100 రోజులు పూర్తయినా…. తగ్గని ఉత్సాహం ఆగని పోరాటం

ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
కెఎంపి ఎక్స్‌ప్రెస్‌ వే దిగ్బంధనం.. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలని రైతులు ఆందోళన మొదలుపెట్టి వంద రోజులు పూర్తయ్యాయి. రైతుల గురిం చి ఏమాత్రం పట్టించుకోని మోడీ సర్కారు అవలంబిస్తున్న మొండి వైఖరికి కూడా వంద రోజులు. ‘నిరసనల సెంచరీ’ రోజుగా, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న శనివారం నాడు, కుండ్లీ మనేసార్‌ పల్వాల్‌ (కెఎంపి) ఎక్స్‌ప్రెస్‌ వేను రైతులు దిగ్బంధనం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఎప్పటి మాదిరిగానే పోలీస్‌లను, పారామిలటరీ బలగాలను మోహరింప చేసి, అడుగడుగునా అడ్డంకులు సృష్టించి, రహదారులపై బ్యారికేడ్లను, తాత్కాలిక గోడలను నిర్మించి రైతులను నిలువరించాలనుకున్న కేంద్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. రైతుల ఆత్మవిశ్వాసం కారణంగా ఎక్స్‌ప్రెస్‌ హైవే దిగ్బంధన కార్యక్రమం విజయవంతమైంది. కొత్త సాగు చట్టాలు కార్పొరేట్‌కు లాభం చేకూర్చేదివినూ, యావత్‌ రైతాంగాన్ని కష్టాల్లోకి నెట్టేవిగానూ ఉన్నాయని విమర్శిస్తూ గత ఏడాది నవంబర్‌ 25న సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) సారథ్యంలో, 41 రైతు సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ఆందోళనను ప్రారంభించాయి. వంద రోజులు పూర్తయినప్పటికీ, ఇప్పటికీ రైతుల్లో ఉత్సాహం తగ్గలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నప్పటి కీ పోరాటం ఆగలేదు. సింఘు, టిక్రి, ఘాజీపూర్‌ సరిహద్దుల్లో దీక్షలు చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చి చేరుతూనే ఉన్నారు. కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, సమాఖ్యలు కూడా మద్దతు ప్రకటించడంతో రైతుల ఆందోళన మరిం త బలోపేతమైంది. 11 విడతలుగా రైతులతో నామమాత్రపుచర్చలు జరిపిన కేంద్ర సర్కారు తన మొండి వైఖరిని కొనసాగించి సమస్యను మరింత జటిలం చేస్తున్నది. ఆందోళనను అణిచవేయడానికి మోడీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. లాఠీచార్జిలు, బాష్పవాయు ప్రయోగాలు, అరెస్టులు విచ్చలవిడిగా కొనసాగాయి. రైతు ఉద్యమానికి మద్దతునిచ్చిన వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)తో రైడ్స్‌ కూడా చేయించింది. ఆందోళన చేస్తున్న రైతులపై స్థానికుల ముసుగులో, కాషాయి మూకలతో దాడులు జరిపించింది. ఆందోళన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు అందకుండా అడ్డుకుంది. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. ఈ ఉద్యమంతో గళం కలిపిన సామాజిక కార్యకర్తలను నిర్బంధించింది. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదం మోపింది. అయితే, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రైతుల పట్టుదలను మాత్రం నీరుగార్చలేకపోయింది. ఎముకలు కొరికే చలిలో, భారీ వర్షంలోనూ ఆందోళనలను కొనసాగించిన రైతులు, ఇక మండిపోయే ఎండల్లోనూ తమ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు సిద్ధమయ్యారు.
ప్రధాని దిష్టబొమ్మలు దగ్ధం
కెఎంపి ఎక్స్‌ప్రెస్‌ వే దిగ్బంధనం కార్యక్రమం శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 136 కిలోమీటర్ల పొడవుగల ఈ రహదారిపై రైతులు ఆందోళనను కొనసాగించారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. కొన్ని చోట్ల నిరసనకారులు ప్రధాని నరేద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నల్ల జెండాలు ఎగరేసి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా కిసాన్‌దివాస్‌గా నిర్వహించాలని ఎస్‌కెఎం తీర్మానించింది. దేశ వ్యాప్తంగా జరిగే నిరసనల్లో మహిళా రైతులు భారీ సంఖ్యలో పాల్గొంటారని ప్రకటించింది. 15వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా గుర్తించనున్నాయి. కార్పొరేటీకరణ వ్యతిరేక దినంగా పాటించాలన్న కార్మిక సంఘాలు పిలుపునివ్వగా ఎస్‌కెఎం మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో రైతు సంఘాల నేతలు పర్యటించి, బిజెపిని ఓడించాల్సిందిగా కోరున్నట్టు తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?