HomeNewsBreaking Newsహ్యాట్రిక్‌ ఖాయం!

హ్యాట్రిక్‌ ఖాయం!

ముఖ్యమంత్రిగా మూడోసారి కెసిఆర్‌ ప్రమాణస్వీకారం చేస్తారు
బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆశాభావం
ఈనెల 15 నుంచి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడి
ప్రజాపక్షం / హైదరాబాద్‌ / వనస్థలిపురం
తెలంగాణలో కెసిఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని , మూడోసారి గెలిచి దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ , పురపాలక శాఖమంత్రి కె.టి.రామారావు విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్నెల్ల పాటు రాజకీయాలు చేస్తే చాలని.. మిగతా నాలుగున్నరేండ్ల పాటు అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెట్టాలని అన్నారు. హైదరాబాద్‌ నగరం కెసిఆర్‌ ఆధ్వర్యంలో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరం వనస్థలిపురం డివిజన్‌లోని జిఎస్‌ఆర్‌ గార్డెన్‌లో సభకు ఎల్‌బి నగర్‌ నియోజకవర్గ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కెటిఆర్‌ జిఒ నెం.118 కింద రెగ్యులరైజ్‌ చేసిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూపనిచేసే ప్రభుత్వాన్ని, పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని అన్నారు. వాళ్లు తిరిగి గెలిపించుకుంటారనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఆ నమ్మకంతోనే 415 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పుకొచ్చారు. 24 గంటలూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని సలహానిచ్చారు.
అక్టోబర్‌లోగా లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ
డబుల్‌ బెడ్‌రూమ్‌లను ఆగస్టు 15 నుంచి అక్టోబరులోగా పంపిణీ చేయబోతున్నామని మంత్రి కెటిఆర్‌ ప్రకటించారు. ఇప్పటికే ఇండ్లు పూర్తయినయని.. అలాట్‌మెంట్‌ చేసుకుని.. నియోజకవర్గానికి 4వేల చొప్పున లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. గృహలక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి 3 వేల కుటుంబాలకు ఇవ్వబోతున్నాని చెప్పారు. ఒక్క ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే డబుల్‌ బెడ్రూం ఇండ్లు 4 వేలు, గృహలక్ష్మీ పథకం కింద 3వేలు వస్తాయని అన్నారు. జిఒ నెం.58, 59 కింద 11వేలు వచ్చాయని, జిఒ నెం.118 కింద 18 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. అంటే ఒక్క నియోజకవర్గంలోనే 40 వేల పైచీలుకు కుటుంబాలకు సొంతింటి కల నెరవేరిందని వివరించారు.
వందేండ్లను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ అభివృద్ధి
సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగతంగా లాభం జరిగే పథకాలు మాత్రమే కాదని.. హైదరాబాద్‌ విస్తరణను దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్‌ పనిచేస్తున్నారని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. రానున్న 50 నుంచి వందేండ్లలో ఎంత అభివద్ధి జరిగినా సరే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న 70 కిలోమీటర్ల మెట్రో మార్గం, నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్టు మెట్రో మార్గం 31 కిలోమీటర్లు కాకుండా మరో 314 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కెసిఆర్‌ అనుమతిచ్చారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గంలోని నాగోలు నుంచి ఎల్బీనగర్‌ మార్గాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఎల్‌బి తనగర్‌ నుంచి హయత్‌నగర్‌ మీదుగా ఓఆర్‌ఆర్‌ దాకా మెట్రోను తీసుకెళ్తున్నామని.. అదేవిధంగా ఓఆర్‌ఆర్‌ చుట్టూ 159 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. ఓఆర్‌ఆర్‌ నిర్మించినప్పుడే మెట్రో కోసం స్థలం కేటాయించారు కాబట్టి ఎలాంటి భూసేకరణ పనులు లేకుండా తక్కువ ఖర్చుతోనే ఈ మెట్రో నిర్మాణం చేయొచ్చని అన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నామని తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ తరహాలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ( టిమ్స్‌ ) పెట్టి నగరానికి నాలుగువైపులా ఒక్కో చోట 2వేల పడకలతో ఆస్పత్రులను నిర్మిస్తున్నామని చెప్పారు. నిమ్స్‌లో మరో రెండు వేల పడకలు జత చేసి కొత్తగా 10 వేల పడకలు పేదల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. భారత దేశంలో ఎక్కడా లేనట్టుగా జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి మద్దతు పలకాలని ఆయన కోరారు. జర్నలిస్టులకు ఎల్‌బి నగర్‌ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు లేక జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారి ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రిని స్థానిక ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి కోరారు. ఆయన సానుకులంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఎంఎల్‌సిలు ఎగ్గే మల్లేశం, బొగ్గరపు దయానంద్‌ గుప్తా, రాచకొండ కమిషనర్‌ డిఎస్‌ చౌహాన్‌, రంగారెడ్డి కలెక్టర్‌ హరిష్‌, మల్కాజ్గిరి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, పార్టీ మాజీ కార్పొరేటర్లు, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, రమావత్‌ పద్మ నాయక్‌, గజ్జల సుష్మ మధుసూదన్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, డివిజన్‌ అధ్యక్షులు చింతల రవికుమార్‌ గుప్తా, కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, ఆందోజు సత్యం చారి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments