HomeNewsLatest Newsహింసాత్మకంగా నిరసనలు

హింసాత్మకంగా నిరసనలు

రైల్వేస్టేషన్‌పై దాడి
బాలికలపై స్కూల్‌ అటెండర్‌ లైంగిక వేధింపులపై
థానెలో పెద్ద ఎత్తున ఆందోళనలు

థానె : మహారాష్ట్ర థానెలోని బద్లాపుర్‌లో ఇద్దరు విద్యార్థినులపై పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల్ని నిరసిస్తూ మంగళవారం చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పాఠశాల గేటు, గోడలు, బెంచీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం రైల్‌ రోకో నిరసన నిర్వహించారు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు లోకల్‌ రైళ్ల రాకపోకలను స్తంభింపజేశారు. స్టేషన్‌పై రాళ్ల దాడులకు పాల్పడ్డారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు సిబ్బందిని తొలగించింది. నిందితులపై అత్యాచారం యత్నం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లు మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు. బద్లాపుర్‌లోని ఓ పాఠశాల్లో ఇటీవల ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది. నాలుగేళ్ల వయస్సున్న ఇద్దరు విద్యార్థులు టాయిలెట్‌కు వేళ్లారు. అదే సమయంలో దానిని శుభ్రం చేసే వంకతో అటెండర్‌, బాలికల వద్దకు వెళ్లి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. వారిలో ఓ బాలిక ప్రైవేటు భాగాల్లో నొప్పిగా ఉందని తల్లిదండ్రలకు చెప్పవడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. మరో బాలిక పాఠశాలకు వెళ్లాలంటే భయపడింది. ఈ విషయంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ఈ విషయంలో జాప్యం చేసినందుకు ఓ పోలీసు అధికారిని బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.
రైల్వే సేవలు నిలిపివేత
ఈ ఘటనపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైల్‌ రోకో నిర్వహించారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచే ఈ నిరసనలను చేపట్టారు. ఈ క్రమంలో చాలా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం రంగంలోకి దిగిన అధికారులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించివేశారు. బద్లాపుర్‌ నుంచి కర్జాత్‌ మధ్య రైల్వే సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 10 మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కర్జాత్‌-పన్‌వేల్‌-ఠాణే స్టేషన్‌ మీదుగా మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రిన్సిపల్‌తో సహా ఇద్దరు సిబ్బంది సస్పెన్షన్‌
ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం బాధిత కుటుంబాలకు క్షమాపణలను తెలియజేసింది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అంతేకాకుండా ప్రిన్సిపల్‌ను, ఆ పిల్లల క్లాస్‌ టీచర్‌, వారి బాధ్యతలు చూస్తున్న సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. అటెండర్‌ను పంపించిన కంపెనీ కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల ఆవరణంలో నిఘాను పెంచునున్నట్లు అధికాలు తెలిపారు.
న్యాయం చేస్తామని సిఎం హామీ
మరోవైపు ఈ ఘటనలో నిందితుడిపై అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్లు సిఎం ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు. అలాగే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించి, న్యాయం చేస్తామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్‌ ఠాక్రే డిమాండ్‌ చేశారు. ఒకవైపు మహిళల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, మరోవైపు ఆడపిల్లలకు భద్రత లేదని వాపోయారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments