ఎడతెరిపి లేని వర్షాలతో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
రహదారులను ముంచెత్తిన వరదనీరు
స్తంభించిన ట్రాఫిక్ : సహాయక చర్యలు చేపట్టిన జిహెచ్‌ఎంసి
ప్రజాపక్షం/హైదరాబాద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ మహానగరం తడిసిముద్దయింది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో సోమవారం ఉద యం నుంచి వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో నగరమంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. శుక్రవారం కురిసిన వర్షానికే నగరంలో చాలా వరకు అపార్ట్‌మెంట్‌లలో సెల్లార్లలోకి వరద నీరు చేరింది. ఆ నీటిని మోటర్లతో తొలగించిన క్రమంలో సోమవారం వర్షానికిమరోసారి సెల్లార్లు నీటితో మునిగిపోయాయి. సెల్లార్లలో పార్కింగ్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు చెడిపోవడంత కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సైదాబాద్, సరూర్‌నగర్, చంపాపేట, సంతోష్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట, మల్కాజిగిరి, నేరేడ్‌మెంట్, కుషాయిగూడ, ఎ.ఎస్.రావునగర్, చర్లపల్లిలో ఉదయం నుంచి వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్, నాంపల్లి, ఖైరతాబాద్, అబిడ్స్, బషీర్‌బాగ్, సుల్తాన్ బజార్, కోఠి, బేగంబజార్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రధానంగా చాదర్‌ఘట్ రైల్యే బ్రిడ్జి వద్ద నాలా ఉప్పొంగడంతో వరదనీరు రోడ్డుపైకి వచ్చింది. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. టోలిచౌకి, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, అబిడ్స్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్.బి.నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జిహెచ్‌ఎంసి వర్షకాల అత్యవసర బృందాలు పలు ప్రాంతాల్లో వరద నీరు సమీపంలోని డ్రెయిన్‌లు, నాలాల్లోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. డ్రెయిన్‌లు మూతలు తెరవడంతో వరద నీరు పోయేందుకు మార్గం చేశారు. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చెరువులు, కుంటలు, నాలాల దిగువ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. రాత్రి సమయంలో జాగారం చేయాల్సి వస్తుందని పలు ప్రాంతాల ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 12 గంటలలో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం గంటకు 7కి.మీ. వేగంతో కదులుతుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 330 కి.మీ. దూరంలో, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 370 కి.మీ. దూరంలో, నరసాపురానికి తూర్పు ఆగ్నేయంగా 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత గంటకు 50 కి.మీ. వేగంతో ఉండొచ్చని చెప్పారు. రాగల 12గంటలలో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో నర్సాపూర్, విశాఖపట్నం మధ్య కాకినాడకు దగ్గరలో అక్టోబర్ 13వ తేదీ తెల్లవారుజామున తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హిమాయత్ సాగర్‌కు భారీగా వరద
హైదరాబాద్ నగరానికి ప్రధాన నీటి వనరుగా ఉన్న హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీనది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులుగా కాగా ప్రస్తుత నీటిమట్టం 1,762.00 (2.603 టిఎంసి)కు చేరింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 2.97 టిఎంసిలు నిల్వ చేసేందుకు వీలువుతుంది. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్‌లోకి 1,666 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. రాబోయే కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్న తరువాత ఎప్పుడైన హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని వాటర్‌బోర్డ్ ఎం.డి. ఎం.దానకిషోర్ వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, జిహెచ్‌ఎంసి, పోలీస్ యంత్రాంగాలను ఆయన అప్రమత్తం చేశారు.
హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది!
RELATED ARTICLES