దేశం కోసం మోడీ ప్రభుత్వం అవసరం
50 ఏళ్లలో చేయని కాంగ్రెస్ కంటే 5 ఏళ్లలో మేమెంతో చేశాం
పుల్వామా ఘటనకు దీటుగా జవాబు
నిజామాబాద్ పార్లమెంట్ క్లస్టర్ సమావేశంలో అమిత్‌షా
ప్రజాపక్షం/నిజామాబాద్ : దేశం మరింత అభివృద్ధి చెందడానికి, వ్యవసాయానికి అండగా ఉండడానికి బిజెపి ప్రభుత్వం మరోసారి అధికారంలో ఉండాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. అస్సాం నుండి గుజరాత్ వరకు ప్రజలు మోడీ వైపు ఉన్నారని, 2019 ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం ప్రతి కార్యకర్త నూతనోత్సహంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ క్లస్టర్ సమావేశం నిజామాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన అమిత్‌షా మాట్లాడుతూ మరోసారి మోడీని గెలిపించేందుకు దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కార్యకర్తలతో పాటు అధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఏకైక పార్టీ బిజెపియేనని వెల్లడించారు. రాబోయే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కంటే అధిక స్థానాలు కైవసం చేసుకుని భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బిజెపి అధికారంలోకి రాగానే మోడీ నాయకత్వంలో దేశ దశదిశలు మార్చి వేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సాక్షిగా రాహుల్ గాంధీని అడుగుతున్నా.. 50 ఏళ్ల పాలనలో ఏమి చేశారు. 5 ఏళ్లలో బిజెపి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టడం, ప్రజల ఆరోగ్యానికి భరోసానివ్వడానికి ఆయుష్మాన్ భారత్ రూపొందించడం వల్ల అనేక మంది పేదలకు ఉపయోగ పడిందన్నారు. దేశానికి కావాల్సిందంతా బిజెపి చేస్తూ రూపు రేఖలు మార్చి ందని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వం అంటే పాకిస్థాన్‌కు వణుకు వచ్చిందన్నారు. సర్జికల్ స్ట్రుక్, పూల్వామా ఘటనకు దీటుగా జవాబివ్వడం జరిగిందని వెల్లడించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో చేసిన దాడులు ఘనత మోడీకే దక్కుతుందని ఆయన అన్నారు.