కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నేడే
కొత్తగా వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చేమకూర మల్లారెడ్డికి చోటు
జి. జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్థానం పదిలం
ఆఖరి నిమిషంలో ఈటల రాజేందర్‌కు ఛాన్స్
ప్రజాపక్షం/ హైదరాబాద్ : మొత్తం పది మందితో మంగళవారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రాజ్‌భవన్‌లో ఉదయం 11:30 గంటలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విస్తరణలో కొత్తవారికే పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ప్రమాణం స్వీకారం చేయనున్న పది మందిలో ఆరుగురు మొదటిసారిగా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వారిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పు ల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సిహెచ్. మల్లారెడ్డిలు ఉన్నారు. ఇందులో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సి.హెచ్.మల్లారెడ్డిలు తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఇక గత మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న ఈటల రాజేందర్, జి. జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు మరోసారి మంత్రులుగా అవకాశం దక్కనుంది. ఇక మహిళలకు టిఆర్‌ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చాక కూడా మంత్రి వర్గంలో మొండిచెయ్యి చూపే అవకాశం కనిపించనుంది. వీరితో పాటు గిరిజనులకు కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం లభించకపోవచ్చని సమాచారం. పార్లమెంటు ఎన్నికల తరువాత మరోసారి విస్తరణకు వీలుగా ఆరు స్థానాలను కేబినెట్‌లో ఖాళీగా ఉంచనున్నారు. విస్తరణలో చోటు లభించిన వారందరికీ ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సోమవారం నాడు ఫోన్‌లు వెళ్ళాయి. వీరంతా ఒక్కొక్కరుగా ప్రగతిభవన్‌కు వెళ్ళి సిఎం కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. టిఆర్‌ఎస్ వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్ 13న సిఎంగా కెసిఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. సిఎం కెసిఆర్ సుమారు రెండు నెలల వారం రోజుల తరువాత ఇద్దరితో కూడిన తన కేబినెట్‌ను విస్తరిస్తున్నారు. అనేక వడపోతలు, జిల్లాలు, సామాజిక సమీకరణల నేపథ్యంలో కెసిఆర్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో ఖమ్మంకు ప్రాతినిధ్యం లేనట్లు తెలిసింది. కరీంనగర్ నుంచి ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, నిజామాబాద్ నుంచి మిషన్ భగీరథ మాజీ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, వరంగల్ నుంచి సీనియర్ ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు, రంగారెడ్డి జిల్లా నుంచి సిహెచ్. మల్లారెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం వైస్ ప్రెసిడెంట్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌కు, ఆదిలాబాద్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నల్లగొండ నుంచి జి.జగదీశ్‌రెడ్డి, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
హరీశ్ సహా ఏడుగురు మాజీలకు నో ఛాన్స్ : మంత్రివర్గ విస్తరణలో తాజా మాజీ మంత్రి టి.హరీశ్‌రావుకు అవకాశం లేనట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కెటిఆర్ లోక్‌సభ ఎన్నికల వరకు మంత్రివర్గానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మంత్రివర్గంలో హరీశ్ ఉంటారా? ఉండరా? అనేది గత కొంత కాలంగా రాష్ట్రంలో అన్ని వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మరో తాజా మాజీమంత్రి ఈటల రాజేందర్ పేరును సోమవారం రాత్రి వరకు సస్పెన్స్‌లో పెట్టి చివరకు స్పష్టత ఇచ్చారు. కాగా గత మంత్రివర్గంలో ఉండి, ఈసారి ఏడుగురు మాజీ మంత్రులకు అవకాశం లేకుండా పోయింది. వారిలో ఎంఎల్‌ఎలుగా మళ్ళీ గెలిచిన కెటిఆర్, హరీశ్‌రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, పద్మారావు, ఎంఎల్‌సిలు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలు ఉన్నారు.
మండలి నుండి ఒక్కరికే : గత మంత్రివర్గంలో శాసనమండలికి ప్రభుత్వంలో నెంబర్ టూ హోదా కల్పించిన సిఎం కెసిఆర్ ఈ సారి కేవలం ఒక హోం మంత్రితోనే సరిపెట్టారు. గత మంత్రివర్గంలో కడియంశ్రీహరి, మహమూద్‌అలీ ఇద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవుల రాగా, ఎంఎల్‌సి నాయిని నర్సింహరెడ్డికి హోంమంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మండలిలో ఒక హోమంత్రి(మహమూద్‌అలీ) పదవి లభించింది.