ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించాలని ఎఐసిసి నిర్ణయం
ప్రజాపక్షం/హైదరాబాద్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశానికి హైదరాబాద్ వేదిక కానుంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సిడబ్ల్యుసి సమావేశాలు హైదరాబాద్‌లో జరగడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈ నెల 16,17న రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో సిడబ్ల్యుసి సమావేశాన్ని నిర్వహించాలని ఎఐసిసి నిర్ణయించింది. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో జాతీయ, రాష్ట్ర రాజకీయ అం శాలతో పాటు ‘ఇండియా కూటమి’ తదితర అంశాలపై చర్చిస్తారు. ఐదు రాష్ట్రాల, పార్లమెంటు ఎన్నికలు, రాజకీయ పార్టీలతో పొత్తులు, ఎన్నికల వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాల ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 16న జరిగే సిడబ్ల్యుసి సమావేశానికి పార్టీ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సిడబ్ల్యుసి సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, పత్య్రేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ఆ మరుసటి రోజు 17న ఉదయం విస్తృత స్థాయి వర్కింగ్ కమిటీ, అలాగే సిఎల్పి, పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం (17వ తేదీన) హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ‘సెప్టెంబర్ 17’ న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక భారీ ప్రదర్శన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాగా ఈ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోయే ఐదు గ్యారంటీలను (హామీలను) ప్రకటించనున్నారు. సమావేశ వివరాలను కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వెల్లడించారు. కాగా సెప్టెంబరు 18 నుండి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ 5 గ్యారంటీలతో పాటు, బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్ షీట్ లతో ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు.
పరేడ్‌గ్రౌండ్‌ను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
“సెప్టెంబర్ 17న” కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ను టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఎఐసిసి కార్యదర్శులు సోమవారం పరిశీలించారు. తమపై నమ్మకంతో హైదరాబాద్‌లో సిడబ్ల్యుసి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం పట్ల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ కలను నిజం చేసిన కాంగ్రెస్ పార్టీ, చారిత్రకంగా తెలంగాణకు ఎంతో ముఖ్యమైన ‘సెప్టెంబర్ 17’ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సిడబ్ల్యుసి సమావేశాలకు తెలంగాణను వేదికగా ఎంచుకోవడం తెలంగాణ పట్ల కాంగ్రెస్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు సైనికుని తరహా పని చేసి ఈ సమావేశాలను విజయవంతం చేస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. సిడబ్ల్యుసి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని ఎఐసిసికి గతంలో లేఖ రాసినట్లు వివరించారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్పటి హైదరాబాద్ సంస్థానానికి చెందిన వ్యక్తి అని, ఆయన కుటుంబం రజాకార్ల చేతిలో చనిపోయిందని గుర్తు చేశారు. జాతీయ రాజకీయాలపై చర్చకు సీడబ్ల్యూసీ సమావేశం వేదిక కానుందన్నారు.
మురళీధరన్‌కు జగ్గారెడ్డి లేఖ
టిపిసిసి స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, కమిటీ సభ్యులు బాబా సిద్ధిఖీని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్‌లో సోమవారం కలిశారు. పార్టీ బలోపేతానికి తన తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వారికి ఒక లేఖను అందజేశారు. కొత్తగా చేరుతున్న నాయకులను ప్రోత్సహిస్తూనే పార్టీ కోసం ఏళ్ల నుండి పని చేస్తున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. టిపిసిసి అనుబంబ సంఘాల అధ్యక్షులు, చైర్మన్లకు శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అంశంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాగా టిపిసిసి స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌ను పిసిసి మాజీ వి.హనుమంతరావు, టిపిసిసి మాజీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు కలిశారు.