రెండు గంటలపాటు దంచికొట్టిన వర్షం
3.5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
రోడ్లన్నీ జలమయం, తీవ్ర ఇక్కట్లకు గురైన వాహనదారులు
ప్రజాపక్షం/హైదరాబాద్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో సోమవారం అకస్మాత్తుగా కుండపోత వర్షం కురుసింది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు వర్షం దంచికొట్టింది. నగరంలోని వివిధ ప్రాంతా ల్లో మూడున్నర నుండి 10 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. రహదారులపైకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం పడిన వెంటనే భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలు ముందుకు పోయేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సాధారణ ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. నాంపల్లిలో 9.02 సెంటిమీటర్లు, ఎల్.బి.స్టేడియంలో 8.6, ఖైరతాబాద్‌లో 7.5, సరూర్ నగర్‌లో 7.2, రాజేంద్రనగర్‌లో 6.5, మెహిదీపట్నంలో 4.5, హయత్‌నగర్‌లో 3.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో వర్షం జోరుగా కురిసింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, బంజారాహిల్స్, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్ర నగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పూర్, అత్తాపూర్ జాగీర్, మణికొండ, ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నార్సింగి, కాటేదాన్, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, జియాగూడ, ఎల్.బి.నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. సరిగ్గా కార్యాలయాల్లో విధులు ముగించుకొని ఇళ్లకు బయలుదేరే సమయంలో వర్షం దంచికొట్టింది. దీనితో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. మెహిదీపట్నం, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఎన్‌ఎండిసి నుంచి మాసబ్ ట్యాంక్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అలాగే అమీర్‌పేట్ నుంచి పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని పలుచోట్ల రహదారులపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మళ్లీ నీట మునిగిన మూసారాంబాగ్ బ్రిడ్జి…
నగరంలో రెండు గంటలపాటు భారీ వర్షం కురవడంతో మూసీనదిలోకి వరద నీరు పోటెత్తింది. దీనితో మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి భారీగా వరదనీరు వచ్చింది. భారీ ఎత్తున వరద పోటేత్తడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగింది. బ్రిడ్జికి ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను గోల్నాక బ్రిడ్జి మీదుగా దారి మళ్లించారు.
హైదరాబాద్‌లో కుండపోత
RELATED ARTICLES