ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో నిరంకుల పాలన
పీపుల్స్ డిమాండ్స్‌డే ‘ఆన్‌లైన్ బహిరంగసభ’లో వామపక్షాల నేతలు
ప్రజాపక్షం/హైదరాబాద్: ఆత్మబలిదానాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ, దొరలపాలన సాగుతోందని వామపక్షపార్టీల నాయకులు విమర్శించారు. భావ వ్యక్తీకరణ, ప్రజాస్వామ్య హక్కులను సిఎం కెసిఆర్ కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మా ణం కోసం మరో పోరాటానికి సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలంగా ణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం -పీపుల్స్ డిమాండ్స్ డే’ అనే అంశంపై హైదరాబాద్‌లో మంగళవారం ‘ఆన్‌లైన్ బహిరంగ సభ’ను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, తాజా పరిణామాలు, కెసిఆర్ పాలన తదితర అంశాలపై వారు మాట్లాడారు. కరోనా వైరస్ నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమాయ్యయని, అందుకే కేసులు పెరుగుతున్నాయని విమర్శించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు భరోసా, ఆర్థిక సహకారం అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కరోనా నెపం తో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు ధారదత్తం చేస్తోందని విమర్శించారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే వాదన తెరమీదకు వస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రాణహిత- మార్చి 80 మీటర్ల నుండి 618 మీటర్ల ఎత్తుకు సాధించడమే ఒక ఘన విజయంగా చెప్పుకుంటున్నారన్నారు. కొండపోచమ్మ నీరు వస్తే మొత్తం పచ్చగా అవుతున్నట్టుగా చూపిస్తున్నారన్నారు. కృష్ణ జలాలను కూడా వాడుకోలేని పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని, నిరుద్యో భృతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.3 లక్షల కోట్లకు దాటిందని, బంగారు తెలంగాణ అని చెబుతున్నారని, బంగారం ఎక్కడ ఉన్నదని చాడ ఎద్దేవా చేశారు. నైజాం రాజుల కాలంలో ఉన్న చట్టాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయని, వాటిని సవరించాలని గత ఉమ్మడి రాష్ట్రంలో ఆ చట్టాల్లో మారుపుల కోసం అసెంబ్లీలో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ చట్టాలు అమలులో ఉన్నాయన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో కబ్జాకోరులకు అధికారం వస్తుందన్నారు. నిజాయితీ పరులు, నిబద్ధతో ఉన్నవారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఉస్మానియా భూములు అన్యాక్రాంతమైతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు. రాష్ట్రంలో భూములను సర్వే నంబర్ల వారీగా సర్వేచేసి, రెవెన్యూ లొసుగులు తొలగించి, రెవెన్యూ చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కబడుతోందని, ప్రజాస్వామ్య విలువలు పాతర పడుతున్నాయని, ఇందిరాపార్కు ధర్న చౌక్ కోసం ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రతిపక్షాలు లేని తెలంగాణను కోరుకుంటున్నారని, రాష్ట్రంలో పౌర హక్కులకు, ప్రజాస్వామిక విలువలు పాతర వేయబడుతున్నాయని, ప్రజాస్వామ్య ముసుగులో ఏక వ్యక్తి పాలన సాగుతోందని దుయ్యబట్టారు. పోడుభూముల అంశం చర్చనీయాంశంగా మారిందని, పోడుభూములను స్వాధీనం చేసుకునే పరిస్థితి వస్తోందని, ప్రభుత్వ భూములు అదృశ్యమవుతున్నాయని, రికార్డులు మాయమవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ఆరోగ్యం ఎక్కడుందని, ప్రజలకు వైద్యం అందుబాటులో ఉన్నదా…? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, ఉద్యమ ఆకాంక్షలను అమలు చేయాలని, ఉద్యోగాల నియామకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజలందరికీ వామపక్షపార్టీలు అండగా ఉంటాయని చాడ వెంకట్‌రెడ్డి భరోసానిచ్చారు.
సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని, అభివృద్ధి అంటే అంకెల గారడీ కాదని, ప్రజల జీవితాల్లో అభివృద్ధి కావాలన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, జూన్, జులైలో మరో 4,5 లక్షల కేసులు వ్యాపించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. సందేట్లో సడేమీయాలాగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటు వారికి అప్పగించే చర్యలు చేపడుతోందని ఆరోపించారు. వలస కార్మికులను తరలించేందుకు రైళ్లు, బస్సుల సౌకర్యాన్ని కల్పిస్తున్నారని, ఇదే ప్రయత్నం ముందే చేసి ఉంటే బాగుండేదన్నారు. కరోనా వైరస్ 396, 536 కేసులు నమోదైనప్పుడు దేశ వ్యాప్తంగా కట్టడి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండు లక్షల వరకు పాజిటీవ్ కేసులు చేరే సమయంలో మాత్రం గుంపులకు, వైన్ షాపులకు అనుమతినిచ్చారని, ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉన్నదా అని అన్నారు. బొగ్గునిల్వలను కార్పోరేట్ శక్తులకు విక్రయిస్తే ఎలా..?, చివరకు కేంద్రం అంతరిక్షాన్ని కూడా వదిలిపెట్టలేదని, రోదసిలో కూడా ప్రైవేటు పెట్టుబడులను, అలాగే డిఫెన్స్ పరికరాల్లో కూడా విదేశీ పెట్టుబడులు ఆహ్వానించి, ప్రపంచ దేశాలకు తొత్తుగా కేంద్ర ప్రభుత్వం మారిందని, ఇది దేశభక్తి ఉన్న ప్రభుత్వం చేసేది కాదని తెలిపారు. ఆరోగ్య సమస్యలను పరిష్కరించే సత్తా కార్పోరేట్ శక్తులకు లేదన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే సిఎంకు పడదని, ఏకపక్షంగానే వ్యవహరిస్తారన్నారు. కరోనా నివారణలో కేరళ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని, ప్రతిపక్షాలతో కలిసి ఐక్యంగా కరోనాను ఎదుర్కొన్నారని, ఆ ఐక్యత స్ఫూర్తి తెలంగాణలో కనిపించడం లేదని , అంతా ‘నేనే’ అని సిఎం అనుకుంటున్నారని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంలో సగం జీతాలే ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు.
సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మిక సంఘాలు లేకుండా చేస్తున్నాయన్నారు. ప్రజలు డెంగీ, కొవిడ్‌తో సహజీవనం చేయాలి, కెసిఆర్ మాత్రం అధికారంతో సహజీవనం చేస్తారా అని ప్రశ్నించారు.
సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్దన్ మాట్లాడుతూ ఆర్‌టిసికి చెందిన కోట్ల రూపాయాల విలువ చేసే ఆస్తులను అమ్ముకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ వనరులన్నీ అమ్ముకునేందుకు సిద్ధమైందన్నారు. ప్రభుత్వం ఏది చెప్పినా అందులో రెండు అర్థాలు ఉంటున్నాయన్నారు.
ఎస్‌యుసిఐ(సి) రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్ మురహరి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి అయిన తర్వాత సిఎం కెసిఆర్ ప్రజా స్వేచ్ఛపైన, ప్రజాతంత్ర విలువలు, భావాలపై దాడి చేశారన్నారు. పత్రిక విలేకరులకు కూడా స్వేచ్ఛ లేదన్నారు.
ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక నియంత రాష్ట్రానికి సిఎం అయ్యారన్నారు. నిరుద్యోగ భృతి నెరవేరలేదన్నారు. తన కుమార్తె బాధపడుతోందని కెసిఆర్ ఆమెకు ఎంఎల్‌సి పదవి ఇస్తున్నారన్నారు.
సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలలో నిరాశ మిగిలిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదన్నారు.
సిపిఐ(ఎం.ఎల్- లిబరేషన్) రాష్ట్ర కార్యదర్శి రాజేశ్ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వామపక్ష శక్తులు దేశంలో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
హక్కులను కాలరాస్తున్నారు..
RELATED ARTICLES