నియోజకవర్గంలో అక్టోబర్ 21 ఉప ఎన్నిక
టిఆర్‌ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి
కాంగ్రెస్ నుండి పద్మావతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి?
బలమైన అభ్యర్థి వెతుకులాటలో బిజెపి
హైదరాబాద్ : హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక నగారా మోగింది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. హుజూర్‌నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సోమవారం నుండి నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21వ తేదీన పోలింగ్ జరగనుంది. గత శాసనసభ సాధారణ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుండి ఎంఎల్‌ఎగా ఎన్నికైన టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తరువాత నల్లగొండ ఎంపిగా ఎన్నికవడంతో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డిని టిఆర్‌ఎస్ మరోసారి తన అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి పేరు ప్ర కటించడం లాంఛనమే.ఆమె గత శాసనసభలో కోదాడ నియోజకవర్గం ఎంఎల్‌ఎగా గెలుపొందగా,సాధారణ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారానికి తెరలేపారు.
బిగ్‌ఫైట్ ఖాయం : సాధారణ ఎన్నికలు జరిగిన దాదాపు ఏడాది తరువాత హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండడంతో అందరి దృష్టి దానిపై కేంద్రీకృతం కానుంది. టిపిసిసి అధ్యక్షుడి సొంత నియోజకవర్గం కావడంతో ఎలాగైనా విజయం సొంతం చేసుకొని సత్తా చాటాలని అధికార టిఆర్‌ఎస్ కంకణం కట్టుకోంది. స్వయంగా సూర్యాపేట జిల్లాకు చెందిన మంత్రి జి.జగదీశ్‌రెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతలను తీసుకున్నారు. మరోవైపు సొంత ఇలాఖాలో సత్తా చాటుకొని, తన సతీమణిని గెలుపించుకోవడంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో తన బలాన్ని మరింత చాటుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హుజూర్‌నగర్‌కు తన అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరును ప్రతిపాదించినప్పటికీ, ఆ పార్టీ నేతల నుండి పెద్ద మద్దతు రావడం లేదు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్‌లందరినీ ఏకతాటిపై తీసుకురావడంలో ఉత్తమ్ విజయం సాధించారు. ఇక రాష్ట్రంలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి కూడా హుజూర్‌నగర్‌లో తన ముద్ర వేసేందుకు బలమైన అభ్యర్థి వెతుకులాటలో పడింది. కాగా, హుజూర్‌నగర్ శాసనసభ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సైదిరెడ్డి ఇదే నియోజకర్గం నుంచి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో 7466 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
హుజూర్‌నగర్‌లో బిగ్‌ఫైట్

RELATED ARTICLES