HomeNewsBreaking Newsహిజాబ్‌పై సుప్రీం సందిగ్ధం

హిజాబ్‌పై సుప్రీం సందిగ్ధం

సిజెఐ ముందుకు వివాదం
తదుపరి విస్తృత ధర్మాసనానికే
కర్ణాటక హైకోర్టు తీర్పుపై స్టే లేదు
న్యూఢిల్లీ :
హిజాబ్‌ (ముస్లిం స్త్రీలు తలపై ధరించే వస్త్రం) వివాదంపై సుదీర్ఘవాదనల అనంతరం అంతిమ తీర్పు చెప్పాల్సిన సుప్రీంకోర్టు ద్విసభ్య న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. న్యామూర్తులు జస్టిస్‌ సుధాంషు ధూలియా, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా ఇరువురూ భిన్నాభిప్రాయాలువ్యక్తం చేయడంతో సమస్య సందిగ్ధంలో పడింది. దీంతో విస్తృత ధర్మాసనం విచారణకు వీలుగా వారిద్దరూ ఏకాభిప్రాయంతో ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి సమక్షానికి పంపించారు. ఈ కేసులో జస్టిస్‌ ధూలియా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును నిర్ద్వంద్వంగా వ్యతిరేకించగా, జస్టిస్‌ గుప్తా మాత్రం కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థించారు. ఈ కేసు తేలే వరకూ కర్ణాటక హైకోర్టు తీర్పు అమలులో ఉంటుంది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై ఎలాంటి స్టే విధించలేదు. చాలా నెలలుగా హిజాబ్‌పై తీర్పు కోసం ముస్లిం సమాజంతోపాటు దేశం యావత్తూ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తరుణంలో అసాధారణమైన రీతిలో ఇద్దరు న్యాయమూర్తులు అంతిమతీర్పు ఇవ్వలేకపోయారు. ఈ ధర్మాసనం త్రిసభ్య ధర్మాసనమై ఉండి ఉంటే ఓటింగ్‌లో ఒకరు ఒకవైపు మొగ్గినా మరో ఇద్దరు ఒకవైపు మొగ్గి ఉండేవారు. మెజార్టీ ప్రాతిపదికపై సుప్రీం ధర్మాసనం స్పష్టమైన అంతిమతీర్పు ఇచ్చి ఉండేది. మతపరమన చిహ్నాలకు ప్రాధాన్యం లేదని, అది వారి వారి వ్యక్తిగత అభిరుచులతో ముడిపడిన అంశమైనందువల్ల బాలికల విద్యకే ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలని ఈ కేసులో జస్టిస్‌ ధూలికా అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ హేమంత్‌ గుప్తా మాత్రం విద్యార్థులందరూ విద్యాలయాల ప్రాంగణాల్లో ఏకరూప వస్త్రధారణలో ఉండాలన్న కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థించారు. కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్ర ప్రబుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో కొందరు విద్యార్థినులు సహా దేశవ్యాప్తంగా పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను విచారణ చేసిన సందర్భంగా జస్టిస్‌ గుప్తా అభిప్రాయంతో జస్టిస్‌ ధూలియా విభేదించారు. “నేను బాలికా విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నాను, నా సహచర న్యాయమూర్తితో గౌరవనీయమైన పద్ధతుల్లో విభేదిస్తున్నాను” అని తన తీర్పులో ధూలియా పేర్కొన్నారు. మతంకంటే బాలికా విద్యే అత్యంత ముఖ్యమైనదని, మత వస్త్రధారణలను వారి వారి ఇష్టా ఇష్టాలపై ఆధారపడి ఉంటాయని ఆయన తన తీర్పులో వ్యాఖ్యానించారు. స్కూలు గేటు దాకా వచ్చాక ముస్లిం బాలికల హిజాబ్‌ను లాగేసుకోవడం అంటే అది వారి ప్రైవసీని,వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసినట్లేనని, లౌకిక విద్యాబోధనను తిరస్కరించినట్టేనని ధూలియా వ్యాఖ్యానించారు. మరోవైపు జస్టిస్‌ గుప్తా తన తీర్పులో 11 ప్రశ్నలు లేవనెత్తారు. “ఈ విజ్ఞప్తిని రాజ్యాంగ ధర్మాసనం ముందుకు తీసుకువెళ్ళవచ్చా? విద్యార్థుల ఏకరూప వస్త్ర ధారణ అంశాన్ని కళాశాలలు నిర్ణయించవచ్చునా?హిబాజ్‌ ధరించినా లేదా దానిపై ఆంక్షలు విధించినా అది రాజ్యాంగంలోని 25వ అధికరణ కిద మత స్వేచ్ఛను ఉల్లంఘించినట్లు అవుతుందా? రాజ్యాంగంలోని 25వ అధికరణ, 19వ అధికరణ ఈ రెండూ భావప్రకటనా స్వేచ్ఛకు, భావ ప్రకటనకు పరస్పరం అతీతమా? కర్ణాట ప్రభుత్వం హిజాబ్‌ నిషేధం వల్ల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందా? హిజాబ్‌ ధారణ ఇస్లాం మతాచారాలలో, మతానుష్ట విధానాలలో అతిముఖ్యమైనదా? కర్ణాటక ప్రభుత్వం హిజాబ్‌ విషయంలో విద్యాలయాలకు జారీ చేసిన ఉత్తర్వులు విద్యా లక్ష్యాలనునెరవేరుస్తాయా? అని 11 ప్రశ్నలు అడుగుతూ, పై ప్రశ్నలన్నింటికీ తనకువ్యతిరేకంగా సమాధానం వచ్చినందువల్ల తాను ఈ విజ్ఞప్తిని కొట్టివేస్తున్నానని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా తన తీర్పులో పేర్కొన్నారు. ఉడిపి స్కూలులో హిజాబ్‌ ధరించిన విద్యార్థినులను ప్రిన్సిపాల్‌ తరగతిలోకి అనుమతించకపోవడంతో ఈ వివాదం ప్రారంభమైంది. రెండు మతాలకు చెందినవారు విద్యాలయాల ప్రాంగణాలలో పరస్పరం ఆందోళనలకు దిగారు. కర్ణాటక వ్యాప్తంగా పలుచోట్ల ఈ ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలు ఒక దశలో హింసాత్మకంగా మారాయి. దీంతో విద్యాలయాల్లో ఏకరూప ధారణ ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాలయాల ప్రాంగణాల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించడాన్ని కర్ణాటక ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో నిషేధించడంతో వివాదం మరింత ముదిరి కర్ణాటక హైకోర్టు కు చేరింది. ఈ ఏడాది మార్చి 15న హైకోర్టు విద్యాలయాల ప్రాంగణాల్లో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేసేందుకు తిరస్కరించింది. తదుపరి కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments