అన్నీ తానైన భట్టివిక్రమార్క
క్షేత్రస్థాయిలో స్పందన కరువు
పదిలంగానే ఓటు బ్యాంకు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో ఒకప్పుడు కాంగ్రెస్‌కు పెట్టని కోట. కేంద్ర మం త్రులు, ముఖ్యమంత్రులను అందించిన జిల్లా నిన్న, మొన్నటి వరకు ఏ ఎన్నికలు వచ్చినా హస్తం గాలి వీచేది. రాష్ట్రంలో ఎదురు గాలి ఉన్నా ఇక్కడి గాలెప్పుడు హస్తానికి వాలుగానే ఉండేది. అయితే 2018 శాసన సభ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క జెడ్పిటిసి స్థానానికి పరిమితం కాగా, ఖమ్మం జిల్లాలో మూడు స్థానాలకు పరిమితమైంది. ఇక సర్పంచులు, ఎంపిటిసిలు గతంతో పోల్చుకుంటే పదో వంతు కూడా గెలవని పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో నూ, సహకార సంఘ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. రాష్ట్రంలో ఎన్నికలకు మూడేళ్ల సమయం మిగిలి ఉన్నప్పటికీ దుబ్బాక గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించాయి. కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయా అనే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఎంఎల్‌సి ఎన్నికలు, వెనువెంటనే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు రానున్నాయి. ఈ రెండింటిలోనూ మరోమారు పార్టీ ప్రతికూల ఫలితాలను పొందే అవకాశం కన్పిస్తుంది. మధిర, భద్రాచలం నియోజక వర్గాలు మినహాయిస్తే ఎక్కడ నియోజక వర్గస్థాయి నాయకులు ఉత్సాహంగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. కొత్తగూడెం, పాలేరు, సత్తుపల్లి, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట వంటి చోట్ల పార్టీ అనాథగా మిగులుతుందన్న భావన వ్యక్తమవుతుంది. సిఎల్‌పి నాయకుడు మల్లు భట్టివిక్రమార్క అన్ని తానై వ్యవహరిస్తున్నా గతానికి భిన్నంగా జిల్లా నలుమూలాల చుట్టేస్తున్నా ఆశించిన స్థాయిలో కదిలిక కన్పించడం లేదు. ఉమ్మడి జిల్లాలోనే అన్ని నియోజక వర్గాల బాధ్యులను నియమించి పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపే పని ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ల మధ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరకంగా నలిగిపోతున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనులు కావడం లేదన్న నిరాశ రోజు రోజుకు తీవ్రమవుతుంది. కార్యకర్తల వెన్నంటి నిలిచి మేమున్నాం పదమంటూ భరోసా ఇచ్చే నాయకుడే కరువయ్యాడు. ఇటువంటి పరిస్థితి నెలకొన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ప్రతి గ్రామంలోనూ ఓటు బ్యాంకు ఉండడం, ఆటుపోట్లను తట్టుకుని కూడా నిలబడడం విశేషం. ఇక ఖమ్మం కార్పొరేషన్‌కు సంబంధించి మాజీ శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు , నగరాధ్యక్షులు జావిద్ కార్యకర్తల్లో కదిలిక తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డివిజన్ వారీ బాధ్యులను నియమించి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ బిజెపి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం ఏదో జరగబోతుందన్న భ్రమను కలిగించడంలో కాస్త ముందు వరుసలో నిలవడంతో కాంగ్రెస్‌లో అనుకున్న ఉత్సాహం రావడం లేదు. ఖమ్మం నగరంలో ప్రతికూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనూ మంచి ఫలితాలనే సాధించింది. కాంగ్రెస్‌లో ఉన్న ముగ్గురు కార్పొరేటర్లు నాగండ్ల దీపక్‌చౌదరి, యర్రం బాలగంగాధర్ తిలక్, వడ్డెబోయిన నర్సింహారావులు ఉత్సాహంగానే పని చేస్తున్నప్పటికీ ఎక్కడో వెలితి కన్పిస్తుంది. క్యాడర్‌లో ఉన్న ఆవేదనను పొగొట్ట గలిగితే అత్యుత్తమ ఫలితాలు రాకపోయినా ఫర్వాలేదనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్ ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఖర్చును భరించే నేతలు కూడా ముందుకు వస్తే తప్ప ఆశించిన ఫలితాలు దక్కవన్న వాస్తవాన్ని నేతలు గుర్తెరగాలి. పార్టీకి ఓట్లు ఉన్నా, కాంగ్రెస్‌ను ఆదరించే జనం ఉన్నా నాయకత్వమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నాయకులు ఎక్కువై టిఆర్‌ఎస్ ఇబ్బందులు పడుతుంటే నేతలు లేక కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుంది. సరైన వారిని రంగంలోకి దింపి క్యాడర్‌లో ఉన్న నైరాశ్యాన్ని పొగొట్టాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు.
హస్త విలాపం
RELATED ARTICLES