కేంద్ర బృందానికి విన్నవించుకున్న వరద బాధితులు
ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వినతి
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర అధికార బృందం
బృందానికి హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నేతృత్వం
గండ్లు పడిన చెరువులు, రోడ్లు, నాలాల పునరుద్ధరణ పనుల పరిశీలన
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో భేటీ
ప్రజాపక్షం/హైదరాబాద్
వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఐదురుగు సభ్యులతో కూడిన కేంద్ర బృందం గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది. ముంపుప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను సేకరించనుంది. పర్యటన అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. రాష్ట్రంలో వరదలపై నష్టాన్ని అంచనా వేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడి న కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా బృం దం సభ్యులు పర్యటించనున్నారు. గురువారం ఉదయం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో బృందం సమావేశమైంది. భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టాల గురించి కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. వరద నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ముంపునకు గురైన కాలనీలను, ఇళ్లను, దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు అదే విధంగా, రోడ్లు, చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మరమ్మతుపనులను పరిశీలించింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఇంటర్ మినిస్టేరియల్ అధికారుల బృందంలోని ముగ్గురు సభ్యులు నగరంలో పర్యటించారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్టతో పాటు జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం.రఘురాం, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హై-వేస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.కె.కుష్వారా నగరంలో పర్యటించిన వారిలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. చాంద్రాయణగుట్ట ఫలక్‌నుమా వద్ద దెబ్బతిన్న ఆర్‌ఒబిని, ముంపుకు గురైన ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో మాట్లాడిన కేంద్ర బృందం టిం లీడర్ ప్రవీణ్ వశిష్ట, అధికారులు ఎం.రఘురామ్, ఎస్.కె.కుష్వారా, ఆర్‌ఒబికి రెండు వైపుల చేపట్టిన పునరుద్ధరణ, నాలా నుండి తొలగిస్తున్న పూడికతీత పనులను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలతో తమ ఇళ్ల గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తులోకి కూడా నీళ్లు వచ్చినట్లు ఈ ప్రాంత ప్రజలు కేంద్ర కమిటీకి వివరించారు. ఇప్పటికీ రోడ్లపై, ఇళ్లలోనూ నీళ్లు పేరుకుపోయి ఉన్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు నీళ్లలో నానడం పట్ల తమ ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయని స్థానిక ప్రజలు వివరించారు.
వరద ముంపు వివరాలు తెలిపిన లోకేష్ కుమార్
వరద ముంపు వల్ల ఏర్పడిన ఇబ్బందులను లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ తెలిపారు. 40 సంవత్సరాల క్రితం ఫలక్‌నుమా ఆర్‌ఒబిని నిర్మించామన్నారు. దీని వల్ల ఇన్నర్ రింగ్‌రోడ్డు, చార్మినార్ ప్రాంతాలకు రోడ్డు సదుపాయం అనుసంధానం అయినట్లు తెలిపారు. పల్లె చెరువు నుండి వచ్చే వరద నీటి నాలా 7 మీటర్ల వెడల్పు ఉంటుందని, ఈ నాలా ఆర్‌ఒబి కింద నుండి వెళ్తుందని వివరించారు. పల్లెచెరువు తెగిపోవడం వల్ల వచ్చిన వరదతో ఈ ప్రాంతానికి అపార నష్టం జరిగిందన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్‌ఒబి రిటైనింగ్ వాల్వ్ దెబ్బతిందన్నారు. అనేక కాలనీలు వరద ముంపునకు గురయ్యాయన్నారు. రోడ్లపై 5 మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచినట్లు కేంద్ర బృందానికి వివరించారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం తమ పర్యటనలో భాగంగా కందికల్ గేట్ వద్ద ఉన్న నాలా పునరుద్ధరణ పనులను పరిశీలించింది. అనంతరం చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్‌లో వరద ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసి కేంద్ర బృందాన్ని కలిసి వరదలతో జరిగిన నష్టం వివరాలు వివరించారు. దాదాపు 10 అడుగులకు పైగా రోడ్లు, ఇళ్లు వరదముంపుకు గురయ్యాయని, ప్రజలు తీవ్రంగా నష్టపోయినందున కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
గోడు వెళ్లబోసుకున్న పాతబస్తీ వాసులు…
కేంద్ర బృందం బాలాపూర్, హఫీజ్ బాబానగర్ సందర్శించింది. పల్లె చెరువు, గుర్రం చెరువులు తెగిపోవడంతో బాలాపూర్ చెరువు ఓవర్ ఫ్లో అయి హఫీజ్ బాబానగర్‌లోని కాలనీలు, ఇళ్లను ముంచెత్తడంతో పలు ఇళ్లు, ప్రహరీగోడలు కూలిపోయి ఇళ్లలోని ఫర్నీచర్, నిత్యావసర వస్తువులు వరదపాలైనట్లు ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా చెరువుల నిర్వహణ గురించి బృందం నాయకుడు ప్రవీణ్ వశిష్ట మాట్లాడుతూ ఈ మంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చెరువుల పటిష్టతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చెరువుల నిర్వహణను చూస్తున్న నీటి పారుదల శాఖ గురించి వాకబు చేశారు. భారీ వర్షాలు, వరదలతో గండి పడిన గుర్రం చెరువును కేంద్ర బృందం పరిశీలించింది. చెరువు కట్టకు పడిన గండిని తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు చేపట్టిన పనులను పరిశీలించారు. చెరువుకట్ట లోపల నిర్మించిన కృష్ణా వాటర్ పైప్‌లైన్‌కు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని, తాగునీటి సరఫరాను కొనసాగిస్తున్నామని నీటి పారుదల శాఖ ఎస్‌ఇ భీమ్ ప్రసాద్ కేంద్ర జలమండలి శాఖ నుండి వచ్చిన కమిటీ సభ్యులు ఎం.రఘురామ్‌కు వివరించారు. సెంట్రల్ విజిలెన్స్ విభాగం ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారమే చెరువు కట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టామని చెప్పారు. కేంద్ర బృందం పర్యటనలో భాగంగా పల్లె చెరువుకు పడిన గండిని పరిశీలించింది. గండి పూడ్చివేతకు, కట్ట పటిష్టతకు జరుగుతున్న పునరుద్దరణ పనులను పరిశీలించారు.
పల్లె చెరువుగండితో తీవ్ర నష్టం : లోకేష్ కుమార్
పల్లె చెరువుకు గండి పడటం వల్ల వరద నీటితో పాటు భారీ వర్షాలతో బాలాపూర్ హఫీజ్ బాబానగర్‌లపై తీవ్ర ప్రభావం పడిందని జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. అధికార యంత్రాంగం మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించి పల్లె చెరువు ప్రభావాన్ని తగ్గించగలిగామన్నారు. గగన్ పహాడ్ వద్ద అప్పా చెరువు నాలాను పరిశీలించింది. అప్పా చెరువు గండి పూడ్చివేతకు చేస్తున్న మరమ్మతు పనులను పరిశీలించారు. అప్పా చెరువుకు పడిన గండి, నాలా ఉద్రిక్తతో గగన్‌పహాడ్‌లోని పలు కాలనీలు, ఇళ్లు ముంపునకు గురయ్యాయని, పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. గొలుసుకట్టు పద్ధతిలో నిర్మించిన చెరువులు అయినందున ఆయా చెరువులకు గండ్లు పడటం, ఓవర్‌ఫ్లో కావడం వల్ల నాలాలు ఉప్పొంగి పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఈ పర్యటనలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ ఇతర అధికారులు పాల్గొన్నారు.