వేతనాలు పెంచాలని అగ్రిమెంటు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవటం పట్ల ఆగ్రహం
ప్రజాపక్షం/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సివిల్ హమాలీలుగా పనిచేస్తున్న వేలాది కార్మికులు బుధవారం నుండి సమ్మెకు దిగారు సంబంధిత అధికారులకు ముందుగా సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవటంతో సమ్మెను ప్రారంభించారు. హమాలీ యూనియన్లు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం డిసెంబర్ 2019తో ముగిసినప్పటికీ కొత్త ఒప్పందం కోసం ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకోలేదు. అనేక దఫాలుగా యూనియన్లు అధికారులకు, ప్రభుత్వానికి వినతి పత్రాలు అందించినప్పటికీ ఎలాంటి ఫలితంలేదు. పెరుగుతున్న ధరల దృష్టిలో పెట్టుకొని పెంచాలని ఎన్ని విజ్ఞప్తులు చేసిన నిరుపయోగంగా మిగిలాయి. రెండు సంవత్సరాలకొకసారి హమాలీల వేతనాలు పెంచాలని అగ్రిమెంటు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటం కార్మికుల పట్ల వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. వెంటనే అధికారులు జోక్యం చేసుకునేలా
చూసి హమాలీల వేతనాల సమస్యను పరిష్కరించాలని ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.యస్.బోస్, కార్యనిర్వాహక అధ్యక్షులు యం.డి.యూసుఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని ఎఐటియుసి నాయకులు, కార్మిక సంఘాలు ప్రతి జిల్లాలోని సివిల్ సప్లయీస్ హమాలీస్ చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపి సంఘీభావ కార్యక్రమాలు చేయవల్సింది పిలుపునిస్తున్నారు.
హమాలీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం : మారెడ్డి
పౌరసరఫరాల సంస్థలో పనిచేసే హమాలీల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, పేద ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా తక్షణమే సమ్మెను విరమించి విధులకు హజరు కావాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హమాలీ యూనియన్లకు విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విధులకు హజరైన వెంటనే అన్ని హామాలీల యూనియన్లతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపడతామని ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హమాలీల న్యాయపరమైన సమస్యల విషయంలో సానుకూలంగా ఉన్నామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ -19 నేపధ్యంలో సేద ప్రజలకు నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలని, గోదాముల్లో బియ్యం లోడింగ్, అన్లోడింగ్ సమస్యలు రాకుండా, రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా జరగాలని విజ్ఞప్తి చేశారు.
హమాలీల సమ్మె
RELATED ARTICLES