కాలి నడకనే బయలుదేరిన వలస కూలీలు
నిలువరించేందుకు యత్నించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
ప్రజాపక్షం / హైదరాబాద్ : లాక్డౌన్ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెలాఖరు వరకు పొగడించగా, ప్రధాని నరేంద్ర మోడీ మే 3వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన చేశారు. మే 3 తర్వాత కూడా లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయంటూ ప్రధాని మోడీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో వలస జీవులు తీవ్ర బెంగతో తమ తమ స్వగ్రామాల బాట పడుతున్నారు. తెలంగాణలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పలువురు ఆంధ్రప్రాంత కూలీలు మోడీ ప్రకటన చూసిన తక్షణమే సొంత గ్రామాలకు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ నుండి శ్రీకాకుళంకు వెళ్లేందుకు యత్నిస్తున్న 150 మంది కూలీలను ఆపేందుకు ఎందరు ప్రయత్నించినా వారు వినడం లేదు. ప్రధాని మోడీ లాక్డౌన్ను పదే పదే పొడగిస్తూ పోతున్నారని, తాము ఎన్నాళ్లని సొంత వారిని వదిలి పెట్టి హైదరాబాద్లో ఉంటామని ప్రశ్నిస్తున్నారు. వారం అన్నారు, పది రోజులు అన్నారు. ఇప్పుడు మే 3 అంటున్నారు. అటు సిఎం కెసిఆర్ జూన్ మూడు వరకు లాక్డౌన్ ఉంటే మంచిదని ఒక సర్వే చెబుతోందని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే లాక్డౌన్ ఇంకా పొడగించే పరిస్థితులే కనిపిస్తున్నాయి తప్పితే మా స్వగ్రామాలకువెళ్లే మార్గం మాకు కనిపించడం లేదంటున్నారు. అప్పటి దాకా మా గతి ఏందీ? మేం మా ఊళ్లకు పోతాం అంటూ ప్రయాణమయ్యారు. ఈస్ట్ మారెడ్పల్లి నుండి హబ్సీగూడ మీదుగా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కూలీలను ఆపేందుకు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఎల్ఎ సుభాష్ మీడియా ముఖంగా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. చివరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వచ్చి, వారికి 12 కిలోల బియ్యం, రూ.500 ఇప్పిస్తామని, ఇంటి అద్దె విషయంలో యజమానులతో మాట్లాడుతామని హామీ ఇచ్చి, వారిని ఇక్కడి నివాసాలకు పంపే ఏర్పాట్లు చూశారు.
లాక్డౌన్ పొడగిస్తూ పోతే ఎట్లా సారు !
“లాక్డౌన్ మరో 19 రోజులు పొడగించారంటున్నారు. మా స్వగ్రామాలకు వెళ్తాం. ఓ 10 రోజుల్లో అయినా తమ స్వగ్రామాలకు చేరుకుంటాం. మహా అయితే ఓ 900 కిలో మీటర్లు ఉంది. రోజు వంద కిలో మీటర్లు వెళ్లినా 10 రోజుల్లోనే చేరుకుంటాం . ఇక్కడే ఉంటే ఏం చేసుకుని బతకాలి? అని కూలీలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక శాసన సభ్యులు సుభాష్ రెడ్డి, పోలీస్ ఎసిపి నర్సింహారెడ్డిలు నిలువరించి రోజుకు 12 కిలోల బియ్యం, రూ. 500 ఇస్తాం అని హామీ ఇచ్చినా వారు వినడం లేదు. అక్కడ మా వాళ్లు ఎలా ఉన్నారో? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి 20 రోజులు అయింది. వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు. లాక్ డౌన్ వచ్చింది. ఇప్పుడు కూడా లాక్ డౌన్ అంటే ఉండలేం అని తెగేసి చెబుతున్నారు.