రాష్ట్రంలో కొత్తగా 27 కరోనా కేసులు
970కి చేరిన కరోనా బాధితులు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుతం మూడంకెలు ఉన్న బాధితుల సంఖ్య నాలుగు అంకెలకు చేరువు కానుంది. కరోనా పాటిజివ్ కేసుల సంఖ్య ఒకరోజు తక్కువగా మరొక రోజు ఎక్కువ అవుతండడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య వెయ్యికి చేరువుతుండడం మరింత భయాందోళనకు గురిచేస్తోంది. కాగా, గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వాటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 13, జోగులాంబ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయన్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు 970కి చేరాయి. గురువారం ఉదయం ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 25కి చేరినట్లు ఈటల వెల్లడించారు. తాజాగా 58 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 262 మంది డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. మరో 693 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వాటిలో అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఈటల వివరించారు. హైదరాబాద్‌లోని కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టెస్టులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈటల తెలిపారు. కరోనా నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 9 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దేశవ్యాప్త మరణాల రేట్ (3.1%)తో పోల్చితే తెలంగాణ (2.6%) మెరుగైన స్థానంలో ఉందన్నారు. రికవరీ రేట్ కూడా దేశవ్యాప్త (19.9%) సగటుతో పోలిస్తే తెలంగాణ (22%) మెరుగైన స్థానంలో ఉందని ఈటల వివరించారు.