గతంలో మూడుసార్లు ఓటమి
ఈసారి పాగా వేసేందుకు తీవ్ర యత్నాలు
ప్రజాపక్షం/హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికను అధికార టిఆర్‌ఎస్ టెన్షన్ కలిగిస్తోంది. ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు గతంలో మూడు సార్లు ప్రయత్నించిన టిఆర్‌ఎస్‌కు గెలుపు ఎండమావిగానే మారింది. ఇటీవల పార్టీలో అసంతృప్తి గొంతులు బాహాటంగానే వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సారి ఉప ఎన్నికల్లో విజయం టిఆర్‌ఎస్‌కు తప్పనిసరిగా మారింది. మం త్రివర్గ విస్తరణకు ముందు సాక్షాత్తు మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ఓనర్లు, కిరాయిదారులు అనే చిచ్చు లేపింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తులు ప్రస్తుతానికి సద్దుమనిగినప్పటికీ అంతర్గతంగా అసంతృప్తిగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హుజూర్‌నగర్ సీటును సాధిస్తే టిఆర్‌ఎస్‌కు తిరుగులేదనే భావనను తీసుకు రావాలని, తద్వారా పార్టీలోని అంతర్గత అసంతృప్తులు, ఇతర రాజకీయ పార్టీలకు కూడా చెక్‌పెట్టే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ ఉప ఎన్నికల బాధ్యతను పూర్తిగా టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి.రామారావుకు అప్పగించారు. ఆయనే స్వయంగా నిత్యం జిల్లా నేతలు, ఇతర ముఖ్యనేతలతో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలపై సమీక్షిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ బలా లు, బలహీనతలు, గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అంశాలు, ఓటర్లు, సామాజిక సమీకరణలు ఇలా పలు అంశాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం.