HomeNewsBreaking Newsహైదరాబాద్‌ వయా మిర్యాలగూడ విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్‌

హైదరాబాద్‌ వయా మిర్యాలగూడ విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్‌

ఆమోదానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి
తెలంగాణకు ఎన్‌ఐడి మంజూరు చేయండి
కేంద్రం మెగా లెదర్‌పార్క్‌ ఏర్పాటు చేస్తే భూములు కేటాయిస్తాం
ప్రజాపక్షం/ హైదరాబాద్‌ హైదరాబాద్‌ వయా మిర్యాలగూడ -విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌- పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదల అవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌- పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని, దానిని ఉప సంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ (ఎన్‌ఐడి) మంజూరు చేసిందని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ దానికి శంకుస్థాపన చేశారని కేంద్ర మంత్రి గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. రాష్ర్ట విభజన తర్వాత ఎన్‌ఐడీని విజయవాడకు తరలించారని, ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎన్‌ఐడి మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ర్టంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెదర్‌ పార్క్‌ మంజూరు చేసిందని కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి అన్నారు. కరీంనగర్‌, జనగాం జిల్లాల్లో లెదర్‌ పార్క్‌ ఏర్పాటుకు అవసరమైన భూములు ఉన్నాయని, కేంద్ర ప్రభు త్వం మెగా లెదర్‌ పార్క్‌ మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తామని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. ఇది మంచి ప్రతిపాదన అని, ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి సమావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్లోని మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు బ్రౌన్‌ ఫీల్డ్‌ హోదా ఇచ్చిందని, దానికి గ్రీన్‌ ఫీల్డ్‌ హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. బ్రౌన్‌ఫీల్డ్‌ నుంచి గ్రీన్‌ ఫీల్డ్‌కు మార్చితే పార్కు గ్రాంట్ల రూపంలో అదనంగా రూ.300 కోట్ల నిధులు వస్తాయని, ఇది అక్కడి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. టెక్నికల్‌ టెక్స్‌ టైల్స్‌ (బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు, కన్వేయర్‌ బెల్టులు, ఎయిర్‌ బ్యాగ్‌లు తదితరాలు) టెస్టింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినందున రాష్ట్రానికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌/టెస్టింగ్‌ సెంటర్‌ మంజూరు చేయాలని కోరారు. తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (ఐఐటిహెచ్‌) మంజూరు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. రాష్ర్టంలో ఏడు చేనేత క్లస్టర్స్‌ ఉన్నాయని, ఐఐహెచ్‌ మంజూరు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఐఐటిహెచ్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి కేంద్రానికి రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుదల చేయాలని, రాష్ర్ట అభివద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. సమావేశంలో కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి బాలాజీ, కేంద్ర జౌళి శాఖ అదనపు కార్యదర్శి రోహిత్‌ కన్సల్‌, రాష్ర్ట జౌళి, చేనేత శాఖ డైరెక్టర్‌ అలుగు వర్షిణి, టిఎస్‌ఐఐసి సిఇఒ మధుసూదన్‌, ఢిల్లీ తెలంగాణ భవన్‌ ఓఎస్డీ సంజయ్‌ జాజు, రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments