కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం కోటా కల్పించనున్నారు. వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందినవారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంట్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లు కోసం రేపటితో ముగియనున్న పార్లమెంట్ సమావేశాలను రెండు రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తికి రూ.8లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం, 5 ఎకరాల కంటే తక్కువ సొంత వ్యవసాయ భూమి, వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు, నోటిఫైడ్ పురపాలిక పరిధిలో 109 గజాల కంటే తక్కువ నివాస స్థలం, నోటిఫైడ్ కాని మున్సిపాలిటీ పరిధిలో 209 గజాల కంటే తక్కువ స్థలం ఉన్నవారిని ఆర్థికంగా వెనుకబడిన వారిగా పరిగణిస్తారు. కుల ఆధారిత రిజర్వేషన్లు 50శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే ఈ పది శాతం రిజర్వేషన్‌పై సవరణలను పార్లమెంటు ఆమోదిస్తే కోటా 50శాతం దాటి పోనుంది.