HomeNewsBreaking News1 నుంచి బడులు

1 నుంచి బడులు

9 నుంచి ఆపై తరగతులు ప్రారంభించాలి
‘ధరణి’ పోర్టల్‌లో మరిన్ని మార్పులు
కలెక్టర్ల సమావేశంలో సిఎం కెసిఆర్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆపై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రెవెన్యూకు సం బంధించిన అన్ని రకాల సమస్యలనూ సత్వరమే పరిష్కరించాలని, ధరణి పోర్టల్‌లో అవసరమైన అన్ని రకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని తెలిపారు. మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రగతి భవన్‌లో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సిఎం చర్చించారు. విద్య, రెవెన్యూ, ఉద్యోగ, కరోనా వ్యాక్సిన్‌, అడవుల పునరుద్ధరణ తదితర అంశాలపై సుధీర్ఘంగా సమీక్షించారు. కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాలు నిర్మించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముం దు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని, తద్వారా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని సిఎం కెసిఆర్‌ అన్నారు. రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల కలిగే అనర్ధాలను రూపు మాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని వెల్లడించారు. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా భూ యాజమాన్య విషయంలో స్పష్టత వస్తున్నదన్నారు. భూ రికార్డుల నిర్వహణ, అమ్మకాలు, కొనుగోళ్లు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వందకు వంద శాతం విజయవంతమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలిగించేలా ధరణిపోర్టల్‌లో అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే స్వయంగా పూనుకొని సత్వరం పరిష్కరించాలన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయిన వ్యవసాయ భూముల మ్యుటేషన్‌ను వెంటనే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్‌ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలని, వారం రోజుల్లోగా మ్యుటేషన్లు చేయాలన్నారు.
యూజర్‌ ఫ్రెండ్లీగా ధరణి:
ధరణి పోర్టల్‌ను మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చాలని, ఇందుకు తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సిఎం అన్నారు. ఎన్‌ఆర్‌ఐలు తమ పాస్‌పోర్ట్‌ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ధరణి పోర్టల్‌లో అవకాశం కల్పించాలని, కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు కూడా పాస్‌బుక్‌ పొందేలా ధరణిలో వెసులుబాటు కల్పించాలని సూచించారు. గతంలో ఆధార్‌ కార్డు నంబరు ఇవ్వనివారికి ధరణిలో నమోదు కోసం మరోసారి అవకాశం కల్పించి, ఆధార్‌ నంబరు నమోదు చేసుకొని పాస్‌ పుస్తకాలు అందజేయాలని చెప్పారు.
‘ఏజెన్సీ’ క్రమబద్ధీకరణ వివాదాలు నెల రోజుల్లో పరిష్కరించండి
ఏజెన్సీ ఏరియాల్లోని ల్యాండ్‌ ట్రాన్స్‌ ఫర్‌ రెగ్యులేషన్స్‌ వివాదాలన్నింటినీ జిల్లా కలెక్టర్లు నెల రోజుల్లో పరిష్కరించాలి సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారు తమ బుకింగ్‌ను రద్దు చేసుకుని, రీ షెడ్యూల్‌ చేసుకునేందుకు ధరణిలోనే అవకాశం కల్పించాలన్నారు. నిషేధిత భూముల జాబితాను ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులతో సవరించాలని, కోర్టు తీర్పులకు అనుగుణంగా మార్పులు చేయాలని, ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన భూములను కూడా వెనువెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలని, అలాగే కోర్టు కేసులు మినహా పార్ట్‌ బిలో చేర్చిన అంశాలన్నింటినీ పరిష్కరించాలని తెలిపారు.
‘సాదాబైనామాల’ దరఖాస్తులను పరిష్కరించండి
సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి, పరిష్కరించాలని కెసిఆర్‌ అన్నారు. ధరణి పోర్టల్‌లో జిపిఎ, ఎస్‌పిఎ,ఎజిపిఎ చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పడే జిల్లా స్థాయి ట్రిబ్యునల్‌లో ఇప్పటివరకు రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ కిందిస్థాయి అధికారులకు అప్పగించి, కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితం రాదని, అందుకే కలెక్టర్లే అన్ని విషయాలను స్వయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
ఈనెల 25లోగా తరగతులకు సిద్ధమవ్వండి
అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లలో టాయిలెట్లను సిద్ధం చేయాలని, వాటిని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను నిర్వహించాలని, విద్యా సంస్థలు నిర్వహించక చాలా రోజులవుతున్నందున అందులోని సామాగ్రినంతటినీ శుభ్రపరచాలని తెలిపారు. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలు, వంట సామాగ్రీలకు పురుగు పట్టే అవకాశం ఉంటుందని, ఆ స్టాకును సరి చూసుకోవాలని, ఈ నెల 25లోగా విద్యా సంస్థలలో తరగతులను నిర్వహించుకునేందుకు అనుగుణంగా సిద్ధం చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి తదితర హాస్టల్స్‌ను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments