14,200 మంది హెచ్‌ఐవి రోగుల డేటా లీకేజీ
సింగపూర్‌లో ఆన్‌లైన్ చోరీ
భారత్‌కు చెందిన పీడితులూ ఉన్నట్లు అనుమానం
సింగపూర్: రహస్యంగా వుంచాల్సిన హెల్త్ రికార్డులు బట్టబయలయ్యాయి. పైగా అవి ప్రాణాంతక హెచ్‌ఐవి పాజిటివ్ రోగులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం కావడం విశేషం. 14,200 మందికిపైగా హెచ్‌ఐవి రోగులకు చెందిన ఆరో గ్య వివరాలను సింగపూర్‌లో చోరీకి గురయ్యాయి. ఈ లీకేజీ ఆరోగ్య రంగంలో అతిపెద్ద సమాచార దొంగతనంగా అభివర్ణిస్తున్నారు. వివిధ నేరాల్లో శిక్షపడిన అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఈ సమాచార లీకేజీకి పాల్పడినట్లు తెలిసింది. అదికూడా సింగపూర్‌లో హెచ్‌ఐవి రిజిస్ట్రీతో సంబంధాలున్న ఒక సింగపూర్ డాక్టర్ నుంచి ఈ సమాచారాని, పొంది ఆ తర్వాత దాన్ని బట్టబయలు చేశాడని సింగపూర్ అధికారులు ప్రకటించారు. సింగపూర్‌లో కేవలం కొన్ని నెలల వ్యవధిలో జరిగిన అతిపెద్ద రెండవ డేటా లీకేజీ ఉదంతమిదే. గత జూన్, జులై మాసాల్లో సింగపూర్ ప్రధానమంత్రి లీ హుసేన్ లూంగ్‌తోపాటు 1.5 మిలియన్ సింగపూర్‌వాసుల హెల్త్ రికార్డులు చోరీకి గురైన విషయం తెల్సిందే. ‘తాజాగా 2013 జనవరి వరకు హెచ్‌ఐవి రోగానికి చికిత్స పొందుతున్న 14,200 మందికి సంబంధించిన రహస్య సమాచారంతోపాటు వారి ఫోన్ నెంబర్లు, వివరాలు కూడా ఒక అనధికారిక వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయాయి” అని సింగపూర్ ఆరోగ్యశాఖ సోమవారం నాడొక ప్రకటనలో తెలిపింది. ఈ సమాచారం మొత్తాన్ని అక్రమంగా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారని, ఈ ఘటనతో తీవ్రమైన ఆందోళనకు గురవుతున్న పీడితులందరికీ క్షమాపణ చెపుతున్నామని ఆరోగ్యశాఖ తెలిపింది. బట్టబయలైన సమాచారంలో రోగుల పేర్లు, వారి గుర్తింపు సంఖ్యలు, సంప్రదించాల్సిన చిరునామాలు, ఫోన్‌నెంబర్లు, హెచ్‌ఐవి టెస్టు ఫలితాలు, ఇతర వైద్య సమాచారం, తదితర వివరాలన్నీ వున్నాయి. “ప్రస్తుతానికి ఈ సమాచారం బ్లాక్‌చేయబడింది. అయితే లీకైన సమాచారం మొత్తం ఇంకా ఆ దుండగుడి చేతిలోనే వుంది. మరోసారి అతను ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవచ్చు” అని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. లీకైన సమాచారం కలిగివున్న రోగుల్లో అత్యధికులు విదేశీయులే. వారిలో భారత్‌కు చెందిన వారు కూడా ఉండివుండవచ్చని అనుమానిస్తున్నారు.