HomeNewsBreaking News12 స్థానాలకు తగ్గొద్దు

12 స్థానాలకు తగ్గొద్దు

17 లోక్‌సభ స్థానాలను లక్ష్యంగా పెట్టుకోవాలి
కాంగ్రెస్‌ శ్రేణులకు టిపిసిసి చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
బోర్లాపడి బొక్కలు విరిగినా బిఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదని విమర్శ
నెల రోజులు గడవకముందే కాంగ్రెస్‌ హామీలపై పుస్తకాల విడుదలా అని ఫైర్‌
ప్రజాపక్ష ం/ హైదరాబాద్‌బోర్లాపడి బొక్కలు విరిగినా బిఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదని, ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే కాంగ్రెస్‌ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని టిపిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని, 12 స్థానాలకు తగ్గకుండా లోక్‌ సభ స్థానాలు గెలిపించుకోవాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పిం చే బాధ్యత తమది అని హామీనిచ్చారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ప్రాంగణంలోని ఇందిరాభవన్‌లో శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత తొలిసారి టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి సిఎం రేవంత్‌రెడ్డి, ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా నియమితురాలైన దీపాదాస్‌ మున్షీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, పిఎసి సభ్యులు, టిపిసిసి కార్యవర్గం, డిసిసి అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, అనుబంధం సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. తొలుత సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. నూతన ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీని అభినందిస్తూ, పాత ఇన్‌ఛార్జ్‌ మానిక్‌ రావ్‌ ఠాక్రే సేవలను కొనియాడుతూ, సోనియాగాంధీ రాష్ట్రం నుండి పోటీ చేయాలని కోరుతూ తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగిస్తూ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బిఆర్‌ఎస్‌ దోచుకున్నదని, నెల రోజుల కూడా నిండక ముందే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నదని దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్‌ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని అన్నారు.
టార్గెట్‌ లోక్‌సభ .. ఈ నెల నుండి జిల్లాల పర్యటనలు
ఈ సారి రాష్ట్రం నుండి లోక్‌ సభకు కాంగ్రెస్‌ నుండి ఎక్కువ స్థానాలను గెలిపించేందుకు కృషి చేయాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇందుకు ఇప్పటి నుండే కృషి చేయాలని, శాసనసభ ఎన్నికలకు వంద రోజుల ముందు నుండి ప్రతి కార్యకర్త ఎలా పని చేశారో, లోక్‌సభ ఎన్నికలకు కూడా వచ్చే వంద రోజులు కష్టపడి పన చేయాలన్నారు. అన్ని స్థానాలు గెలిచేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని, కనీసం 12 స్థానాలు తగ్గవద్దని చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 8న 5జి ల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో లోక్‌ సభ ఎన్నికల గురించి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు 17 పార్లమెంట్‌ ఇంఛార్జ్‌ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని తెలిపారు.
బిజెపి, బిఆర్‌ఎస్‌ కలిసి కాళేశ్వరం పేరుతో దోపిడీ
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుందని, అందుకే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వయిరీ కోరుతున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు స్వయంగా తాను సిబిఐ ఎంక్వయిరీ కోరినపుడు ఆయన ఏమి చేశారని ప్రశ్నించారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్‌ రెడ్డి అడుగుతున్నారని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై తమ ప్రభుత్వం న్యాయ విచారణ చేయించి తీరుతుందని స్పష్టం చేశారు. బిజెపి,బిఆర్‌ఎస్‌ తోడు దొంగలు అని, ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని, పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారని విమర్శించారు.
కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తాం ః భట్టి
కాంగ్రెస్‌ పార్టీకి దశాబ్దాం తరువాత గొప్ప అవకాశం వచ్చిందని, అనేక కష్ట నష్టాలను భరించి అధికారంలోకి వచ్చామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారని, ప్రజల విశ్వాసంతో మనం వారికి ఇచ్చిన హామీలను నమ్మి మనల్ని గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని కోరారు. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని, ఒకవైపు ఆర్థికంగా బలోపేతం కావాలి.. మరోవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పారు. రాష్ర్టంలో ఒక ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ వచ్చిందని, ఒక స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలు ఫీల్‌ అవుతున్నారని భట్టి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తామని కాంగ్రెస్‌ సభ్యులంతా కుటుంబంలా పని చేయాలిః మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు ఎంతో శ్రమించారని, వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుందని,. మరో కొన్ని నెలలు కష్టపడి పార్లమెంట్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో బిఆర్‌ ఎస్‌ మరింత బలహీనంగా ఉంటుందన్నారు. కార్యకర్తల కష్టంతోనే ప్రభుత్వం లోకి వచ్చామని, వారి కష్టాలలో మేము పాలు పంచుకొంటూ సహకారాన్ని అందిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులంతా ఒక్క కుటుంబంగా పని చేద్దామన్నారు.
ఉచిత బస్సు సౌకర్యాన్ని బిఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోంది ః మంత్రి పొన్నం ప్రభాకర్‌
మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యంతో ఆరున్నర కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేశారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్‌ సౌకర్యం విజయవంతం అయ్యిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నారని, బిఆర్‌ఎస్‌ ఉచిత బస్‌ సౌకర్యాలు వ్యతిరేకంగా రాజకీయం చేస్తుందని విమర్శించారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థాయిలలో తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతం గా పని చేసామని, పార్లమెంట్‌ ఎన్నికలలో కూడా విజయవంతం గా చేయాలన్నారు.
మరింత టీమ్‌ వర్క్‌తో పని చేయాలి ః దీపాదాస్‌ మున్షీ
తెలంగాణ లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు పదేళ్లు కష్టపడ్డారని, తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలను మనం నెరవేర్చామి రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ దీపా దాస్‌ మున్షీ అన్నారు. లోక్‌ సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ నాయకులు ఈసారి మరింత శ్రమించాలన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ లో బోగస్‌ ఓట్లు చాలా ఉన్నాయని, నాయకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ లో మరింత టీమ్‌ వర్క్‌ ఉండాలని, మనకు ముందు చాల ఎన్నికలు ఉన్నాయన్నారు. రాష్ర్టంలో ఆరు గ్యారంటీలు అమలు తో ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుందన్నారు. ప్రభుత్వం..పార్టీ సమన్వయం తో కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
గ్రామలలో ఇందిరమ్మ కమిటీలు : మల్లిరవి
గ్రామలలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టిపిసిసి సీనియర్‌ ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లు రవి తెలిపారు. బూత్‌ స్థాయిలో ఐదారుగురు సభ్యులతో ఈ కమిటీ ఉంటుందన్నారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో బుధవారం జరిగిన టిపిసిసి విస్తృత స్థాయి సమావేశ వివరాలను టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన మీడియాకు వివరించారు.
14 నుండి 18 వరకు దావోస్‌ సిఎం, శ్రీధర్‌బాబు
రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు సిఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ సదస్సుకు హాజరువుతున్నట్లు మల్లు రవి తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments