ఏళ్ల తరబడి నిద్రలో సూర్యాపేట మున్సిపల్ అధికారులు
అకస్మాత్తుగా నిబంధనలు గుర్తొచ్చి హద్దురాళ్లు తొలగిస్తున్న సిబ్బంది
2015 నుండి అధికారులు ఏం చేశారంటూ విమర్శలు
ప్లాట్ల విక్రయానికి ముందు ఏం చేశారంటూ నిలదీత
ప్రజాపక్షం/ సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా రియల్టర్లు అక్ర మ వెంచర్లు చేశారంటూ గత వారం రోజులుగా హడావుడి చేస్తూ హద్దురాళ్ళను తొలగిస్తున్నారు. అధికారుల తీరు పలు విమర్శలకు దారితీస్తుంది. నిబంధనల పేరుతో హద్దురాళ్ళను తొలగిస్తున్నామని చెప్పే అధికారులకు ఏళ్ల తరబడి నుండి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా ఎందుకు పట్టించుకోలేదని, నేడు హద్దురాళ్ళను తొలగించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నా రు. రియాల్టర్ల నుండి ముడుపులు స్వీకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు నేడు నిబంధనల మాట వారి నోట రావడం దొంగే దొంగ అన్న చందంగా ఉంది. మున్సిపల్ అధికారులు అక్టోబర్ 2015 నుండి సూర్యాపేట మున్సిపల్ పరిధిలో చేసిన 200 ఎకరాల వెంచర్లలో అధికారులు నిబంధనల పేరుతో హద్దురాళ్ళు తొలగిస్తున్నారు. వెంచర్లు చేసిన రియాల్టర్లు ఆరు నెలల్లోపే తమ ప్లాట్లు అన్ని విక్రయించి జేబులు నింపుకొని పోయిన తరువాత హద్దురాళ్ళను తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీరితీరు రియాల్టర్లను బాగు చేసి నేడు నిల్వ నీడ కోసం కొనుగోలు చేసుకున్న ప్లాట్ల విక్రయదారులపై తమ ప్రతాపం చూపడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర రాజధానికి హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మార్గ మధ్యంలో 65వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న సూర్యాపేట రియల్ రంగంలో గత 10 ఏళ్లుగా కనివిని ఎరుగనిరీతిలో దూసుకపోతుంది. మహానగరాలను తలదన్నెలా భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. సూర్యాపేట ప్రాంతంలో వ్యవసాయ భూములను వెంచర్లుగా చేసి రియల్టర్లు ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. రియల్టర్లు తమ వ్యాపారాన్ని ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాల్సి ఉన్నా అవి ఏవి పట్టించుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతోపాటు అధికారులను మచ్చిక చేసుకొని తమ వ్యాపార లావాదేవీలు కొనసాగించారు. వ్యవసాయ భూములను మొదట స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారితో నాలా కనవర్షన్ చేయించుకున్న అనంతరం పట్టణ ప్రాంతంలో వెంచర్ చేసే వారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అనుమతిని కూడా విధిగా తీసుకోవల్సి ఉంది. గ్రామీణ ప్రాంతంలో వెంచర్లు చేసే వారు కూడా నాలా కనవర్షన్ చేయించుకోవడంతోపాటు, గ్రామ పంచాయితీ అనుమతి పొందాల్సి ఉంది.