పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో రోడ్డు పక్కన నిలిపి డెలివరీ చేసిన సిబ్బంది
ప్రజాపక్షం/హైదరాబాద్ : పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే ప్రసవించిన ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్ సమీపంలో జరిగింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి మండలంలోని కమలానగర్‌కు చెందిన నాగరాజు తన భార్య స్వాతిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు ఫోన్ చేయగా 108 అంబులెన్స్ అక్కడికి చేరుకొని ఘట్‌కేసర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలిస్తుండగానే ప్రసవమైంది. మార్గమధ్యలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది అంబులెన్స్‌ని రోడ్డు పక్కన నిలిపేసి డెలివరీ చేశారు. స్వాతి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా స్వాతి కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజుల క్రితం ఇలాంటి ఘటనే సూర్యాపేటలోనూ జరిగిన విషయం తెలిసిందే. ఏ వాహనమూ అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యమై ఓ నిండు గర్భిణీ రోడ్డుపైనే ప్రసవించింది. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగిన విషయం విధితమే.