్పుడు కూడా వీటిలో మార్పు చేయడం లేదు. మిగిలిన పంచాయతీలలో ఎస్సిలకు జనాభా ప్రాతిపదికన 20.46 శాతం, ఎస్టిలకు కూడా జనాభా ప్రాతిపదికనే 5.73శాతం రిజర్వేషన్లను కేటాయిస్తున్నారు. జూలై 31లోపే ఎన్నికలు నిర్వహించాలని భావించిన సమయంలో చేసిన లెక్కల ప్రకారమే వారి రిజర్వేషన్లు ఉంటాయని పంచాయతీరాజ్ అధికారి ఒకరు చెప్పారు.