నాదల్, కెర్బర్, జ్వరేవ్ ముందంజ
ఆస్ట్రేలియా ఓపెన్
మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిలు సిమోనా హలెప్ (రుమేనియా), ఎలినా స్విటోలినా(ఉక్రెయిన్), కెర్బర్‌లు రెండో రౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), ఐదో సీడ్ డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా), జాన్ ఇస్నర్ (అమెరికా) తదితరులు తొలి రౌండ్‌లో జయకేతనం ఎగుర వేశారు. ఇంతకుముందే ప్రస్తుత ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా), మాజీ విజేత రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్, టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) తదితరులు శుభారంభం చేసిన విషయం తెలిసిందే.
రెండో రౌండ్‌లో నాదల్
ఇక, మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో అగ్రశ్రేణి ఆటగాడు నాదల్ సునాయాస విజయం సాధించాడు. బొలివియా ఆటగాడు హుగో డెలిన్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన నాదల్ 6-2, 6-3, 6-0తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తన మార్క్ షాట్లతో అలరించిన నాదల్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాడు. నాదల్ అసాధారణ ఆటను కనబరచడంతో హొగో ఏ దశలోనూ నాదల్‌కు ఎదురు నిలువలేక పోయాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల వరుసగా మూడు సెట్లు గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. చివరి సెట్‌లో మాత్రం నాదల్ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే విజయం సాధించాడు. మరో పోటీలో ఏడో సీడ్ జ్వరేవ్ విజయం సాధించాడు. ఇటలీ ఆటగాడె మార్కొ సెచ్చినాటోతో జరిగిన పోరులో జ్వరేవ్ కాస్త చెమటోడ్చి నెగ్గాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో జ్వరేవ్ 6-4, 7-6, 6-3తో విజయాన్ని అందుకున్నాడు. తొలి రెండు సెట్లలో జ్వరేవ్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న జ్వరేవ్ జయకేతనం ఎగుర వేశాడు.
హోరాహోరీ పోరులో అండర్సన్..
మారథాన్ మ్యాచ్‌లకు మరో పేరుగా చెప్పుకునే అమెరికా స్టార్, 19వ సీడ్ జాన్ ఇస్నర్ తొలి రౌండ్‌లో చెమటోడ్చి నెగ్గాడు. నాలుగు సెట్ల హోరాహోరీ సమయంలో ఇస్నర్ 6-7, 7-6, 7-6, 7-6తో బ్రెజిల్‌కు చెందిన థియాగో మొంటెరియోను ఓడించాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. మొదటి సెట్‌లో థియాగో పైచేయి సాధించాడు. టైబ్రేకర్ వరకు వెళ్లిన పోరులో ఇస్నర్‌ను కంగుతినిపించాడు. అయితే తర్వాతి మూడు సెట్లలో ఇస్నర్ ఆధిపత్యం చెలాయించాడు. ఈ మూడు సెట్లు కూడా టైబ్రేకర్ వరకు వెళ్లడం విశేషం. ఆసక్తికరంగా సాగిన పోరులో ఇద్దరు కూడా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన ఇస్నర్ వరుసగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరోవైపు కెవిన్ అండర్సన్ (సౌతాఫ్రికా) కూడా మొదటి రౌండ్‌లో అతి కష్టం మీద విజయం సాధించాడు. ఐదు సెట్ల ఉత్కంఠ సమరంలో బెలారస్‌కు చెందిన లవష్కాను ఓడించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో అండర్సన్ 6-4, 2-6, 4-6, 6-4, 7-6తో ప్రత్యర్థి ఓడించాడు. ఆరంభం నుంచే ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌ను అండర్సన్ సొంతం చేసుకున్నాడు. కానీ, రెండు, మూడు సెట్లలో ప్రత్యర్థి విజయం సాధించాడు. అయితే కీలకమైన చివరి రెండు సెట్లలో గెలిచిన అండర్సన్ జయభేరి మోగించాడు. నాలుగో సీడ్ మెద్వెదేవ్ రష్యా తొలి రౌండ్‌లో అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్‌ను ఓడించాడు. ఆసక్తికరంగా సాగిన పోరులో మెద్వెదేవ్ 6-3, 4-6, 6-4, 6-2తో జయకేతనం ఎగుర వేశాడు. డొమినిక్ థిమ్ 6-3, 7-5, 6-2తో ఆడ్రియాన్ మన్నారియో(ఫ్రాన్స్)ను ఓడించాడు.
హలెప్ అలవోకగా..
ఇక, మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ సిమోనా హలెప్ విజయం సాధించింది. తొలి రౌండ్‌లో హలెప్ అమెరికా క్రీడాకారిణి జెన్నిఫర్ బ్రాడీను ఓడించింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన హలెప్ 7-6, 6-1తో ప్రత్యర్థిని ఓడించింది. తొలి సెట్‌లో హలెప్‌కు ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైంది. అయితే తర్వాతి సెట్‌లో మాత్రం హలెప్‌కు ఎదురు లేకుండా పోయింది. చివరి వరకు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో పోటీలో ఉక్రెయిన్ స్టార్ స్విటోలినా చెమడోట్చి నెగ్గింది. బ్రిటన్‌కు చెందిన కెటి బౌల్టర్‌తో జరిగిన పోరులో స్విటోలినా 6-4, 7-5తో జయకేతనం ఎగుర వేసింది. ఇరత పోటీల్లో కికి బెర్టెన్స్ (డచ్), అంజెలిక్ కెర్బర్ (జర్మనీ), కొలిన్స్ (అమెరికా) తదితరులు విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
హలెప్ అలవోకగా..
RELATED ARTICLES