ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా
లండన్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతోంది. కరోనా బయటపడ్డ తొలి రోజుల్లో నెమ్మదిగా వ్యాపించిన ఈ వైరస్.. ప్రస్తుతం విపరీతంగా పెరుగుతోంది. రాయిటర్స్ లెక్కల ప్రకారం గత 100 గంటల్లో 10 లక్షల కేసులు నమోదుకావడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వైరస్ పుట్టిన తర్వాత ఇంత వేగంగా మిలియన్ కేసులు నమోదవడం ఇదే తొలిసారని నిపుణులు చెప్తున్నారు. జులై 13 నాటికి 1.30 కోట్ల కేసులు నమోదుకాగా.. కేవలం నాలుగు రోజుల్లోనే ఆ సంఖ్య 1.4 కోట్లకు చేరడం కరోనా ఉద్ధృతికి అద్దంపడుతోంది. కేసుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటి వరకు 36 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజు అమెరికాలో 77 వేల కేసులు నమోదయ్యాయి. ఇది స్వీడన్ దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులతో సమానం. ఇక వైరస్‌తోఅల్లాడిపోయిన ఐరోపా దేశాల్లో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతోంది. స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షల్ని దాదాపు ఎత్తివేశారు. అయినా, కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో బార్సిలోనా వంటి నగరాల్లో స్థానికంగా ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తున్నారు. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 76 వేల మందికి పైగా మరణించారు. చాలా దేశాల్లో పరీక్షలు సాఫీగా సాగడం లేదని, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల కంటే వాస్తవ సంఖ్య ఇంకా భారీ స్థాయిలో ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఒ ఆందోళన వ్యక్తం చేసింది.
100 గంటల్లో 10 లక్షల కేసులు
RELATED ARTICLES