ఉగ్రవాదంపై పోరు ఏ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదు
ముష్కరులకు ఆశ్రయం, నిధులు ఆగిపోవాలి
ఐఒసి సదస్సులో కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్
అబుదాబి: అరబ్ దేశాల ప్రతిష్ఠాత్మక ఇస్లామీయ సహకార సంస్థ(ఒఐసి) సదస్సులో శుక్రవారం తొలిసారిగా భారత్ పాల్గొంది. ఈ సదస్సుకు విశిష్ట అతిథిగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఈ సం దర్భంగా ఆమె ప్రసంగిస్తూ ప్రాంతీయ అస్థిరతకు, ప్రపంచానికి పెను ముప్పుగా తయారైన ఉగ్రవాదంపై చేస్తున్న పోరు ఏ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నది కాదన్నారు. ఈ సదస్సులో భారత్ పాల్గొనడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. సుష్మాస్వరాజ్‌కు పంపిన ఆహ్వానాన్ని వెనకి తీసుకోవాలని కూడా కోరింది. అయినప్పటికీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), పాకిస్థాన్ డిమాండ్‌ను తిరస్కరించింది. దాంతో ఒఐసి ప్లీనరీ సదస్సును పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి బహిష్కరించారు. అయితే 57 ఇస్లామిక్ దేశాల సమావేశంలో ప్రసంగించిన తొలి భారత తన ప్రసంగంలో సుష్మాస్వరాజ్ ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి ఆశ్రయం, నిధులు ఆగిపోవాలన్నారు. ఉగ్రవాదం మొత్తం ప్రపంచానికి ముప్పన్నారు. ‘ఓ గొప్ప ధర్మం, ప్రాచీన సాంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల నుంచి వచ్చిన సహచరుల మధ్యకు రావడం గొప్ప సన్మానంగా భావిస్తున్నాను. విజ్ఞాన నిధిగా, శాంతి దూతగా ఉన్న దేశానికి ప్రతినిధిగా నేనొచ్చాను. ఆధ్యాత్మికతకు, ఆచారాలకు పేరుగాంచిన దేశం నుంచి వచ్చాను. మా దేశం అనేక మతాలకు నెలవుగా ఉంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా ఉంది’ అన్నారు. ‘మహాత్మాగాంధీ నడయాడిన ప్రదేశం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అక్కడ ప్రతి ప్రార్థనా శాంతి అనే పదం ఉచ్ఛరించిన తర్వాతే ముగుస్తుంది. స్థిరత్వం, శాంతి, సామరస్యం, ఆర్థిక పురోగతి, ప్రజల అభివృద్ధి కోసం మీరు చేస్తున్నప్రయత్నాలకు మా తరఫు నుంచి మీకు అభినందనలు. అందుకు మా నుంచి సంపూర్ణ మద్దతు మీకు ఇస్తున్నాం’ అని ఆమె తెలిపారు. ‘మానవత్వాన్ని కాపాడాలనుకుంటే.. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం నిలిపివేయాలి. యుద్ధం, ఇంటెలిజెన్స్ ద్వారా ఉగ్రవాదంపై మనం విజయం సాధించలేము’ అని ఆమె పునరుద్ఘాటించారు. ఇందిరాగాంధీ కేబినెట్‌లో సీనియర్ మంత్రిగా ఉండి తర్వాత భారత రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అహ్మద్‌ను 1969లో రబత్ సమావేశానికి ఆహ్వానించారు. కానీ ఆయన మొరాకో రాజధానికి చేరుకున్నాక పాకిస్థాన్ డిమాండ్ మేరకు ఆయన ఆహ్వానాన్ని రద్దు చేశారు. దాంతో అప్పటి నుంచి భారత్ అన్ని ఒఐసి సమావేశాల నుంచి వేరుచేయబడింది. సుష్మా స్వరాజ్ తన ప్రసంగంలో పవిత్ర ఖురాన్‌లోని వచనం ‘లా ఇఖ్రా ఫిదీన్’…మతంలో బలవంతం ఉండరాదు అనేది చదివి వినిపించారు. ‘ఇస్లాం అంటేనే శాంతి. అల్లాహ్ 99 పేర్లలో ఏది కూడా హింస అర్థాన్ని ఇవ్వదు. ప్రపంచంలోని ప్రతి మతం శాంతిని, సోదరభావాన్ని, కరుణను కాంక్షిస్తోంది’ అన్నారు. ‘నేను నా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, 130 కోట్ల ప్రజల నుంచి శుభాకాంక్షలు తీసుకొచ్చాను. ప్రత్యేకంగా నా దేశ 18. 50 కోట్ల మంది ముస్లిం సోదర,సోదరీమణు శుభాకాంక్షలు తీసుకొచ్చాను. భారత భిన్నత్వంలో మా ముస్లిం సోదరసోదరీమణులు భాగంగా ఉన్నారు. అయితే భారత్‌లో కొంత మంది ముస్లింలే విష ప్రచారానికి పావులవుతున్నారు. ర్యాడికల్ తీవ్రవాదంవైపు ఆకర్షితులవుతున్నారు’ అని సుష్మ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.