సాగు భూముల చుట్టూ కందకాలు తవ్విన అటవీశాఖ అధికారులు
భూముల కోసం పోరాడుతాం : సిద్ధారం గ్రామ ఆదివాసీ, గిరిజన రైతులు
ప్రజాపక్షం/ టేకులపల్లి ఆదివాసీలు, గిరిజనులు, దళితులు అంటే అందరికీ చులకనే. ఇక ప్రభుత్వ అధికారుల తీరు చెప్పాల్సిన పనిలేదు. వారి జీవితాలతో చెలగాటమాడుతుంటా రు. వారు దుఃఖంతో, బాధలతో ఏడుస్తుంటే, అధికారులు ఆనందిస్తుంటారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న బడా బాబులపై తమకున్న అధికారాలను ఏ మాత్రం ఉపయోగించరని, ఆదివాసీలు, గిరిపుత్రుల మీద మా త్రం తుచ తప్పకుండా అమలు చేస్తూ, అవసరమైతే ఒక అడుగు ముందుకు వేసి మరీ తమ కొలువులకు న్యాయం చేస్తుంటారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. స్వయాన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, ఆదివాసీ రైతులను జైలుకు పంపిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జిల్లాలోని టేకులపల్లి మండలం, సిద్ధారం గ్రామానికి చెందిన ఆదివాసీ రైతులు పది మందిపై అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసులు బనాయించి, పది రోజుల పాటు వారికి జైలు కూడు తినిపించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి, తర తరాలుగా పోడు భూములు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న గిరిజన ఆదివాసీ రైతుల మధ్య ఘర్షణలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా సుమారు 50,60 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న సాగు భూములను, పోడు భూముల పేరుతో ఫారెస్టు అధికారులు బలవంతంగా లాక్కుంటున్న ఘటనలు రాష్ట్రంలో ఎక్కడో ఒక ప్రాంతంలో నిత్యం జరుతూనే ఉన్నాయి. సిద్ధారం గ్రామానికి చెందిన ఆదివాసీలు గత 60 సంవత్సరాలకు పైగా భూములను సాగు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 32 మంది రైతులు సాగు చేసుకుంటున్న 166 ఎకరాల భూములను 2006లో ఫారెస్టు శాఖ సర్వే నిర్వహించగా, వారికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఇది పెండింగులో ఉండగానే అధికారులు ఆ భూములను దున్నడానికి వీలు లేదని, చుట్టూ కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం చేపట్టారు. దాంతో రైతులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చింది. కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ, కోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ అధికారులు తమ పనులు యధావిధిగా నిర్వహిస్తుండటంతో, మళ్లీ 2021లో రెండోసారి కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. ఈ క్రమంలో పది మంది రైతులు జోగా కుమారి, శ్రీను (భార్యాభర్తలు), పాయం శిరోమణి, లక్ష్మినారాయణ (భార్యాభర్తలు), కోరం రమణ, అనిల్ ( భార్యాభర్తలు), పాయం కృష్ణవేణి, వెంకటేశ్వర్లు (భార్యాభర్తలు), కొర్సా మల్లయ్య, కొర్సా ఈశ్వరయ్యలపై అక్రమంగా కేసులు బనాయించి, వారం రోజుల పాటు జైలు పంపించారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు వాయిదాలకు తిరుగుతున్నామని వారు తెలిపారు. తాత, ముత్తాల కాలం నుంచి 6౦ ఏళ్లకు పైగా సాగు చేసుకుంటున్న తమ భూములను బలవంతంగా లాక్కునే కుట్రలు చేస్తున్నారని, అక్రమంగా కేసులు బనాయించి జైళ్లపాలు చేస్తున్నారని ఫారెస్టు శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు తప్ప వేరే జీవనాధారాలు ఏమి లేవని, తమ భూములు దక్కించుకోవడానికి ఎన్ని పోరాటాలైన చేస్తామని, ఎన్ని అక్రమ కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ భూములను మాత్రం వదులుకునే సమస్యే లేదని సిద్ధారం గ్రామ ఆదివాసీ బిడ్డలు ఏక గొంతుకతో నినదిస్తున్నారు.
జనరల్ పేజీకి వాడగలరు.
పోడు భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలి
ప్రజాపక్షం/ ఖమ్మం సిటీ : అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజన ఆదివాసీలు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు శాశ్వత పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి తెలంగాణ గిరిజన సమాఖ్య ఖమ్మంజిల్లా సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ఆదివాసీలు సుమారు 50 లక్షల మంది వివిధ వృత్తులను నమ్ముకుని ప్రధానంగా అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు 1984లో ఆనాటి ప్రభుత్వం గిరిజనులకు, ఆదివాసీలకు ఆరు శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు 40 ఏళ్లు అవుతున్నా జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ల శాతాన్ని పెంచకపోవడంతో అనేక అవమానాలకు గురవుతూ మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గిరిజన జనాభా ప్రతిపాదికన అదనంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మంజిల్లాలో 53 గిరిజన హాస్టళ్లు ఉన్నాయని వాటికి కనీస సౌకర్యాలు కల్పించి మూడు నుంచి ఏడవ తరగతి వరకు రూ.1500 మెస్ ఛార్జీలను పెంచాలన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు రూ. 2వేలు మెస్ ఛార్జీలను పెంచాలని కోరారు. గిరిజన హాస్టళ్లలో ఆరోగ్య వసతులు కల్పించడంతో పాటు జిల్లాలో గిరిజన స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ శ్రీనివాస్‌నాయక్, కోశాధికారి బి. జగన్‌నాయక్, నాయకులు అజ్మీర కిషన్‌నాయక్, బోడా కిషన్ పాల్గొన్నారు.
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్!
RELATED ARTICLES