ఏ మాత్రం తగ్గని కరోనా వైరస్
300 దాటిన మృతుల సంఖ్య
24 గంటల్లో 1,831 కొవిడ్ కేసులు
జిహెచ్‌ఎంసి పరిధిలోనే 1,419 పాజిటివ్‌లు
హడలెత్తిస్తున్న రంగారెడ్డి, మేడ్చల్
ఖమ్మం, మంచిర్యాల, మెదక్‌లోనూ భారీగా కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్ ః తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చెలరేగుతోంది. యథావిధిగా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో ఒకేరోజు 1,831 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 1500 మార్కు దాటడం ఇది నాల్గవసారి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కరోనా ఏ మాత్రం కనికరించడంలేదు. జిహెచ్‌ఎంసితోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వాసులు కరోనాతో వణికిపోతున్నారు. ఈసారి మెదక్, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో జనాన్ని భయపెట్టేలా కొవిడ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,831 కొవిడ్ 19 కేసులు నమోదుకాగా, అందులో జిహెచ్‌ఎంసి పరిధిలోనే ఏకంగా 1,419 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 11 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 306కి చేరింది. ఇదిలావుండగా, రంగారెడ్డి జిల్లాలో అనూహ్యంగా 160, మేడ్చల్ జిల్లాలో 117 కేసులు రికార్డయ్యాయి. ఖమ్మం జిల్లాలో 21 కేసులు నమోదుకాగా, మెదక్, మంచిర్యాల జిల్లాల్లో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మూడు జిల్లాల్లోనూ ఈ స్థాయిలో ఒకేరోజు కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. అలాగే నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, పెద్దపల్లి జిల్లాల్లో 9 చొప్పున కరోనా కేసులు బయటపడ్డాయి. వికారాబాద్ జిల్లాలో 7, కరీంనగర్ జిల్లాలో 5, జగిత్యాల జిల్లాలో 4, సంగారెడ్డి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 10,646 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 14,781 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారంనాడు ఒకేరోజు 2,078 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 6,383 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, అందులో 4,552 శాంపిల్స్ నెగిటివ్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు మొత్తం 1,22,218 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
11 మరణాలు!
RELATED ARTICLES