గుజరాత్ నిర్ణయాన్నే సవాలు చేశాం :
కపిల్ సిబాల్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : బిల్కిస్‌బానోపై అత్యాచారం కేసులో 11 మంది రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకారం తెలియజేసింది. ఈ పిటిషన్‌ను జాబితాలో చేర్చి విచారణ తేదీ కేటాయించగలమని పేర్కొంది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, న్యాయవాది అపర్ణా భట్‌లు చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సారథ్యంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుని పిటిషన్ విచారణకు అంగీకరించింది. జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సి.టి.రవికుమార్ కూడా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. బిల్కిస్‌బానోపై సామూహిక అత్యాచారం చేసిన ఈ 11 మంది నిందితులకు శిక్ష తగ్గించడాన్ని వారు సవాలు చేశారు. మీ విజ్ఞప్తిని పరిశీలించగలమని ప్రధాన న్యాయమూర్తి భరోసా ఇచ్చారు. సిపిఐ(ఎం) నాయకులు సుభాషిణి అలీ, ఇండిపెండెంట్ జర్నలిస్టు రేవతి లాయుల్, సామాజిక కార్యకర్త రూప్ రేఖా రాణి తక్షణ విచారణ కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేయగా, తృణమూల్ కాంగ్రెస్‌పార్టీ ఎంపి మహువా మోయిత్ర మరో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారంనాడు ఈ కేసు విషయం న్యాయస్థానం ఎదుట ప్రస్థావనకురాగానే “వాస్తవంగా కేవలం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకే ఈ నిందితులను విడుదల చేశారా?” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ ప్రశ్నించగానే, అపర్ణా భట్ వెంటనే స్పందిస్తూ, “దోషి దాఖలు చేసుకున్న విజ్ఞప్తిని పరిశీలించి, మీ విచక్షణ ఉపయోగించి తగిన నిర్ణయం తీసుకోండి అని గుజరాత్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం కోరింది” అని ధర్మాసనానికి
తెలియజేశారు. “తాము ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాలు చేసింది కేవలం శిక్ష తగ్గింపు నిర్ణయాన్ని తప్పు సుప్రీంకోర్టును తప్పుపట్టడం లేదని కపిల్ సిబాల్ అన్నారు.
“మై లార్డ్, మేం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయడం లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే, కానీ ఈ కేసులో 11 మందికి శిక్ష తగ్గించడాన్ని మేం సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తునాం, శిక్ష తగ్గింపులో పాటించిన సూత్రాలను, దాని మౌలిక ప్రాతిపదికను సవాలు చేస్తున్నాం” అని కపిల్ సిబాల్ ధర్మాసనానికి తెలియజేశారు. శిక్ష తగ్గించాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి పంపిస్తూ, ఈ కేసులో శిక్ష తగ్గింపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే సిఫార్సు చేసింది. అయితే గుజరాత్ ప్రభుత్వం 1978 ముందునాడు గుజరాత్‌లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఒక విచారణ కమిటీ ద్వారా వారికి శిక్ష తగ్గింపు ఇస్తూ, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా వారిని విడుదల చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి రెండు నెలలు ముందుగానే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అర్హులైన, సత్రవర్తనగల ఖైదీలను గుర్తించి విడుదల చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. హత్యకేసుల్లో నేరస్తులు, యావజ్జీవశిక్ష పడిన ఖైదీలు, అత్యాచారం కేసుల్లో నిందితులు ఈ పథకం కింద విడుదలకు అనర్హులని కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగానే తెలియజేసింది. 2002లో గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్‌లో ఆగిఉన్న సమర్మతీ ఎక్స్‌ప్రెస్ బోగీలో ప్రయాణం చేస్తున్న 59 మంది కరసేవకులు సజీవదహనానికి గురి కావడంతో గుజరాత్‌లో హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. మూడునెలలపాటు ఆ రాష్ట్రంలో మారణకాండ కొనసాగింది. ఈ అల్లర్లక భయపడి గ్రామంలోంచి అందరిలాగే భయపడి పారిపోతున్న బిల్కిస్‌బానో పొలంలో ఉన్మాదులకు చిక్కడంతో ఐదు నెలల గర్భిణిగా ఉన్న ఆమెపై 11 మంది నేరస్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె మూడేళ్ళ కుమార్తెను హత్య చేశారు. ఆమె బంధువులు ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం ముంబయిలోని ప్రత్యేక సిబిఐ న్యాయస్థానం 2008 జనవరి 21న నిందితులకు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఈ తీర్పును తర్వాత బోంభ్బ హైకోర్టు సమర్థించింది. అయితే నిందితుల్లో ఒకడు 15 ఏళ్ళ నాలుగు నెలలు జైలు శిక్ష అనంతరం తమను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్‌ను పరిశీలించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో బిజెపి ఎంఎల్‌ఎలు సభ్యులుగా ఉన్నారు. వారి సిఫార్సుతో నిందితులను విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. “ఏ స్త్రీ కైనా న్యాయస్థానంలో ఈ విధమైన న్యాయం ద్వారా తీర్పు ముగుస్తుందా?” అని బిల్కిస్ బానో ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై తనకు విశ్వాసం సన్నగిల్లిందని ఆమె వ్యాఖ్యానించారు.