మండుటెండలతో నగర వాసులకు ఉపశమనం l ప్రాంతాల్లో వరద నీరు
ప్రజాపక్షం/హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిన హైదరాబాద్ నగర వాసులకు ఊరట కలిగిస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరైన మహానగరంపై వరుణుడు కరుణ చూపాడు. ఎండలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన నగర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. శనివారం వరకు ఎండలు వడగల్పులతో ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఆదివారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం సమయంలో గంటన్నరకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరం తడిసి ముద్దైంది. రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవ కాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నగర ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఈసిఐఎల్, నల్లకుంట, నాగోల్, వనస్థలిపురం, ఎల్.బి.నగర్, కూకట్ పల్లి, హయత్ నగర్, మల్కాజిగిరి, మలక్‌పేట్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్ నగర్, నేరేడ్ మెట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, మెట్టుగూడ, తార్నాక, అఫ్జల్‌గంజ్, నాంపల్లి, లక్డీకాపూల్, మెహదీపట్నం, సోమాజిగూడ, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, చిక్కడపల్లి, ఆర్‌టిసి క్రాస్‌రోడ్, అంబర్‌పేట్, రాంనగర్, తార్నాక, అల్వాల్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిగంటల ముందు నుంచే మబ్బులు పట్టి వాతావరణం చల్లగా మారడంతో నగర వాసులు ఉపశమనం పొందారు. శనివారం ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్, హన్మకొండ, రామగుండంలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక మేడ్చల్ జిల్లాలో ఘట్‌కేసర్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సిద్ధిపేట జిల్లాలో కొమురవెళ్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో, యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, పోచంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్టలతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
లోతట్టు ప్రాంతాలు జలమైయం…
భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యా యి. ఇళ్ల్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. పలు ఈదురుగాలులకు చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇ బ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కురియడంతో జి హెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాకాల అత్యవసర బృందాలను అధికారులు రంగంలోకి దించా రు. పలు ప్రాంతాల్లో ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇదిలా ఉంటే రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపా రు. రాగల 48 గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉందన్నారు. దీని వలన సుమారుగా జూన్ 1న కేరళలోకి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. చత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాలలో 2.1 కిమీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు.
ధ్వంసమైన బి.డి.రెడ్డి గార్డెన్స్…
బి.ఎన్.రెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. చెతన్య నగర్ కాలనీలో బి.డి.రెడ్డి గార్డెన్స్ వెనకవైపు ప్రహారీగోడ కూలిపోయింది. ప్రహారీగోడతో పాటు ఫంక్షన్‌హాల్‌లో ఏ.సి గదులు, ఇతర వస్తువులు దెబ్బతిన్నాయి. వర్షం కారణంతో తమకు సుమారు రూ.2 కోట్ల వరకు నష్టం వచ్చిందని ఫంక్షన్‌హాల్ యజమాని దామోదర్‌రెడ్డి తెలిపారు. ఎల్.బి.నగర్ జోన్ పరిధిలో 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిహెచ్‌ఎంసి అధికారులు చెప్పారు.