HomeNewsBreaking Newsహన్మకొండలో సిపిఐ.. చలో కలెక్టరేట్‌

హన్మకొండలో సిపిఐ.. చలో కలెక్టరేట్‌

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నా
ప్రజల వైపో… భూ కబ్జాదారుల వైపో తేల్చుకోండి : సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ
ప్రజాపక్షం/వరంగల్‌
రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల స్ధలాల కోసం పోరాడుతున్న పేదల వైపు ఉంటుందో, భూకబ్జాలకు పాల్పడుతున్న ల్యాండ్‌ మాఫియా వైపు ఉం టుందో తేల్చుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే వరంగల్‌ నగర పర్యటనకు వచ్చిన కెసిఆర్‌ సిపిఐ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్న కాలనీలు తిరిగి ‘మీకు అందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం. గుడిసెలు లేని నగరంగా వరంగల్‌ను మారుస్తాం’ అని హామీ ఇచ్చి ఎనిమిదేండ్లు గడిచినా నేటికీ హామీని అమలు చేయలేదని విమర్శించారు. పేదలను ఆత్మ గౌరవంతో నిలబెట్టడం కోసమే సిపిఐ భూ పోరాటాలకు పిలుపునిచ్చిందని ఆయన స్పష్టం చేశారు. హన్మకొండలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్‌, హన్మకొండ జిల్లాల పరిధిలో ప్రభుత్వ స్ధలాలలో గుడిసెలు వేసుకున్న పేదలు వేలాది మంది హన్మకొండలోని ఏకశిలా పార్కుకు తరలివచ్చారు. తోలుత స్ధానిక రోడ్డుపై బైటాయించి భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అవుతుంటే వాటి పరిరక్షణ కోసం నిలువ నీడలేని పేదలే ఆ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది వుంటే ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం భూకబ్జాదారుల వైపు నిలబడితే తాము చాకలి ఐలమ్మ స్పూర్తితో పేదల తరుపున తుపాకులు పట్టుకుని పోరాడేందుకు కూడా సిద్దమని అన్నారు. పేదలు ఉంటే భూములపైనా లేదంటే జైళ్లలో ఉండేందుకైనా సిద్దమని అన్నారు. ఇండ్ల స్ధలాలు పేదలకు దక్కే వరకూ భూపోరాటాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ధర్నాకు వేలాదిగా తరలి వచ్చిన ప్రజలతో హన్మకోండ బస్టాండ్‌ నుండి నక్కలగుట్ట కాళోజీ సెంటర్‌ వరకు రోడ్డు కిక్కిరిసి పోయింది. ధర్నా అనంతరం ఏకశిలా పార్కు నుండి వరంగల్‌, హన్మకొండ కలెక్టరేట్‌ల ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన గుడిసె వాసులు, సిపిఐ నాయకులు కార్యకర్తలను కాళోజీ సెంటర్‌కు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సిపిఐ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నాయకులను కలెక్టర్‌లకు వినతిపత్రం అందించేందుకు మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పడంతో వరంగల్‌, హన్మకొండ జిల్లాల కలెక్టర్‌లకు డాక్టర్‌ కె నారాయణతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు నేతృత్వంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, హన్మకొండ వరంగల్‌ జిల్లాల కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి, రాష్ట్ర నాయకులు పంజాల రమేష్‌, జిల్లా సహయ కార్యదర్శులు తోట బిక్షపతి, ఎస్‌కె.బాష్‌ మియా, పనాస ప్రసాద్‌, ఎఐవైఎప్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సయ్యద్‌ వలీ వుల్లా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కేసులతో భూపోరాటాలను ఆపలేరు
వరంగల్‌ టౌన్‌: సిపిఐ నేతలపై, గుడిసెవాసులపై ప్రభుత్వం, పోలీసులు అక్రమ కేసులు పెట్టి భూపోరాటాలను ఆపలేరని, ఎంత నిర్భంధం పెడతారో అంత ఉవ్వెత్తున ఉద్యమం పెరుగుతుందని, నిలువనీడ లేని పేద ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ భూ పోరాటాన్ని కొనసాగిస్తుందని డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధిలోని బొల్లికుంట శివారు సర్వే నెంబర్‌ 476, 484, 506 ప్రభుత్వ భూమిలో సిపిఐ ఆధ్వర్యంలో పేద ప్రజలు గుడిసెలు వేసుకున్న ప్రాంతాన్ని డాక్టర్‌ కె.నారాయణ సోమవారం సందర్శించారు. సిపిఐ మండల కార్యదర్శి దండు లక్ష్మన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నారాయణ మాట్లాడుతూ కెసిఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి అనేది లేదని, కమిషన్‌ ఏజెంట్లను పెట్టుకుని ప్రాజెక్టులను నిర్మిస్తూ తన సొంత ఆస్తులను పెంచుకునే రీతిలో కెసిఆర్‌ వ్యవహరిస్తున్నాడని, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు గన్నారపు రమేష్‌, సంగీ ఎలేందర్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ల్యాదల్ల శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments