గాంధీలో కరోనా తొలి పాజిటివ్ కేసు
దుబాయ్ వెళ్ళి వచ్చిన బాధితుడు
జ్వరం తగ్గకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక : అనంతరం గాంధీకి తరలింపు
తొలుత ప్రకటించిన కేంద్రం
ధృవీకరించిన మంత్రి ఈటల
కరోనా అనుమానంతో గాంధీలో చేరిన సామాజిక వేత్త సునీతా కృష్ణన్
స్పందనపై ట్విట్టర్లో ఒకింత అసంతృప్తి
దేశంలో ఒకేరోజు రెండు కేసులు నమోదు
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తెలంగాణకు పాకింది. దేశంలోనూ దీని ప్రభా వం బయటపడింది. దేశవ్యాప్తంగా రెండు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా భయాందోళనలు మొదలయ్యాయి. అయితే మన దగ్గర కరోనా లేదని, ఇతర దేశాలకు వెళ్లడం, అక్కడ సోకడంతో వచ్చిన వారికి మాత్రమే దీని లక్షణాలు ఉన్నాయ ని, భయపడాల్సిన పని లేదని వైద్యారోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశా యి. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేరిన కరోనా పాజిటివ్ వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తెలంగాణకు చెందిన ఇతడు.. ఇటీవలే ఉద్యోగ బాధ్యతల నిమిత్తం దుబాయ్ వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్నా రు. అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో ఉన్న తరుణంలో ఆయనకు జ్వరం రావడం.. ఐదు రోజులైనా తగ్గకపోవడంతో అపోలో ఆసుపత్రిలో చేరాడు. అక్కడ కూడా నాలుగు రోజులు చికిత్స తీసుకున్నప్పటికీ తగ్గకపోవడంతో అనుమానంతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఆయన ద్వారా ఈ వైరస్ మరెవరికైనా సోకిందా అనేదానిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఆయన బస్సులో ప్రయాణం చేసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో బస్సులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పాటు ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది వివరాలు తెలుసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో ఐదు రోజుల పాటు ఉండడంతో వారిని, బస్సులో ఆయనతో ప్రయాణించిన వారిని కూడా గాంధీకి తీసుకువచ్చి 15 రోజుల పాటు వైద్యపరీక్షలు చేయించి కరోనా లేదని తేలితే ఇండ్లకు పంపిస్తామని వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు చెందిన ఈ వ్యక్తి దుబాయ్‌లో ఆయన సహచర ఉద్యోగులతో పనిచేశారు. వీరిలో హాంకాంగ్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. వీరి ద్వారా కరోనా సోకి ఉంటుందన్న అనుమానాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులు కరోనా వ్యాప్తికి అనుకూలించవని, ఇక్కడ అది సోకే, వ్యాప్తి చెందే అవకాశాలు లేవని, భయాందోళనలు చెంద వద్దని వైద్యారోగ్య వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణకు చెందిన ఆయనతో పాటు ఢిల్లీలో మరో కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది.
అనుమానంతో గాంధీలో చేరిన సామాజిక వేత్త
హైదరాబాద్‌లోని గాంధీలో ప్రముఖ సామాజిక వేత్త ప్రజ్వల ఎన్‌జిఒకు చెందిన సునీతా కృష్ణణ్ కరోనా ఉందన్న అనుమానంతో గాంధీలో చేరారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపారు. ఆమె బ్యాంకాక్ నుంచి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. స్వల్పంగా దగ్గు, జ్వరం ఉండడంతో అనుమానంతో చేరినట్లు వివరించారు. అయితే చేరిన గంటన్నర పాటు కూడా గాంధీలో తనకు ఎటువంటి వైద్యసేవలు ప్రారంభించలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల ఫలితాలు రావడానికి కూడా 48 గంటలు పడుతుందని వైద్యులు తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు.
కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు : మంత్రి ఈటల
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో ఈటల రాజేందర్ సమావేశమై కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇక గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆరోగ్య పరిస్థితిపై కూడా మంత్రి చర్చించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న 24 ఏళ్ల యువకుడు.. ఫిబ్రవరి 15న దుబాయ్ వెళ్లాడు. కంపెనీ పని నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఆ ఉద్యోగి.. ఇతర దేశాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కలిసి అక్కడ పని చేశాడు. ఫిబ్రవరి 20న తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు. 27న జ్వరం రావడంతో.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అదే రోజు సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు చికిత్స చేసినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దీంతో ఈ నెల 1న సాయంత్రం 5 గంటలకు సాప్ట్‌వైర్ ఉద్యోగి గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. నిర్ధారణ కోసం పుణెకు కూడా పంపించగా, అక్కడ కూడా పాజిటివ్ ఫలితాలే వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలిపాం. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి రాజేందర్ స్పష్టం చేశారు. ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రయాణించిన బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. వారితో పాటు సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు, ఇతరుల వివరాలు తీసుకున్నాం. కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించాం. మొత్తంగా 80 మంది దాకా ఉన్నారు. వీరందరికి కరోనా టెస్టులు చేస్తామని మంత్రి తెలిపారు. వీరందరికి వైరస్ సోకినట్లు కాదు.. నిర్ధారణ కోసమే అని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో 40 పడకల చొప్పున అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై కరోనా వైరస్‌పై చర్చిస్తామని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పడు విధిగా ముక్కుకు గుడ్డ కట్టుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గ డం, తుమ్మడం మానుకోవాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు ఉంటే తప్పనిసరిగా వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని మంత్రి చెప్పా రు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
కరోనా గూర్చి ఆందోళన అవసరం లేదు
కరోనా గూర్చి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా సోకిన వారిలో 97 నుంచి 98శాతం మంది తిరిగి కోలుకుంటున్నారని పేర్కొంది. దక్షిణ భారత దేశంలో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నందున కరోనా వ్యాపించడం కష్టమని తెలిపింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనిని పూర్తిగా నివారించవచ్చంది. వీటిలో చేతిని వేరేవారి చేతితో కలపకపోవడం, జనసంద్రంలో ఉండకపోవడం, చేతులు కడుక్కోవడం, జలుబు, దగ్గు, జ్వరాలు ఉన్న వారు బయట తిరగకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ధైర్యంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో కరోనా వైరస్
RELATED ARTICLES