వారసుల మధ్య మొదటిసారి పోటీ
మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్న బిజెపి అభ్యర్థి
నేటి నుండి ఉప ఎన్నిక నామినేషన్‌ల స్వీకరణ
రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే ఉప ఎన్నిక
ముందే మోహరించిన ముఖ్య నేతలు
ప్రజాపక్షం / హైదరాబాద్
దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. టిఆర్‌ఎస్ తరుపున ఇటీవల మరణించిన సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతను అభ్యర్థిగా ప్రకటించారు. మొన్నటి వరకు టిఆర్‌ఎస్‌లో కొనసాగిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవడమే కాకుండా, ఏకంగా పార్టీ అభ్యర్థిగా బరిలో దింపింది. దీంతో సోలిపేట, చెరుకు కుటుంబాల మధ్య ఐదవసారి పోటీ జరగనుంది. తొలిసారిగా ఆ కుటుంబాల వారసులు తలపడుతున్నారు. మరోవైపు బిజెపి తరుపున గతంలో రెండుమార్లు పోటీ చేసిన ఎం. రఘునందన్‌రావు మూడవసారి ఇదే నియోజకవర్గం నుండి బిజెపి తరుపున అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా రు. సిట్టింగ్ ఎంఎల్‌ఎ సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఇదే రోజు నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు నామినేషన్‌లను స్వీకరిస్తారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే, షెడ్యూలు వెలువడిన నాటి నుండి దుబ్బాక ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు సవాలుగా తీసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీల నుండి చేరికలు, ‘ఆపరేషన్ ఆకర్ష్’లకు ముందే తెరలేపాయి. దుబ్బాక నియోజకవర్గం పునర్విభజను పూర్వం దొమ్మాట నియోజకవర్గంగా ఉండేది. ఆ నియోజకవర్గం నుండి చెరుకు ముత్యంరెడ్డి 1994 నుండి టిడిపి తరుపున వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించడమే కాకుండా, ఒకసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న నేత. కాగా తెలంగాణ ఉద్యమం తరువాత 2004లో తొలిసారిగా దొమ్మాట నుండి ముత్యంరెడ్డిపై సోలిపేట రామలింగారెడ్డి టిఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుండి వారిరువురు నాలుగుసార్లు పోటీ పడ్డారు. 2008లో ఉప ఎన్నికలో సోలిపేట గెలుపొందారు. 2009లో దుబ్బాక నియోజకవర్గం ఏర్పడిన తరవాత వారిరువురు ఆ నియోజకవర్గానికి మారారు. ఆ ఎన్నికల్లో మహాకూటమి నుండి టిఆర్‌ఎస్‌కు టిక్కెట్ కేటాయించడంతో ముత్యంరెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ నుండి పోటీ చేసి సోలిపేటపై గెలుపొందారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో మళ్ళీ ముత్యంరెడ్డిపై సోలిపేట రామలింగారెడ్డి గెలుపొందారు. 2018లో కాంగ్రెస్ ముత్యంరెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆ తరువాత ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి వరకు ముత్యంరెడ్డి,సోలిపేట నాలుగుసార్లు తలపడ్డారు.
టిఆర్‌ఎస్‌కు అన్నీతానై హరీశ్‌రావు ప్రచారం
టిఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత తరుపున మంత్రి తన్నీరు హరీశ్‌రావు సుమారు నెల రోజుల నుండే అన్నీ తానై ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలను
టిఆర్‌ఎస్ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు
సాగిస్తున్నారు.
ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా నేత చెరుకు కొండల్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. సిద్ధిపేటలాగే దుబ్బాకను కూడా రెండో కన్నులాగా అభివృద్ధి చేస్తానని హామీనిస్తున్నారు. మరోవైపు ఇటీవల సిఎం కెసిఆర్ పార్టీ నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలో సిద్దిపేటలో లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందనున్నట్లు పార్టీ నేతలతో చెప్పినట్లు సమాచారం.
ఊరికో నేతను మొహరించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఈసారి దుబ్బాకలో గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. తొలుత డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎంఎల్‌ఎ నర్సారెడ్డిని అభ్యర్థిగా బరిలో నిలపాలనుకున్నప్పటికీ, ఏ మాత్రం అవకాశం వదులుకోవద్దని చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని చివరి నిమిషంలో టిఆర్‌ఎస్ నుండి తమ పార్టీలోకి చేర్చుకుంది. ఇక ప్రచారంలో సైతం గతంలో టిఆర్‌ఎస్ నమూనాను అనుసరిస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగిన మండలానికి మంత్రి, గ్రామానికో ఎంఎల్‌ఎను ఇన్‌చార్జ్‌లు వేసిన టిఆర్‌ఎస్ తరహాలోనే, ఈ సారి గ్రామానికొక రాష్ట్ర స్థాయి నాయకుడిని ఇన్‌చార్జ్‌గా కాంగ్రెస్ వేసింది. అందులో టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి నేతలకు కూడా గ్రామాలను కేటాయించారు. ఫలితాల్లో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఆ నాయకులు ప్రతిష్టాత్మకంగా మారింది. బుధవారం నుండే కాంగ్రెస్ నేతలు తమకు కేటాయించిన గ్రామాల్లో మకాం వేశారు.
ఈసారి వదులుకోవద్దని బిజెపి యత్నం
గతంలో రెండు మార్లు ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన రఘునందన్‌రావు తనకు ఉన్న సంబంధాలతో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నుండి ఇద్దరు కొత్తవారే కావడంతో, తన అనుభవం కలిసొస్తుందని భావిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో మూడవ స్థానంలో ఉన్నప్పటికీ ఓట్లు పెంచుకోవడంతో పాటు, మొన్న మెదక్ ఎంపిగా పోటీ చేసిన రఘునందన్‌రావుకు దుబ్బాక సెగ్మెంట్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రావడం తమకు కలిసొస్తుందని బిజెపి భావిస్తుంది. అందరికంటే ముందే ఆయన ప్రచారాన్ని మొదలు పెట్టారు. కేంద్ర మంత్రుల ప్రచారం, ప్రధాని మోడీ ఛరిష్మా కలిసొస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు.